తాను తప్పు చేసి ప్రతిపక్షంపై ఎదురుదాడి

13 Mar, 2019 01:26 IST|Sakshi

సీఎం చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి ధ్వజం  

సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు ఐదేళ్ల పాలనలో తాను ఎన్నో తప్పులు చేసిందిగాక.. ప్రతిపక్షంపై ఎదురుదాడి చేస్తూ వచ్చారని, ఇప్పుడు ప్రభుత్వ డేటా చోరీ విషయంలోనూ అలాగే వ్యవహరిస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి ధ్వజమెత్తారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి ఈరోజు ఆయన విగ్రహానికే దండవేసే శాడిస్ట్‌ మనస్తత్వం చంద్రబాబుదని తూర్పారపట్టారు. మంగళవారం ఆమె హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఐదేళ్ల పాలనలో పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిన చంద్రబాబు తన గురించి తాను అతిగా పొగుడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. సీఎంగా 14 ఏళ్లు, రాజకీయ నాయకుడిగా 40 ఏళ్ల అనుభవమున్న చంద్రబాబు తన మొత్తం కెరీర్‌లో ఈ ప్రాజెక్టు తెచ్చాను.. ఈ మంచి పథకం ప్రవేశపెట్టానని చెప్పగలడా? అని ప్రశ్నించారు. సీఎంగా ఉండి గోప్యంగా ఉంచాల్సిన ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేసి, తనకు అనుకూలమైన ప్రైవేట్‌ సంస్థలకు ఇచ్చారని దుయ్యబట్టారు. సొంత ఇమేజీ లేని ఆయన 1994లో ఎన్టీఆర్‌ గెలిపించిన పార్టీని కాజేసి, ఆ పెద్దాయనకు వెన్నుపోటు పొడిచి పదవిలోకి వచ్చాడని గుర్తుచేశారు. ఎన్టీఆర్‌ హయాంలో రాష్ట్ర అప్పు రూ.3 వేల కోట్లుంటే.. చంద్రబాబు తన గత పదవీకాలంలో రూ.60 వేల కోట్లకు తీసుకెళ్లాడని, ఇప్పుడీ ఐదేళ్లలో అప్పు మొత్తాన్ని రూ.2.60 లక్షల కోట్లకు చేర్చాడని దుయ్యబట్టారు. 

26 కేసుల్లో స్టే తెచ్చుకున్న నువ్వు నీతివంతుడివా?
చంద్రబాబు జీవితమే అబద్ధాల పుట్ట, నోరు తెరిస్తే అబద్ధమేనని లక్ష్మీపార్వతి విమర్శించారు. ప్రతిపక్షనేత జగన్‌కు ప్రజల్లో అభిమానం పెరిగిపోతుందన్న భయంతో ఆయన్ను చంపించేందుకూ వెనుకాడని వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. నారా లోకేష్‌కు స్టాన్‌ఫోర్డ్‌ వర్సిటీ నుంచి సర్టిఫికెట్‌ కొనిచ్చి.. ఎలాంటి తెలివితేటల్లేని ఆ అబ్బాయిని విద్యావేత్త అంటూ ప్రచారం చేస్తున్నాడని తూర్పారపట్టారు. 26 కేసుల్లో స్టే తెచ్చుకున్న చంద్రబాబు నీతివంతుడా? అని ప్రశ్నించారు. పట్టిసీమ, నీరు–చెట్టు, పోలవరం.. అన్నింటిలోనూ అవినీతికి పాల్పడ్డారన్నారు. వైఎస్సార్‌సీపీకి నేతలు 25 మందిని హత్య చేశారని, భూకుంభకోణాలు, కాల్‌మనీ–సెక్స్‌రాకెట్‌లన్నీ చంద్రబాబు హయాంలోనే జరిగాయని తెలిపారు. వీటిపై విచారణ జరగకుండా.. సీబీఐని దర్యాప్తుకు రాకుండా అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. వ్యవస్థలన్నింటినీ చంద్రబాబు భ్రష్టు పట్టించారన్నారు. రాజధానికోసం 16సార్లు శంకుస్థాపనలు చేశారని, ఇలా ఎన్నో నేరాలు ఘోరాలకు పాల్పడిన చంద్రబాబుకు మాట్లాడే హక్కు లేనే లేదన్నారు. వైఎస్‌ జగన్‌పై సీబీఐ అధికారిగా ఉన్నప్పుడు లేనిపోని కేసులు బనాయించిన జేడీ లక్ష్మీనారాయణ ముసుగు తొలగిపోయిందని, కుట్రలు బయటపడ్డాయని లక్ష్మీపార్వతి అన్నారు. చిన్న కేసులతో 16 నెలలపాటు జగన్‌ను జైలులో పెట్టారంటే ఎంతగా కుట్ర పన్నారో తెలిసిపోయిందన్నారు. జేడీతో కలసి కుట్రలకు పాల్పడ్డ బాబు అడ్రస్‌ ఈ ఎన్నికల్లో గల్లంతు కాబోతోందన్నారు.  

మరిన్ని వార్తలు