‘జేడీ ముసుగు తొలిగిపోయింది’

12 Mar, 2019 13:18 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి

సాక్షి, హైదరాబాద్‌ : సీబీఐ మాజీ జాయింట్‌ డైరెక్టర్‌ లక్ష్మీనారాయణ ముసుగు తొలిగిపోయిందని, ఆయన చంద్రబాబు నాయుడు మనిషేనని స్పష్టమైందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు లక్ష్మీపార్వతి తెలిపారు. మంగళవారం ఆమె పార్టీ కేంద్రకార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. జేడీ లక్ష్మీనారాయణ టీడీపీ మనిషేనని తమ పార్టీ ఎప్పటి నుంచో చెబుతుందని, ఆయన టీడీపీలో చేరుతున్నట్లు ఆ పార్టీ అనుకూల మీడియాలో రావడంతో ఈ విషయం సుస్పష్టమైందన్నారు. రాజకీయ కుట్రతోనే చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్‌లు కుమ్మక్కై అన్యాయంగా జగన్‌పై కేసులు పెట్టారని మండిపడ్డారు. సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌గా బాధ్యతగా వ్యవహరించాల్సిన లక్ష్మీనారాయణ టీడీపీ అనుకూల మీడియాతో చేతులు కలిపి కేసుపై లీకుల మీద లీకులిస్తూ.. జగన్‌పై అసత్య ఆరోపణల​‍కు కారణమయ్యారని ధ్వజమెత్తారు. ఈ కేసుతో జగన్‌పై అసత్యాలను సృష్టించి అనుకూల మీడియాతో ప్రచారానికి వాడుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సీఎం స్థాయిలో ఉన్న చంద్రబాబు నీచంగా దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 26 కేసుల్లో స్టే తెచ్చుకొని తనకు తాను నీతిమంతుడిగా ప్రచారం చేసుకుంటున్నారని, ఆయన జీవితమంతా నికృష్టమైన, నీచమైన రాజకీయం తప్ప రాష్ట్రానికి చేసిందేమి లేదని విమర్శించారు. చంద్రబాబు సొంతంగా అధికారంలోకి వచ్చిన చరిత్రలేదని, ఆయన పొత్తుపెట్టుకోని పార్టీ లేదన్నారు. దివంగత ఎన్టీఆర్ హయాంలో రూ.3 వేల కోట్లుగా ఉన్న అప్పును రూ.60 వేల కోట్లకు పెంచి రుణాంధ్రప్రదేశ్‌గా మార్చిన ఘనత బాబుదేనని మండిపడ్డారు. రైతులను కాల్చి చంపిన చరిత్ర కూడా ఆయనదేన్నారు.  చంద్రబాబు హయాంలో కంటే దివంగత మహానేత వైఎస్సార్‌ హయాంలోనే ఐటీ రంగం బాగా వృద్ధి చెందిందన్నారు. 

లోకేశ్‌కు స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి చంద్రబాబు సర్టిఫికేట్ కొనిచ్చారని ఎద్దేవా చేశారు. ఎంఏ తర్వాత పీహెచ్‌డీ చేసి ఆ తర్వాత ఎంఫీల్ చేశానని చంద్రబాబు చెప్పడం బీకాంలో ఫిజిక్స్ చేసినట్లుగానే ఉందని ఈ సందర్భంగా లక్ష్మీపార్వతి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నవ్యాంధ్రను అవినీతిలో నెంబర్‌వన్‌గా తీర్చిదిద్దిన ఘనత ఆయనదేనని విమర్శించారు. రాజ్యాంగ విలువల్ని తుంగలో తొక్కుతూ.. పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేశాడని మండిపడ్డారు. అమరావతిలో రాజధానికి 16 సార్లు శంఖుస్థాపన చేసి.. వర్షానికి నీళ్లు వచ్చే భవనం కట్టారని, జగన్ అనే పేరు వినిపిస్తేనే చంద్రబాబు ఉలిక్కిపడుతున్నారన్నారు. అధికారంలోరాగానే చంద్రబాబు అక్రమాలను బయటకు తీసి, విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు. ఇక ఓటర్లు తమ ఓటు ఉందో లేదో చూసుకోవాలని, ఓట్ల దొంగలున్నారని జాగ్రత్తగా ఉండాలని సూచించారు. జగన్‌ చేసిన బీసీ డిక్లరేషన్‌ బాగుందని, ప్రజల నమ్మకాన్ని గెలిచేది జగనేనన్నారు. చంద్రబాబు తాత్కలికమైన పథకాలు నమ్మవద్దని ప్రజలను కోరారు.

మరిన్ని వార్తలు