కాంగ్రెస్‌కు అధికారం కల్ల: మంత్రి లక్ష్మారెడ్డి

22 Dec, 2017 02:00 IST|Sakshi

కాంగ్రెస్‌ పార్టీలో రేవంత్‌ ఓ జోకర్‌ అని ఎద్దేవా

సాక్షి, హైదరాబాద్‌: జడ్చర్లలో జనగర్జన పేరిట జరిగిన కాంగ్రెస్‌ సమావేశం.. ‘కొండంత రాగం తీసి, ఏదో పాట పాడినట్టు’ గా ఉందని వైద్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఎద్దేవా చేశారు. ఆ సభకు జాతీయ నాయకులు హాజరైనా ప్రజలు పట్టించుకోలేదని, తెలంగాణకు కాంగ్రెస్‌ పీడ విరగడైందని జనం భావిస్తున్నారని, కాంగ్రెస్‌కు అధికారం దక్కడం కల్ల అని వ్యాఖ్యానించారు. గురువారం టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, జనార్దన్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డితో కలసి మంత్రి మీడియాతో మాట్లాడారు.

ఉద్యమంలో దొంగల్లా తప్పించుకు తిరిగిన కాంగ్రెస్‌ నేతలు, ఇపుడు తెలంగాణ గురించి నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారని అన్నారు. కాంగ్రెస్‌లో రేవంత్‌రెడ్డి ఓ జోకర్‌లా మారాడాని లక్ష్మారెడ్డి ఎద్దేవా చేశారు. ‘రేవంత్‌ ఓ పిట్టల దొర, పెద్ద దొంగ, నేను బాజాప్తా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారినే. మా కుటుంబానికి మా ప్రాంతంలో ఓ చరిత్ర ఉంది. గోడల మీద రంగులేసుకుని బతికిన రేవంత్‌కు ఇన్ని కోట్లు ఎలా వచ్చాయో చెప్పాలి’ అని ప్రశ్నిం చారు.  జడ్చర్లలో కాంగ్రెస్‌ నేతలు వ్యక్తి గత విమర్శలకు దిగటం వారి దౌర్భాగ్యానికి నిదర్శనమని శ్రీనివాస్‌గౌడ్‌ విమర్శించారు. తెలంగాణలో టీడీపీకి పట్టిన గతే కాంగ్రెస్‌కూ పడుతుందని జనార్దన్‌రెడ్డి హెచ్చరించారు.    

ఈజేహెచ్‌ఎస్‌ బకాయిలు త్వరలోనే చెల్లిస్తాం: ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిస్టుల ఆరోగ్య సేవల పథకంపై ఎలాంటి అపోహలు వద్దని, వైద్య సేవలు కొనసాగుతాయని మంత్రి సి.లక్ష్మారెడ్డి చెప్పారు. నగదు రహిత వైద్య సేవల బకాయిలను త్వరలోనే పూర్తిగా చెల్లిస్తామని తెలిపారు.

మరిన్ని వార్తలు