ఇంకా ఎన్ని హత్యలు జరుగుతాయో!

11 Apr, 2018 14:16 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌ పోలీసు స్టేషన్లో పోలీసుల చిత్రహింసలకు 50 ఏళ్లు వద్ధుడు మరణించడంతో ఎన్నో విషాదాంతాలు వెలుగులోకి వచ్చాయి. ఏడాది క్రితమే ఆ వృద్ధుడి 17 ఏళ్ల కూతురును భారతీయ జనతా పార్టీకి చెందిన శాసనసభ్యుడు కుల్దీప్‌ సింగ్‌ సెంగర్‌ అత్యాచారం చేశారన్న ఆరోపణలు వెలుగు చూశాయి. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఇంటి ముందే ఆ అమ్మాయి కుటుంబం సామూహికంగా ఆత్మాహుతికి ప్రయత్నిస్తే ఆ కుటుంబ సభ్యులను పోలీసులు స్టేషన్‌కు తరలించారు. వారి ఆత్మాహుతి ప్రయత్నానికి కారణమైన కుల్దీప్‌ సింగ్‌పై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

పైగా పాత ఆయుధాల కేసును తవ్వితీసి ఆ అమ్మాయి తండ్రిని ఉన్నావ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆయన హత్యతో భయపడి పోయిన ఆయన కుటుంబ సభ్యులు మరోసారి రోడ్డు మీదకు వచ్చారు. కుల్దీప్‌ సింగ్‌ తనపై చేసిన అత్యాచారం గురించి ఆ అమ్మాయి మళ్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనలపై దర్యాప్తునకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా జాతీయ మానవ హక్కుల కమిషన్‌ యూపీ ప్రభుత్వాన్ని, రాష్ట్ర పోలీసు చీఫ్‌ను ఆదేశించింది. మరోపక్క మొత్తం వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలంటూ సుప్రీం కోర్టులో పిల్‌ దాఖలయింది.

అయినప్పటికీ బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్‌ సింగ్‌పై రాష్ట్ర పోలీసులు ఇప్పటి వరకు కనీసం ఎఫ్‌ఐఆర్‌ కూడా దాఖలు చేయలేరు. అమ్మాయి తండ్రిని పోలీసు స్టేషన్‌లో హత్య చేయడంలో హస్తం ఉందన్న ఆరోపణలపై కుల్దీప్‌ సింగ్‌ సోదరుడిని మాత్రం పోలీసులు అరెస్ట్‌ చేశారు. అత్యాచార ఆరోపణల నేపథ్యంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్న డిమాండ్‌కు కూడా కుల్దీప్‌ సింగ్‌ స్పందించడం లేదు. ఈ సంఘటనలకు ముందే రాష్ట్రంలో మరో దారుణ హత్య జరిగింది. అదే న్యాయ వ్యవస్థ హత్య. బూటకపు ఎన్‌కౌంటర్లలో 40 మందిని పోలీసులు చంపేశారు. సంఘ వ్యతిరేక శక్తులను ఏరివేయడంలో ఇదే తమ పాలసీ అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ యోగి గర్వంగా ప్రకటించుకున్నారు.

సంఘ వ్యతిరేక శక్తులంటే యోగి దృష్టిలో ఎవరో? నిమ్న వర్గానికి చెందిన 17 ఏళ్ల అమ్మాయిని అత్యాచారం చేశారని ఆరోపణలను ఎదుర్కొంటున్న శాసన సభ్యుడు నేరం రుజువైతే  సంఘ వ్యతిరేక శక్తి కాదా ? మహిళకు రక్షణ కల్పించడమే తన ప్రభుత్వం ప్రాధాన్యత అని యోగి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన మొదట్లో ప్రకటించారు. యాంటీ రోమియో స్కాడ్లను ఏర్పాటు చేశారు. అవి నిజమైన ప్రేమికులను, భార్యాభర్తలను వేధిస్తుండడంతో వాటిని రద్దు చేశారు.

ఈ ఏడాది కాలంలో మహిళలపై అత్యాచారాలు రెండింతలు పెరిగాయి.  బూటకపు ఎన్‌కౌంటర్లలో మరణించిన వారిలో ఎక్కువ మంది మైనారిటీ, దళిత, ఓబీసీలే ఉన్నారు. వారే ఆయన దష్టిలో సంఘ వ్యతిరేక శక్తులా ? బూటకపు ఎన్‌కౌంటర్లకు రాష్ట్ర ప్రభుత్వమే లైసెన్స్‌ ఇస్తే లాకప్‌ డెత్‌లు జరగవా? నకిలీ ఎన్‌కౌంటర్లు పెరగవా? అధికారంలో ఉన్న పార్టీ తన రాజకీయ కక్ష సాధింపు చర్యలకు ఈ నకిలీ ఎన్‌కౌంటర్లను ఉపయోగించుకోవా? యోగి హయాంలో ఇలాంటి హత్యలు, అత్యాచారాలు ఎన్ని వినాల్సి వస్తుందో!

మరిన్ని వార్తలు