కేంద్ర నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలి

21 Jan, 2019 05:25 IST|Sakshi

ప్రజలను తప్పుదారి పట్టిస్తున్న కేసీఆర్‌

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌

సాక్షి, హైదరాబాద్‌: కేంద్రం నుంచి వచ్చిన నిధులపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ ఆదివారం ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు. అలాగే ముఖ్యమంత్రి కేంద్రంపై నిందలు మోపడం మాను కోవాలని హితవు పలికారు. శాసనసభలో సీఎం కేసీఆర్‌ తన మాటలతో శాసనసభను, ప్రజలను తప్పు దారి పట్టించారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినా ఖర్చుపెట్టలేని దీన స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు.

అందరి ఆరోగ్యం కోసం కేంద్రం ఆయుష్మాన్‌ భవ పథకాన్ని తీసుకువస్తే రాష్ట్రం ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలన్నారు. రాష్ట్ర బీజేపీ నాయకత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం వల్లే భువనగిరిలో ఆలిండియా మెడికల్‌ సైన్సెస్‌ (ఏయిమ్స్‌) ఏర్పాటయిందన్నారు. రాష్ట్రంలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసిన కేంద్రంపై నిందలు మోపడం మానుకోవాలన్నారు. కాళేశ్వరం ప్రాజె క్టు, సీతారామ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు అనతికాలంలోనే ఇచ్చిన విష యం సీఎం మర్చిపోయారా అని ప్రశ్నించారు.

ప్రధాని రాష్ట్ర మంత్రులకు, పార్లమెంటు సభ్యులకు, సీఎంలకు అపాయింట్‌మెంట్లు ఇస్తుంటే...రాష్ట్ర సీఎం మంత్రులు, ప్రతిపక్షాలకు చెందిన ఎమ్మెల్యేలకు, ఇతర పార్టీ నాయకులకు ఎన్ని అపాయింట్‌మెంట్స్‌ ఇచ్చారో చెప్పాలన్నారు. గత ఐదు సంవత్సరాల్లో మోడీ ఎన్ని నిధులు ఇచ్చారో చర్చకు రావాలని సవాల్‌ చేశారు. పదేళ్ల యూపీఏ హయాంలో తెలంగాణకు దాదాపు 16 వేల కోట్లు ఇస్తే, నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక లక్ష 15 వేల కోట్ల రూపాయలు నిధులు కేటాయించిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టిన చందంగా టీఆర్‌ఎస్‌ పార్టీ, కేసీఆర్‌ వ్యవహారం ఉందని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు