ఏం చేద్దాం?

6 Nov, 2018 03:07 IST|Sakshi
మహాకూటమి సమావేశం అనంతరం తిరిగి వెళ్తున్న ఉత్తమ్, భట్టి, కోదండరాం

కూటమి భాగస్వామ్యపక్షాలు అడుగుతున్న స్థానాలపై కాంగ్రెస్‌ ముఖ్యుల చర్చ

హోటల్‌లో కుంతియా, ఉత్తమ్, జానా, భట్టి, గూడూరు భేటీ

పాల్గొన్న ఏఐసీసీ కార్యదర్శులు.. సాయంత్రం టీజేఎస్‌ నేత కోదండరాంతో భేటీ

కూటమి నుంచి ఎవరూ బయటకు వెళ్లరన్న ఉత్తమ్‌

కోదండరాంతో చర్చలు ఫలప్రదం..చాడతోనూ చర్చిస్తున్నామన్న టీపీసీసీ చీఫ్‌

సాక్షి, హైదరాబాద్‌: మహాకూటమిలోని భాగస్వామ్య పార్టీల మధ్య పొత్తు చర్చలు కీలకదశకు చేరుకున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్‌కు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐల మధ్య చర్చలు ఊపందుకున్నాయి. సోమవారం కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య నేతలు హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో సమావేశమయ్యారు. భేటీలో టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్, పార్టీ ముఖ్య నేతలు జానారెడ్డి, భట్టి విక్రమార్క, గూడూరు నారాయణరెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌.సి.కుంతియా, ఏఐసీసీ కార్యదర్శులు బోసు రాజు, శ్రీనివాస కృష్ణన్, సలీం అహ్మద్‌ పాల్గొన్నారు.

ఉదయం ఉత్తమ్, జానా తదితరులు సమావేశమై మిత్రపక్షాలు అడుగుతున్న స్థానాల విషయమై ఏం చేయాలన్న దానిపై చర్చించారు. పార్టీ పక్షాన పోటీ చేయాల్సిన 95 స్థానాలు, ఇతర పార్టీలు అడుగుతున్న సీట్ల విషయంపై చర్చించారు. సాయంత్రం టీజేఎస్‌ అధినేత కోదండరాంతో కాంగ్రెస్‌ నేతలు భేటీ అయ్యారు. కాంగ్రెస్‌ ఇవ్వాలనుకుంటున్న స్థానాల జాబితాను కోదండరాంకు ఇచ్చినట్లు, పార్టీలో చర్చించి తన నిర్ణయం వెల్లడిస్తానని ఆయన చెప్పినట్లు సమాచారం.

దీపావళి తెల్లారి...
భాగస్వామ్య పక్షాల మధ్య చర్చలను పూర్తి చేసుకుని దీపావళి మరుసటి రోజున అన్ని వివరాలతో కూటమి పక్షాన అధికారిక ప్రకటన చేయనున్నారు. ‘పండుగ తెల్లారి కూటమిలోని అన్ని పార్టీల నేతలతో కలసి ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది.. కూటమి ఒప్పందం ఏంటి?.. కనీస ఉమ్మడి ప్రణాళిక(సీఎంపీ)లో అంశాలపై అధికారికంగా ప్రకటన చేస్తాం. 9న అభ్యర్థులందరి జాబితా ప్రకటించాలన్న తొందర మాకేమీ లేదు. 19 వరకు నామినేషన్ల దాఖలుకు సమయం ఉంది. అప్పటివరకు అన్నీ సర్దుకుంటాయి’ అని కూటమి ఏర్పాటులో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న ఓ పార్టీ నేత వెల్లడించారు.

11 ఖరారు... 11 తకరారు
తెలుగుదేశం పార్టీ పోటీ చేయనున్న 14 లేదా 15 స్థానాల్లో ఏయే స్థానాలను వదులుకోవాలన్న విషయంలో కాంగ్రెస్‌ పార్టీ కూడా స్పష్టతతోనే ఉంది. మొత్తం 11 స్థానాలను టీడీపీకి ఇచ్చేందుకు కాంగ్రెస్‌ అంగీకరించినట్టు తెలుస్తోంది. ఇందులో ఖమ్మం, అశ్వారావుపేట, సత్తుపల్లి, మక్తల్, ఉప్పల్, ముషీరాబాద్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, చార్మినార్, మలక్‌పేట నియోజకవర్గాలున్నట్టు సమాచారం.

జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, సికింద్రాబాద్, కోదాడ, ఎల్బీనగర్, నకిరేకల్, నిజామాబాద్‌ రూరల్, వరంగల్‌ (ఈస్ట్‌), వరంగల్‌ (వెస్ట్‌), పటాన్‌చెరుల్లో మిగిలిన మూడు లేదా నాలుగు స్థానాలను టీడీపీకి కేటాయించనున్నారు. ఇందులో కోదాడకు, ఎల్బీనగర్‌కు మధ్య టీడీపీ ముడిపెడుతున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్‌ సిట్టింగ్‌ స్థానమైన కోదాడను తమకు ఇస్తే, తమ సిట్టింగ్‌ స్థానమైన ఎల్బీనగర్‌ను వదులుకుంటామని టీడీపీ అంటోంది.

కోదాడలో కాంగ్రెస్‌ పోటీ చేయాలనుకుంటే మాత్రం ఎల్బీనగర్‌లో తాము బరిలో ఉంటామని స్పష్టం చేస్తోంది. ఒకవేళ మధ్యేమార్గంగా కోదాడ, ఎల్బీనగర్‌ స్థానాలు రెండూ కాంగ్రెస్‌కు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే నల్లగొండ జిల్లాలోని నకిరేకల్‌(ఎస్సీ) స్థానాన్ని టీడీపీ అడుగుతోంది. ఎల్బీనగర్‌ను ఆర్‌.కృష్ణయ్యకు ఇవ్వాలనుకుంటే పటాన్‌చెరును తమకివ్వాలని అంటోంది.

కూకట్‌పల్లికి పెద్దిరెడ్డి
తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, టీటీడీ బోర్డు సభ్యుడు ఇనుగాల పెద్దిరెడ్డిని కూకట్‌పల్లి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయించాలని టీడీపీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. మిగిలిన స్థానాల్లో టి.వీరేందర్‌గౌడ్‌(ఉప్పల్‌), ఎం.ఎన్‌.శ్రీనివాస్‌(ముషీరాబాద్‌), ఆనందప్రసాద్‌ (శేరిలింగంపల్లి), గణేశ్‌ గుప్తా (రాజేంద్రనగర్‌), నామా నాగేశ్వరరావు(ఖమ్మం), మెచ్చా నాగేశ్వరరావు(అశ్వారావుపేట), సండ్ర వెంకటవీరయ్య(సత్తుపల్లి), కొత్తకోట దయాకర్‌రెడ్డి (మక్తల్‌), మస్కతి అలీ(చార్మినార్‌), ముజఫర్‌ అలీఖాన్‌ (మలక్‌పేట)లను బరిలో దించాలని టీడీపీ దాదాపు నిర్ణయించినట్టు సమాచారం.

కూటమిగానే ఎన్నికలకు: ఉత్తమ్‌
కోదండరాంతో సమావేశమైన అనంతరం హోటల్‌ వద్ద మీడియాతో మాట్లాడిన ఉత్తమ్‌ తమ కూటమి నుంచి ఏ పార్టీ బయటకు వెళ్లదని ధీమా వ్యక్తం చేశారు. చర్చల మధ్యలోనే కోదండరాం బయటకు వెళ్లారన్న వార్తల్లో వాస్తవం లేదని, ఆయనతో చర్చలు ఫలప్రదమయ్యాయని చెప్పారు.

పార్టీ నేతలతో చర్చించి చెబుతామని చెప్పి చర్చలు ముగిసిన తర్వాతే కోదండరాం వెళ్లిపోయారని అన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డితో కూడా చర్చలు జరుపుతున్నామని, నేడు లేదా రేపు కూటమి చర్చలు పూర్తవుతాయని వెల్లడించారు. పార్టీ స్క్రీనింగ్‌ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు తాను మంగళవారం ఢిల్లీ వెళుతున్నట్టు ఉత్తమ్‌ చెప్పారు.

>
మరిన్ని వార్తలు