బీజేపీని గెలిపిస్తే టీఆర్‌ఎస్‌కు చెక్‌

20 Jan, 2020 01:25 IST|Sakshi
ఆదివారం మీడియాతో మాట్లాడుతున్న డాక్టర్‌ కె.లక్ష్మణ్‌. చిత్రంలో ఎంపీ అర్వింద్‌

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌తో ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూ 

కేసీఆర్, కేటీఆర్‌కు ఓట్లడిగే మొహం లేదు... అందుకే ప్రచారానికి రాలేదు 

2వేల వార్డుల్లో మాదే గెలుపు... కాంగ్రెస్‌కు ఓటేస్తే మోరీలో వేసినట్టే  

‘బైంసా’ పునరావృతం కావొద్దంటే టీఆర్‌ఎస్, ఎంఐఎంను ఓడించాలి 

సాక్షి, హైదరాబాద్‌: మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటర్ల దగ్గరకు వెళ్లేందుకు మొహం చెల్లకనే సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ ఎద్దేవా చేశారు. అందుకే మం త్రులు, ఎమ్మెల్యేలను ప్రచారానికి పంపి గెలిపించి తీసుకురాకపోతే పదవులు పోతాయని బెదిరిస్తు న్నారని విమర్శించారు. ఈ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తేనే టీఆర్‌ఎస్‌కు చెక్‌ పెట్టొచ్చని, తమ పార్టీ మేయర్లు, చైర్మన్లు గెలిస్తే రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల అభి వృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకున్నా కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా ఆదివారం ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చా రు. ఈ విశేషాలు ఆయన మాటల్లోనే...  

మా వ్యూహం మాకుంది... 
గత ఆరు నెలలుగా మున్సిపల్‌ ఎన్నికల కోసం పకడ్బందీ వ్యూహాన్ని సిద్ధం చేసుకుని ప్రజల్లోకి వెళ్లాం. ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలు, జిల్లా పార్టీ నాయకులు అంతా విభజన చేసుకుని పని చేస్తున్నాం. ఇది మాకు మంచి ఫలితాలను ఇవ్వబోతోంది. మొదటిసారి 2వేలకు పైగా వార్డుల్లో, 345 డివిజన్లలో సొంతంగా పోటీ చేస్తున్నాం. ఇంత పెద్ద సంఖ్యలో పోటీకి దిగడమే మా బలానికి నిదర్శనం. రాష్ట్రంలోని రెండు వేల వార్డుల్లో విజయం సాధించబోతున్నాం.  

ఇవే మా ప్రచారాస్త్రాలు... 
టీఆర్‌ఎస్‌ వైఫల్యాలు, ఎన్నికల హామీలు అమలు చేయకపోవడం అంశాలనే ఈ ఎన్నికల్లో ప్రజల దృష్టికి తీసుకెళ్లాం. రైతు రుణమాఫీ, రైతు బంధు, కల్యాణ లక్ష్మి లాంటి పథకాల్లో టీఆర్‌ఎస్‌ విఫలమయింది. కల్యాణ లక్ష్మి ఆర్థిక సాయం పెళ్లి సమయంలో ఇవ్వాల్సి ఉండగా, పెళ్లి చేసుకున్న ఆడపడుచులు తల్లులు అయిన తర్వాత కూడా అందజేయడం లేదు. టీఆర్‌ఎస్‌ పాలన ఎలా ఉందో ఈ ఒక్క పథకం అమలుతోనే అర్థమవుతోంది. టీఆర్‌ఎస్‌ ముసుగులో ఎంఐఎం భైంసా తదితర పట్టణాలకు విస్తరించే ప్రయత్నం చేస్తోంది. పౌరసత్వ చట్ట సవరణ గురించి తప్పుడు ప్రచారం చేసి లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తూ మజ్లిస్‌ ఎజెండాను అమలు చేయాలని చూస్తోంది. రాష్ట్రంలోని ఇతర మున్సిపాలిటీల్లో భైంసా లాంటి వాతావరణం ఏర్పడకుండా ఉండాలంటే టీఆర్‌ఎస్, ఎంఐఎంను ఓడించి బీజేపీని గెలిపించాలి. టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే. కాంగ్రెస్‌ పార్టీ పుంజుకునే పరిస్థితి లేదు. ఆ పార్టీకి ఓటేస్తే మోరీలో వేసినట్టే. ఒకవేళ కాంగ్రెస్‌ అభ్యర్థులు గెలిచినా మళ్లీ వారు చేరేది టీఆర్‌ఎస్‌లోనే.   

రంగులు మార్చే రాజకీయం..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: రాష్ట్రంలో రంగు లుమార్చే రాజకీయం నడుస్తోందని కె.లక్ష్మణ్‌ విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీకి ఓటేసి గెలి పిస్తే.. గులాబీ పార్టీలో చేరిపోతున్నారని.. గులాబీ పార్టీ ఆకుపచ్చ దారుసలాంకు దాసోహమైందని ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచా ర సభల్లో పాల్గొనేందుకు నిజామాబాద్‌ జిల్లాకు వచ్చిన లక్ష్మణ్‌.. బీజేపీ కార్యాలయంలో ఎంపీ అర్వింద్‌తో మీడియాతో మాట్లాడారు. 

వాళ్లకు మొహం లేదు... 
ఆరేళ్లుగా ప్రజలకు ఇచ్చిన హామీ లేవీ టీఆర్‌ఎస్‌ నెరవేర్చలేదు. పట్టణాల్లో మౌలిక సదుపాయాలు కల్పించలేదు. ఇప్పుడు ఏం మొహం పెట్టుకుని ఓట్లడుగుతారు. టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో కుటుంబ పాలన, ధన రాజకీయాలు పెరిగిపోయాయి. వాళ్లకు డబ్బు, అధికార బలం, ఎన్నికల కమిషన్, పోలీసులు అందరి సహకారం ఉంది. మాకు మాత్రం ప్రజలు, కార్యకర్తలే బలం. 
 

>
మరిన్ని వార్తలు