రూ.3 వేలు వసూలు చేశారు!

15 Mar, 2018 02:58 IST|Sakshi

ఎంజీఎం ఆసుపత్రి వైద్యులపై ఎమ్మెల్సీ బాలసాని ఫిర్యాదు

ఉమ్మడి రాష్ట్రంలో అన్ని ఆసుపత్రుల్లో ఇలానే ఉండేదన్న మంత్రి లక్ష్మారెడ్డి

ఇప్పుడే కొంచెం మేలని వ్యాఖ్య

‘రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మా బంధువుకు పోస్టుమార్టం చేయమంటే డాక్టర్‌ రూ.3 వేలు లంచం అడిగాడు. ఎమ్మెల్సీ అయి న నేను, ఓ ఎమ్మెల్సీ పీఏ అక్కడే ఉన్నామన్న భయం కూడా ఆ డాక్టర్‌లో లేదు. ఇదేం పద్ధతి’
– శాసన మండలిలో ఓ ఎమ్మెల్సీ ఫిర్యాదు.

‘ఉమ్మడి రాష్ట్రంలో ఇలా డబ్బులు అడిగే పద్ధతి అన్ని ఆసుపత్రుల్లో ఉండేది. ఇప్పుడు అది కొన్ని ఆసుపత్రులకే పరిమితమైంది’
– వైద్యారోగ్య మంత్రి లక్ష్మారెడ్డి సమాధానం.

సాక్షి, హైదరాబాద్‌: ఆసుపత్రులు, ప్రభుత్వ వైద్యంపై బుధవారం శాసనమండలిలో వాడీవేడి చర్చ జరిగింది. పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలు, అనుబంధ ప్రశ్నలతో వైద్యారోగ్య శాఖ పనితీరు చర్చకు వచ్చింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మోకాళ్ల కీళ్ల మార్పిడి అంశంపై టీఆర్‌ఎస్‌ సభ్యులు గంగాధర్‌గౌడ్, బాలసాని లక్ష్మీనారాయణ, భూపతిరెడ్డి ప్రశ్నించారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రిలో జరిగిన ఓ ఘటనను సభ ముందుంచారు.

గత ఆదివారం తన బంధువు రోడ్డు ప్రమాదంలో చనిపోతే చూడ్డానికి వెళ్లానని, పోస్ట్‌మా ర్టం కోసం సిబ్బంది మధ్యాహ్నం వరకు ఎదురు చూసేలా చేసి చివరకు రూ.3 వేలు వసూలు చేసి ఆ తంతు పూర్తి చేశారని ఫిర్యాదు చేశారు. తాను, మరో ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు పీఏ అక్కడే ఉండగానే వసూళ్లు సాగాయని, మరి పేదల విషయంలో వేధింపులు ఇంకెలా ఉంటాయని సభ దృష్టికి తెచ్చారు. వీటిని నిరోధించేందుకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు.

దీనికి మంత్రి లక్ష్మారెడ్డి స్పందిస్తూ, ‘ఉమ్మడి రాష్ట్రంలో ఈ అవినీతి ఇంకా ఎక్కువగా ఉండేది. అన్ని ఆసుపత్రుల్లో వసూలు చేసేవారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అది కొన్ని ఆసుపత్రులకే పరిమితమైంది’ తెలిపారు. ఈ సమాధానంపై లక్ష్మీనారాయణ అసంతృప్తి వ్యక్తం చేశారు. సభ విరామ సమయంలో మంత్రిని కలిసి ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కుటుంబసభ్యులు చనిపోయి దుఃఖంలో ఉంటే, వైద్యులు పోస్టుమార్టం కోసం వేధిస్తున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరినట్టు తెలిపారు.

మరిన్ని వార్తలు