గడీల కోటలు బద్దలు కొట్టండి

8 Oct, 2018 01:36 IST|Sakshi

బీజేపీ రాష్ట్ర  అధ్యక్షుడు లక్ష్మణ్‌ పిలుపు

సాక్షి, హైదరాబాద్‌: బడుగులకు రాజ్యాధికారం కావాలంటే గడీల కోటలు బద్దలు కొట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ పిలుపునిచ్చారు. ఆదివారం ముషీరాబాద్‌లో బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో బీసీ సంఘాల ఆత్మీయ కలయిక పేరిట జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే లక్ష్మణ్, కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ హాజరయ్యారు. ఈ సందర్భంగా లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. తెలంగాణ పోరాటంలో కీలకంగా వ్యవహరించిన సబ్బండ వర్గాలు, బడుగులకు సొంత రాష్ట్రం వచ్చినా ఒరిగిందేమీ లేదన్నారు.

కేసీఆర్‌ కుటుంబంలోని ఆ నలుగురే లాభపడ్డారని విమర్శించారు. సెక్రటేరియట్‌కు రాని, ప్రజలను కలవని సీఎం కేసీఆర్‌ ఒక్కరేనని లక్ష్మణ్‌ ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం బీసీలను దారుణంగా మోసం చేసిందని ఆరోపించారు. అందుకే, ఈ ఎన్నికల్లో గడీల కోటలు బద్దలు కొట్టి, బడుగులు రాజ్యాధికారం చేపట్టాలని పిలుపునిచ్చారు. ఇప్పటిదాకా బీసీ ఫెడరేషన్‌ రూపురేఖలు ఏర్పడలేదని వాపోయారు.

113 కులాల్లో 100 కులాలు ఇంతవరకూ చట్టసభల్లోకి అడుగుపెట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీల్లోని అన్ని కులాలు సంఘటితమైతేనే రాజ్యాధికారం సాధ్యమన్నారు. బీసీ నేత మోదీ ప్రధాని కావడం కాంగ్రెస్‌కు ఇష్టం లేదని, అందుకే ఆయన వస్త్రాలు, ఆహార్యంపై నిత్యం విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

ఉన్నత విద్యతోనే ఎదుగుదల: దత్తాత్రేయ
బీసీలు అన్ని రంగాల్లో రాణించాలంటే విద్య ఎంతో అవసరమని కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ అన్నారు. ఉన్నత విద్య కలిగి ఉన్నప్పుడే బీసీలు తమకు జరుగుతున్న అన్యాయంపై చైతన్యవంతులు అవుతారని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు తీసుకుంది, ముందుండి పోరాడింది బీసీలేనని పునరుద్ఘాటించారు. ఒక్కో కులానికి సంక్షేమ భవన్‌ కట్టిస్తానన్న సీఎం ఎన్ని కులాల భవనాలను పూర్తి చేశారో చెప్పాలని నిలదీశారు.

మరిన్ని వార్తలు