సీఎం కళ్లకు కమ్మిన అధికార పొరలు కరిగిపోతున్నాయ్‌!

23 Sep, 2018 11:59 IST|Sakshi

హోదాపై చంద్రబాబు కాంగ్రెస్‌ మద్దతు కోరడం సిగ్గుచేటు

కేవీపీ రామచంద్రరావు మండిపాటు

సాక్షి, విజయవాడ : ప్రత్యేక హోదాకు ప్రతినిధి అయినట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు విమర్శించారు. ప్రత్యేక హోదా వద్దు.. ప్రత్యేక ప్యాకేజీ కావాలని నాడు చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటన చేశారని, ఇప్పుడు అదే అసెంబ్లీలో ప్రత్యేక హోదా కావాలని ఆయనే ప్రకటిస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబుకు కేవీపీ బహిరంగ లేఖ రాశారు. కేంద్రం హోదాను ఇవ్వడం లేదని తెలిసే.. చంద్రబాబు కొత్త డ్రామాలు ఆడుతున్నారని ఆయన విమర్శించారు.

ఇప్పుడు ప్రత్యేక హోదా కావాలంటూ చంద్రబాబు హడావుడి చేస్తున్నారని, ప్రత్యేక హోదాకు కాంగ్రెస్ పార్టీ మద్దతు కావాలని సీఎం కోరడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. ఎన్నికలు వస్తుండటంతో చంద్రబాబు కళ్ళకు కమ్ముకున్న అధికార పొరలు కరిగిపోతున్నాయని, మళ్ళీ ఏపీ ప్రజలకు జరిగిన అన్యాయం ఆయనకు గుర్తుకువస్తోందని విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ చేసిన పోరాటానికి ఏనాడూ చంద్రబాబు మద్దతు ఇవ్వలేదని గుర్తుచేశారు. కనీసం పార్లమెంటులో ప్రైవేటు బిల్లుకు కూడా ఆయన సహకరించలేదని తెలిపారు. ఇప్పుడు హోదా అంటూ చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, చిత్తశుద్ధి ఉంటే.. హోదా ఉద్యమకారులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని కేవీపీ డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు