ఓర్వలేకే విమర్శలు

29 Sep, 2019 05:03 IST|Sakshi

చంద్రబాబుకు ఇల్లు లేదంటే చందాలేసి కట్టిస్తా: లక్ష్మీపార్వతి 

జనరంజకంగా ముఖ్యమంత్రి జగన్‌ పాలన

సాక్షి, అమరావతి: అధికారం చేపట్టిన తొలి రోజు నుంచే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర హామీలను నెరవేరుస్తూ జనరంజకంగా పాలిస్తుంటే ప్రతిపక్ష చంద్రబాబు అక్కసుతో అర్థం లేని విమర్శలు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీ పార్వతి మండిపడ్డారు. దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి అడుగుజాడల్లో ముఖ్యమంత్రి జగన్‌ పాలన సాగుతోందన్నారు. శనివారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు తీరును తీవ్రంగా తప్పు బట్టారు.

ఒకేదఫాలో 4 లక్షలకు పైగా ఉద్యోగాల భర్తీ, ఆర్టీసీ విలీనానికి చర్యలు, ఆశా వర్కర్ల జీతాల పెంపు, వృద్ధాప్య పింఛన్ల పెంపు లాంటివి ఎన్నో నాలుగు నెలల్లోనే సీఎం జగన్‌ అమలు చేసి చూపారన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టి పథకాలను నేరుగా పేదల ఇళ్లకే చేరవేసేందుకు ముఖ్యమంత్రి జగన్‌ తాపత్రయ పడుతుంటే చంద్రబాబు ఓర్వలేక అక్కసు వెళ్లగక్కుతున్నారని దుయ్యబట్టారు. రూ.6 లక్షల కోట్ల మేర అవినీతి, కుంభకోణాలకు పాల్పడిన చంద్రబాబుకు ముఖ్యమంత్రిని విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. సరిగ్గా మాట్లాడటం కూడా రాని లోకేష్‌ ట్విట్టర్‌ బాబుగా పేరు తెచ్చుకున్నారని వ్యాఖ్యానించారు. 

బాబుకు ఆస్కార్‌ ఇవ్వొచ్చని ఎన్టీఆరే అన్నారు.. 
స్పీకర్‌ పదవికి మచ్చ తెచ్చిన కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకుంటే శవ రాజకీయం చేసిన చంద్రబాబు ఆయన జీవించి ఉండగా కనీసం అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు. చంద్రబాబు నీచమైన కుట్రలకు ఎల్లో మీడియా వంత పాడుతోందన్నారు. మాజీ ముఖ్యమంత్రి భార్యనైన తనపై నాడు రెండు చానెళ్లతో చంద్రబాబు తీవ్ర దుష్ప్రచారం చేయించారని చెప్పారు. కరకట్టపై చంద్రబాబు ఉంటున్న అక్రమ నివాసం ఆయనకు ఏమైనా వారసత్వంగా వచ్చిందా? అని లక్ష్మీపార్వతి ప్రశ్నించారు. చంద్రబాబు –  లింగమనేని రమేష్‌కు మధ్య ఉన్న రహస్యాలన్నీ తేటతెల్లం అయిపోయాయన్నారు.

రమేష్‌ భూములు సీఆర్‌డీఏ పరిధిలోకి రాకుండా చంద్రబాబు సాయం చేశారని చెప్పారు. నిజంగా చంద్రబాబుకు సెంటు భూమి కూడా లేకుంటే చందాలు వేసుకుని తన అల్లుడికి 200 గజాల్లో ఇల్లు కట్టించి ఇవ్వడానికి అత్తగా సిద్ధంగా ఉన్నానని వ్యంగ్యంగా అన్నారు. చంద్రబాబుకు నటనలో ఆస్కార్‌ అవార్డు ఇవ్వవచ్చని దివంగత ఎన్టీఆరే స్వయంగా చెప్పారని గుర్తు చేశారు. 

మరిన్ని వార్తలు