అసహ్యకరం.. మీ భాష

7 Oct, 2018 01:12 IST|Sakshi

కేసీఆర్, ఉత్తమ్‌లపై లక్ష్మణ్‌ ధ్వజం

10న కరీంనగర్‌లో బీజేపీ సమరభేరీ సభ

మార్పు కోసం బీజేపీ నినాదంతో ప్రజల్లోకి

సాక్షి, హైదరాబాద్‌: ఆపద్ధర్మ సీఎం కేసీఆర్, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉపయోగిస్తున్న భాష అసహ్యకరంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ విమర్శించారు. కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జ్‌ కృష్ణదాస్‌ తదితరులతో కలిసి ఆయన పార్టీ కార్యాలయంలో శనివారం విలేకరులతో మాట్లాడారు.

రాజకీయ విధానాలు, ప్రజల సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలు వంటివాటిపై కాకుండా వ్యక్తిగత అంశాలపై, దిగజారుడు భాషతో విమర్శించుకోవడం మంచి సాంప్రదాయం కాదన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నిక ల షెడ్యూల్‌ను విడుదల చేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ వైఫల్యాలు, కాంగ్రెస్‌పార్టీ అవకాశవాద రాజకీయాలను ప్రజల్లో ఎండగడతామన్నారు. మార్పుకోసం బీజేపీ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్తామని చెప్పారు.

గెలుపు గుర్రాలకే టికెట్లు
ఎన్నికలను ఎదుర్కొనేందుకు బీజేపీ సిద్ధంగా ఉం దని, ఈసారి గెలుగు గుర్రాలకే టికెట్లు ఇస్తామని లక్ష్మణ్‌ వెల్లడించారు. అభ్యర్థులను విడతల వారీగా నవంబర్‌ 12లోపే ప్రకటిస్తామన్నారు. ఈ నెల 10న కరీంనగర్‌లో బీజేపీ సమరభేరీతో సభను నిర్వహిస్తున్నామని, దీనికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా హాజరవుతారని తెలిపారు. ఈ నెల 27, 28 తేదీల్లో యువ మోర్చా సమ్మేళనం నిర్వహిస్తామని, 28న జరిగే సభకు అమిత్‌ షా హాజరవుతారన్నారు.

కాంగ్రెస్‌ టీఆర్‌ఎస్‌లు దొందూదొందే
ప్రజల సమస్యలను పట్టించుకోకుండా నాటకాలాడటంలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీలు దొందూదొందేనని లక్ష్మణ్‌ అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబుకు మోదీ ఫోబియా పట్టుకుందన్నారు. ఐటీ దాడులకు రాజకీయ రంగు పులమడం సరైంది కాదన్నారు. కాం గ్రెస్‌తో టీడీపీ పొత్తు అనైతికమన్నారు. పోతిరెడ్డిపాడు, పులిచింతల వంటి ప్రాజెక్టులు కాంగ్రెస్‌ హయాంలో జరిగినవి కావా అని ప్రశ్నించారు. ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టి టీఆర్‌ఎస్‌ లాభం పొందాలనుకుంటుందన్నారు. టీఆర్‌ఎస్‌ మునిగిపోతున్న పడవ అని, కాంగ్రెస్‌ మునిగిపోయిన పడవ అని వ్యాఖ్యానించారు. ఎంఐఎం కోరలు పీకేయడానికి బీజేపీ సిద్ధంగా ఉందని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు