థ్యాంక్‌ యూ నితీశ్‌.. లాలూ కొడుకు ట్వీట్‌

7 Jan, 2018 09:23 IST|Sakshi

పట్నా : దాణా కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్‌ యాదవ్‌ శిక్ష కాలం ఖరారయ్యాక కోర్టు తీర్పును స్వాగతిస్తూ బీజేపీ, జేడీయూలు హర్షం వ్యక్తం చేయటం ఆర్జేడీ పార్టీ శ్రేణులకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రత్యర్థులపై ఆర్జేడీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలకు దిగుతున్నారు. 

శత్రువులతో చేతులు కలపటమే కాకుండా.. మిత్రుడి(లాలూ)ని దారుణమైన వెన్నుపోటు పొడిచారంటూ బిహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ పై ఆర్జేడీ నేతలు విరుచుకుపడుతున్నారు. లాలూను ఇబ్బందులకు గురి చేసేందుకు బీజేపీ ఓ ప్రణాళికతోనే మహా కూటమిని విచ్ఛిన్నం చేసిందని.. ఈ క్రమంలో జేడీయూ కూడా వారికి తలొగ్గిందని ఆరోపణలు చేస్తున్నారు. ఇక లాలూ తనయుడు తేజస్వి యాదవ్‌ తన ట్విట్టర్‌లో ఓ వ్యంగ్య పోస్టును ఉంచారు. థాంక్యూ వెరీ మచ్‌ నితీష్‌ కుమార్‌ అంటూ నిన్న సాయంత్రం ఆయన తన ట్విట్టర్‌ పేజీలో పేర్కొన్నారు.

అంతకు ముందు మీడియాతో మాట్లాడిన ఆయన  బీజేపీపై విమర్శలు ఎక్కుపెట్టిన విషయం తెలిసిందే. ఒకవేళ లాలూ బీజేపీతో సంధి చేసుకుని ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని చెప్పారు. ‘‘లాలూ బీజేపీ ముందు మోకరిల్లి ఉంటే.. ఆ పార్టీ ఆయన్ని రాజా సత్యహరిశ్చంద్రుడిగా అభివర్ణించి ఉండేదేమో. ఈ విషయంలో జేడీయూ చాలా ముందుంది’’ అని తేజస్వి ఎద్దేవా చేశారు. జేడీయూ నమ్మకద్రోహాన్ని మరిచిపోలేమన్న తేజస్వి ..  తీర్పుపై హైకోర్టుకు వెళ్లనున్నట్లు పేర్కొన్నారు.

ఓవైపు బీజేపీ, మరోవైపు జేడీయూలు తేజస్వి వ్యాఖ్యలను తిప్పి కొడుతున్నాయి. అవినీతి కాంగ్రెస్‌ పార్టీతో చేతులు కలిపినప్పుడే లాలూ జైలుకు వెళ్లటం ఖాయమైపోయిందని, తేజస్వి పిల్ల రాజకీయాలు మానుకోవాలని బీజేపీ సీనియర్‌ నేత ఆర్‌పీఎన్‌ సింగ్‌ సూచించగా.. లాలూ అవినీతి రాజకీయాలకు శుభం కార్డు పడిందని జేడీయూ నేత కేసీ త్యాగి తెలిపారు. 

దియోగర్‌ ట్రెజరీ నుంచి రూ.89.27లక్షలు అక్రమంగా డ్రా చేసిన కేసుకు సంబంధించి లాలూ సహా మిగతా దోషులకు రాంచీ సీబీఐ న్యాయస్థానం మూడున్నరేళ్ల జైలుశిక్ష ఖరారు చేసిన విషయం విదితమే.

మరిన్ని వార్తలు