'సంక్రాంతి తర్వాత వాళ్ల సంగతి చెప్తా'

6 Jan, 2018 18:56 IST|Sakshi

సాక్షి, పట్నా : దాణా కుంభకోణం కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు మూడున్నారేళ్ల జైలు శిక్ష పడిన తర్వాత ఆయన చిన్నకుమారుడు తేజస్వీయాదవ్‌ స్పందించారు. తాను ప్రజాక్షేత్రంలోకి వెళతానని, తన తండ్రి ఇచ్చిన సందేశాన్ని వారికి వినిపిస్తానని అన్నారు. సమాజంలో పేద ప్రజలకోసం తన తండ్రిలాగే పోరాటం చేస్తానని మీడియా ప్రతినిధులకు చెప్పారు. తండ్రి లాలూకు శిక్ష పడిన అనంతరం తన పార్టీ ఆర్జేడీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో ప్రత్యేక సమావేశం అయిన అనంతరం తేజస్వీ మీడియాతో మాట్లాడారు.

ప్రధాని నరేంద్రమోదీపై ఆయన నిప్పులు చెరిగారు. తన తండ్రిపై మోదీ సర్కార్‌ తమ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌తో చేతులు కలిపి కుట్ర చేసిందని అన్నారు. రాష్ట్రంలో అసలు ప్రతిపక్షం అనేదే లేకుండా చేద్దామనే తలంపుతో తమ కుటుంబాన్ని అక్రమ కేసుల చట్రంలో ఇరికించిందని అన్నారు. 'లాలూ పేద ప్రజల రక్షకుడు. కొంతమంది నాయకులకోసమే సీబీఐ మా నాన్నపై చార్జీషీటు వేసిందని ప్రజలందరికీ తెలుసు. అయినా ఏ ఒక్కరూ మా సంకల్పాన్ని సవాల్‌ చేయలేరు. ఏం చేసినా మేం ఎవరిముందూ మోకరిల్లం. మకర సంక్రాంతి తర్వాత ప్రజాక్షేత్రంలోకి వెళ్లి కుట్రలు చేసిన వారి సంగతి చెప్తాం. న్యాయవవస్థ తన పని తాను చేసింది. మేం హైకోర్టుకు వెళ్లి బెయిల్‌ పిటిషన్‌ వేస్తాం' అని ఆయన చెప్పారు.

మరిన్ని వార్తలు