పలు పార్టీలకు ఆహ్వానం పంపిన లా కమిషన్‌

3 Jul, 2018 10:57 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఏకకాలంలో అసెంబ్లీ, లోక్‌సభకు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. దీనిపై దేశంలో ముఖ్య పార్టీ నేతలతో చర్చించేందుకు పలు పార్టీలకు లా కమిషన్‌ ఆహ్వానం పంపింది. జమిలి ఎన్నికలపై మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసేందుకు ఈ నెల 7,8 తేదీల్లో ఢిల్లీలో జరిగే సమావేశానికి హాజరుకావల్సిందిగా దేశంలో ముఖ్య రాజకీయ పార్టీలను లా కమిషన్‌ ఆహ్వానించింది. దేశవ్యాప్తంగా ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ భావిస్తోన్న విషయం తెలిసిందే. ఈ అంశాన్ని పలు రాజకీయ పార్టీ ఆహ్వానించగా, కాంగ్రెస్‌ మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. సమావేశానికి హాజరుకావల్సిందిగా లా కమిషన్‌ కోరిందని, తమ పార్టీ నుంచి ఎవ్వరు హాజరు కావట్లేదని కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది.

ఒడిషా సీఎం నవీన్‌ పట్నాయక్‌ జమిలి ఎన్నికలకు తమ మద్దతు ఉంటుందని ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, ఒడిషా, సిక్కిం, అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల్లో 2019లో అసెంబ్లీ, లోక్‌సభ ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీ పాలిత మహారాష్ట్ర, హర్యానా శాసనసభల పదవీ కాలం 2019 చివరిలో ముగియనుంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా రెండు విడతలుగా అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ భావిస్తోంది. కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలను ముందస్తుగా రద్దు చేయుటకు రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉంది.

మరిన్ని వార్తలు