కేసీఆర్‌ బద్దకిస్టు సీఎం

18 Nov, 2018 01:48 IST|Sakshi

ఫాంహౌస్‌కే పరిమితమయ్యారు

కమీషన్ల కోసమే తెలంగాణలో నీటిపారుదల ప్రాజెక్టులు

మీట్‌ ది ప్రెస్‌లో టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అత్యంత బద్దకస్తుడని, సచివాలయానికి రాకుండా ఫాంహౌస్‌కే పరిమితమయ్యారని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ ఆరోపించారు. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా పైరవీ భవన్‌ ఏర్పాటు చేసుకుని దొరపాలన సాగించారని విమర్శించారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ ఫెడరేషన్‌ (టీడబ్ల్యూజేఎఫ్‌) ఆధ్వర్యంలో శనివారం జరిగిన మీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నా రు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు 2019లో ఒకేసారి వస్తాయని భావించామని, కానీ కేసీఆర్‌ అసమర్థత వల్ల డిసెంబర్‌లోనే ముందస్తు ఎన్నికలు అనివార్యమయ్యాయని అన్నారు.

ఒకేసారి ఎన్నికలు వస్తే ప్రజాధనం భారీగా మిగిలేదని, అలాకాకుండా వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించడంతో ఖజానా పై తీవ్ర భారం పడుతుందన్నారు. తెలంగాణలో ప్రతిపక్షాలే లేవన్న కేసీఆర్‌.. ప్రతిపక్షాలు ఇబ్బందులకు గురిచేస్తున్నందునే ఎన్నికలకు వెళ్తున్నట్లు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశా రు. ప్రతిపక్షాలకు చెందిన దాదాపు 30 మంది ఎమ్మెల్యేలను తన పార్టీ లోకి చేర్చుకుని ఎలా బలహీనుడయ్యాడో అర్థంకావడం లేదని వాపోయా రు. కేసీఆర్‌ మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్‌లా భావించి వాటిని అమలు చేయడం లేదన్నారు.

యువతకు ఉద్యోగాలు ఇవ్వడంలో కేసీఆర్‌ పూర్తి గా విఫలమయ్యారని, బీజేపీతో లోపాయికారీ ఒప్పందంతో ప్రజలను వెర్రివాళ్లని చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్‌ ఐదు సార్లు రూ. 6.5 లక్షల కోట్ల బడ్జెట్‌ ప్రవేశపెట్టారని, కానీ కాళేశ్వరంప్రాజెక్టును మాత్రం పూర్తి చేయలేదన్నారు. కమీషన్ల కోసమే నీటిపారుదల ప్రాజెక్టులను రీడిజైనింగ్‌ చేస్తున్నారని ఆరోపించారు. వార్‌ వన్‌సైడ్‌ ఉంటుందన్న కేసీఆర్‌ ఒకసారి ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వెళ్లిరావాలని సూచించారు.

రాష్ట్రంలో పెరుగుతోన్న మాఫియాలు..
రాష్ట్రంలో ల్యాండ్, ఇసుక మాఫియాలు పెరిగిపోయాయని రమణ ఆరోపించారు. పబ్‌ కల్చర్‌ కూడా పెరగడంతో యువత పెడదోవ పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని సమస్యలు పరిష్కరిస్తానన్న కేసీఆర్‌.. ప్రజల గొంతు వినిపించే ధర్నాచౌక్‌ను ఎత్తేశారని విమర్శించారు.

కేటీఆర్‌కు రాజకీయ సన్యాసం ఇప్పించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నా రని, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను ఎదుర్కొనేందుకే మహాకూటమి ఏర్పాటైందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్టుల సమాఖ్య అధ్యక్ష, కార్యదర్శులు ఎం.సోమయ్య, బసవపున్నయ్య, హైదరాబాద్‌ జర్నలిస్టు యూనియన్‌ అధ్యక్ష, కార్యదర్శులు చంద్రశేఖర్, పద్మరాజు, విజయానంద్, రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు