జైలులో ఉన్నా.. ట్వీట్లు వస్తాయ్‌

26 Dec, 2017 11:36 IST|Sakshi

పట్నా: దాణా కుంభకోణం కేసులో దోషిగా తేలిన రాష్ట్రీయ జనతాదళ్‌(ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ప్రస్తుతం రాంచిలోని బిర్సా ముండా సెంట్రల్‌ జైలులో ఉన్నారు. కారాగారంలో ఉన్నప్పటికీ ఆయన ట్విటర్‌ ఖాతా పనిచేస్తూనే ఉంది. పోలీసులు ఆయనను అరెస్ట్‌ చేసిన కొద్దిసేపటికే లాలూ అధికారిక ట్విటర్‌ పేజీలో ట్వీట్‌ ప్రత్యక్షమైంది. దీంతో ఆయన అనుచరులు ఆశ్చర్యానికి లోనయ్యారు. ట్వీట్‌ చదివిన తర్వాత విషయం అర్థమైంది.

తాను జైలులో ఉన్నప్పటికీ ట్విటర్‌ ద్వారా తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటానని తెలిపారు. ట్విటర్‌ ఖాతాను తన కార్యాలయం నిర్వహిస్తుందని వెల్లడించారు. తన కుటుంబ సభ్యులను సంప్రదించి ట్వీట్లు పోస్ట్ చేస్తుందన్నారు. రాజ్యాంగం, హక్కుల పరిరక్షణకు పోరాటం కొనసాగిస్తానని ట్వీట్‌లో పేర్కొన్నారు.

అయితే జైలులో ఉండగా తన అభిప్రాయాలను ఎలా వెల్లడిస్తారనే అనుమానాన్ని ఆయన నివృత్తి చేశారు. జైలులో తనను కలుసుకునేందుకు వచ్చే సందర్శకులకు తన మనసులోని మాటలు చెబుతానని, వీరు తన కుటుంబ సభ్యులకు ఈ విషయాలు చేరవేస్తారని ట్విటర్‌లో పేర్కొన్నారు. జైలులో ఉన్నప్పటికీ మద్దతుదారులతో టచ్‌లో ఉండాలన్న ఉద్దేశంతో సోషల్‌ మీడియాను లాలూ వేదికగా చేసుకున్నారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు