ఎంఐఎం ఆగడాలను అడ్డుకుంటుంది బీజేపీనే

3 Jul, 2018 11:07 IST|Sakshi

సాక్షి, ధర్మపురి : పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలు దయ్యాలు వేదాలు వళ్లించినట్టుగా ఉన్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్‌ విమర్శించారు  బీజేపీ జన చైతన్యయాత్ర మంగళవారం జగిత్యాల జిల్లా ధర్మపురికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీపై విరుచుకుపడ్డారు. ఎంఐఎంను తమ పార్టీ విమర్శిస్తుంటే కాంగ్రెస్‌ నాయకులు తట్టుకోలేకపోతున్నారని ఆరోపించారు. ఎంఐఎం పార్టీ బీజేపీకి సహకరిస్తుందనటం విడ్డూరంగా ఉందన్నారు.

అధికారంలో ఉన్నంతకాలం ఎంఐఎంతో అంటకాగి గల్లీకి పరిమితమయిన పార్టీని ఢిల్లీ వరకు పెంచి పోషించింది కాంగ్రెసే అని.. ఒవైసీ ఢిల్లీ వెళ్లి సోనియా, రాహుల్ గాంధీని కలిసింది నిజం కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు కంటిచూపు మందగించిందని, వాళ్ళు డాక్టర్‌ను సంప్రదిస్తే మంచిదని సలహా ఇచ్చారు. ఒక్క బీజేపీ తప్ప అన్ని పార్టీలు  ఎంఐఎంతో అంటకాగుతున్న పార్టీలేనని విమర్శించారు. ఎంఐఎం పార్టీ ఆగడాలను అడ్డుకుంటున్నపార్టీ ఒక్క బీజేపీ మాత్రమేనని గుర్తు చేశారు.

బీజేపీ జన చైతన్యయాత్రకు వస్తున్న ఆదరణ చూసి కాంగ్రెస్‌ పార్టీ ఓర్చుకోలేక పోతోందని, ఈ యాత్రను ఎవరు ఎన్ని కుట్రలు చేసినా నిలువరించలేరని హెచ్చరించారు. మత పరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం అయినప్పటికీ మజ్లిస్‌ పార్టీ, మైనార్టీల ఓట్ల కోసం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 4 శాతం ఉన్న రిజర్వేషన్లు 12 శాతం పెంచాలని చూస్తుందని ఆరోపించారు.

ఘనంగా లక్ష్మణ్‌ పుట్టిన రోజు వేడుకలు...
మంగళవారం కె. లక్ష్మణ్‌ పుట్టినరోజు కావడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు కేక్ కట్‌చేసి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు లక్ష్మణ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అంతకు ముందు ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుని ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మరిన్ని వార్తలు