అది ఆత్మహత్యతో సమానం : లాలూ ప్రసాద్‌ యాదవ్‌

28 May, 2019 14:45 IST|Sakshi

రాంచీ : కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్‌ గాంధీ రాజీనామా చేయడం ఆత్మహత్యా సదృశ్యం వంటిదేనని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ అభిప్రాయపడ్డారు. ఇది కేవలం కాంగ్రెస్‌కు మాత్రమే కాక సంఘ్‌ పరివార్‌కు వ్యతిరేకంగా పనిచేసే పార్టీలన్నింటికీ ఎదురుదెబ్బేనని వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోర పరాజయం నేపథ్యంలో అధ్యక్ష పదవికి రాహుల్‌ గాంధీ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టెలిగ్రాఫ్‌తో మాట్లాడిన లాలూ ప్రసాద్‌ యాదవ్‌.. సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీ విజయానికి విపక్షాల మూకుమ్మడి వైఫల్యమే కారణమని పేర్కొన్నారు. వ్యూహాత్మక తప్పిదాలు, చర్యల వల్లే బీజేపీని నిలువరించలేకపోయామని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా తమ ప్రధాని అభ్యర్థిని ముందుగానే ప్రకటించకుండా పెద్ద తప్పు చేశామన్నారు. వరుడు లేకుండానే పెళ్లి బారాత్‌ నిర్వహించినట్లుగా తమ పరిస్థితి తయారైందన్నారు.

రాహులే కరెక్ట్‌
‘ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తామని పట్టుపట్టడంలో ప్రాంతీయ పార్టీల తప్పేమీ లేదు. అయితే తమకంటూ నాయకుడు లేకుండా ముందుకు వెళ్లడం ద్వారా మహాఘట్‌బంధన్‌ ప్రజల విశ్వాసాన్ని చూరగొనలేకపోయింది. జాతీయ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న రాహుల్‌ గాంధీనే ప్రధాని అభ్యర్థిగా ముందుగానే ప్రకటించాల్సింది. కాంగ్రెస్‌ అద్భుతమైన మేనిఫెస్టో రూపొందించింది. ప్రజల సమస్యలను తీర్చేందుకు తగిన పరిష్కారాలు సూచించింది. కానీ కొన్ని తప్పిదాల వల్ల మేనిఫెస్టో ప్రజలకు చేరువకాలేకపోయింది అని లాలూ ఓటమికి గల కారణాలను విశ్లేషించారు.

సిద్ధాంతాల మధ్య పోరాటమిది..
‘ ఈ ఎన్నికలు.. నరేంద్ర మోదీతో... మమతా దీదీకో లేదా మాయావతి, అఖిలేశ్‌, తేజస్వీకో మధ్య యుద్ధం కాదు. ఇది ఫాసిస్టు సిద్ధాంతాలు- నిరుద్యోగ యువత, అసంతృప్త రైతులు, వెనుకబడిన వర్గాల మధ్య యుద్ధం. అయినా ప్రధానులు, ముఖ్యమంత్రులు వస్తూంటారు. పోతూంటారు. అధికారం కాదు..కేవలం ప్రజలు, జాతి మాత్రమే శాశ్వతం. అయితే అన్ని విభాగాల్లో విఫలమైన ప్రభుత్వానికి ఇంతటి మెజారిటీ ఎలా వచ్చిందోనన్న విషయం గురించి నాకు అంతుబట్టడం లేదు అని లాలూ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు