లెక్కలు తప్ప మొక్కలు లేవు: యెండల

15 Jul, 2018 02:23 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వం నాటామని చెబుతున్న మొక్కలు కాగితాల్లో తప్ప ఎక్కడా లేవని బీజేఎల్పీ మాజీ నేత యెండల లక్ష్మీనారాయణ ఆరోపించారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ హరితహారంలో భాగంగా మూడేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 80 కోట్ల మొక్కలు నాటినట్టుగా ప్రభుత్వం లెక్కలు చెబుతోందని, దీని ప్రకారం ఒక్కో గ్రామ పంచాయతీలో కనీసం 65 వేల నుంచి 68 వేల మొక్కలు ఉండాలన్నారు. కానీ, ఏ గ్రామంలో ఇన్ని వేల మొక్కలు ఉన్నాయో చూపాలని ప్రభుత్వాన్ని సవాల్‌ చేశారు. కాగితాల్లో లెక్కలు తప్ప మొక్కలు ఎక్కడున్నాయని ప్రశ్నించారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పేరిట ప్రజలను ప్రభుత్వం మోసం చేస్తున్నదని విమర్శించారు.

టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో పేదలకు ఎన్ని ఇళ్లు ఇచ్చారో చెప్పాలన్నారు. గ్రామజ్యోతి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వ పథకంగా ఎలా చెప్పుకుంటారని సీఎంని, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రిని యెండల ప్రశ్నించారు. బీసీ జనగణన విషయంలో కోర్టు ప్రశ్నించే అవకాశముందని తెలిసినా నిర్దేశిత విధానం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించలేదని విమర్శించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం ఎంతో కసరత్తు చేస్తున్నట్లుగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టిందని, ఎన్నికలను వాయిదా వేయడానికి అన్ని రకాల కుట్రలకు పాల్పడిందని ఆరోపించారు. రాష్ట్రంలో 12,751 గ్రామపంచాయతీలుంటే కేవలం 3,494 పంచాయతీలకే కార్యదర్శులున్నారని పేర్కొన్నారు. సచివాలయానికి రాని సీఎం గ్రామకార్యదర్శులతో ఎలా సమావేశమవుతారని ఎద్దేవా చేశారు. తక్షణమే గ్రామ కార్యదర్శుల నియామకాలు చేపట్టి, ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు.  

బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శిగా రేష్మ రాథోర్‌  
సినీనటి రేష్మరాథోర్‌ బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శిగా నియమితులయ్యారు. నియామకపత్రాన్ని యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు భరత్‌గౌడ్‌ అందజేశారు. ప్రధాని మోదీ చేపడుతున్న పథకాలు నచ్చడం వల్లే పార్టీలో చేరుతున్నట్టు ఆమె చెప్పారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా