హత్యా రాజకీయాలకు బాబు ట్రేడ్‌మార్కు

30 Oct, 2018 05:07 IST|Sakshi

     లోకేష్‌ కోసం జగన్‌ను అంతమొందించాలనుకున్నారు 

     వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్వతి ధ్వజం 

సాక్షి, హైదరాబాద్‌: హత్యా రాజకీయాలకు సీఎం చంద్రబాబు ట్రేడ్‌మార్క్‌ అని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి ధ్వజమెత్తారు. తన కుమారుడు నారా లోకేశ్‌ భవిష్యత్‌ కోసం ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ను అంత మొందించేందుకు చంద్రబాబు కుట్ర పన్నారని ఆమె ఆరోపించారు. ఆపరేషన్‌ గరుడ కూడా చంద్రబాబు పథకమేనని దుయ్యబట్టారు. లక్ష్మీపార్వతి సోమవారం హైదరాబాద్‌లోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వెన్నుపోట్లు, హత్యా రాజకీయాలు, అవినీతి, అన్యాయాలకు చంద్రబాబు కేరాఫ్‌ అడ్రస్‌ అని విమర్శించారు.

రాజకీయ ప్రత్యర్థులను ప్రత్యక్షంగా ఎదుర్కోవడం చంద్రబాబుకు చేతకాదన్నారు. ఎన్టీఆర్‌ను టీడీపీ నుంచి సస్పెండ్‌ చేసి ఆయన్ని మానసిక క్షోభకు గురి చేశాడని గుర్తు చేశారు. ఆ తర్వాత ఆయన మరణానికి కారణమైన చంద్రబాబు.. ఇప్పుడు ఎన్టీఆర్‌ పేరు చెప్పుకుని బతుకుతున్నాడని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్‌ బతికే ఉండి ఉంటే చంద్రబాబు దుర్మార్గపు రాజకీయాలు చూసి ఆత్మహత్య చేసుకునేవారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబువన్నీ దగుల్బాజీ రాజకీయాలని.. వంగవీటి రంగా, దశరథరామ్‌తో పాటు అనేక మంది హత్యలతో చంద్రబాబుకు సంబంధాలున్నట్లు అప్పట్లో పత్రికలు కూడా చెప్పాయన్నారు.  

ప్లాన్‌ బెడిసి కొట్టిందనే ఢిల్లీ వెళ్లావా?: చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్సార్‌సీపీకి చెందిన అనేక మంది నేతలను హత్య చేశారని.. చివరకు ఆయన చెంతకు చేరిన అరకు ఎమ్మెల్యే కిడారి కూడా హతమయ్యారంటే రాష్ట్రంలో పాలన ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చని లక్ష్మీపార్వతి పేర్కొన్నారు. ప్రజా సంకల్పయాత్రలో జగన్‌కు లభిస్తున్న జనాదరణను చూసి భరించలేక ఆపరేషన్‌ గరుడ అంటూ స్కెచ్‌ వేసి మట్టు బెట్టాలనుకున్నారని దుయ్యబట్టారు. దీనికి కర్త, కర్మ, క్రియ అన్నీ చంద్రబాబేనన్నారు.

త్వరలో జరగనున్న ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతుందని అన్ని సర్వేలూ స్పష్టంగా చెబుతుండటంతో.. చంద్రబాబు ఈ ఆపరేషన్‌ గరుడను తెరపైకి తెచ్చాడని మండిపడ్డారు. జగన్‌పై హత్యాయత్నం జరిగిన గంటలోపే వాస్తవాలను వక్రీకరిస్తూ ప్రకటన చేసిన డీజీపీ అసలు ఆ పదవికి అర్హుడేనా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతపై వేసిన ప్లాన్‌ బెడిసి కొట్టిందని ఢిల్లీకి వెళ్లావా? లేక రక్షణ కోసం వెళ్లావా? అని చంద్రబాబును ప్రశ్నించారు. 

మరిన్ని వార్తలు