రాహుల్‌ క్షమాపణ చెప్పాల్సిందే: లక్ష్మణ్‌

16 Nov, 2019 14:44 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఆధారాలు లేని ఆరోపణలు చేసి బీజేపీపై బురద చల్లాలని అనుకుంటే చూస్తూ ఊరుకోమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్షణ్‌ హెచ్చరించారు. రఫెల్‌ వ్యవహారంపై రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలకు నిరసనగా అంబేద్కర్‌ విగ్రహం వద్ద బీజేపీ నాయకులు శనివారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. రాహుల్‌ తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాహుల్‌ క్షమాపణ చెప్పేదాకా దేశ ప్రజలు వదిలిపెట్టరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆకాశం, పాతాళంలో కూడా కాంగ్రెస్‌ అవినీతి ఉంటుందని, కాంగ్రెస్‌ ఒక బెయిల్‌ గాడీ అని విమర్శించారు. పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు కర్రు కాల్చి వాత పెట్టారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ ఆలీబాబా దొంగల ముఠాలంటిదని,  దేశ సంపదను దోచుకొని విదేశాల్లో దాచుకున్నారని దుయ్యబట్టారు. 

అర్థం లేని విమర్శలు చేస్తున్నారు
రాహుల్‌ చిన్న పిల్లల మనస్తత్వంతో విమర్శలు చేస్తున్నారని, రఫెల్‌పై సుప్రీంకోర్టు చెంపపెట్టులాంటి తీర్పు ఇచ్చిందని లక్ష్మణ్‌ స్పష్టం చేశారు. క్షమాపణ చెప్పడం కాదు, నోరు అదుపులో పెట్టుకోవాలని కోర్టు సూచించిందని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్‌ నాయకులు పాకిస్తాన్‌ భాష మాట్లాడుతున్నారని, కోడిగుడ్డుపై ఈకలు పీకే రాజకీయాలు నడవవని మండిపడ్డారు. దేశ భద్రత కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచిస్తూంటే రాహుల్‌ మాత్రం అర్థంలేని విమర్శలు చేస్తున్నారని, మోదీకి మంచి పేరు వస్తుందనే రఫెల్‌పై రివ్యూ పిటిషన్‌ వేశారని ఎమ్మెల్సీ రాంచందర్‌ రావు విమర్శించారు. ప్రజలు కాంగ్రెస్‌కు బుద్ది చెప్పి మోదీకి మద్దతుగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. ధర్నాలో లక్ష్మణ్‌తో పాటు ఎ​మ్మెల్సీ రామచందర్‌రావు, పొంగులేటి సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా