ఎన్డీఏకు 300కు పైగా సీట్లు

19 May, 2019 02:13 IST|Sakshi
రాజ శ్యామల యాగంలో పాల్గొన్న కె.లక్ష్మణ్‌ తదితరులు

ఓటమిని ముందే ఒప్పుకున్న కాంగ్రెస్‌: లక్ష్మణ్‌

సాక్షి ప్రతినిధి, వరంగల్‌ : పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాల అనంతరం రెండు తెలుగు రాష్ట్రాల్లో చంద్ర గ్రహణాలు వీడనున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ అన్నారు. శనివారం వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండలో నరేంద్ర మోదీ ప్రధాని మరోసారి కావాలని పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రాజ శ్యామల యాగంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారని, ఎన్డీఏకు 300లకు పైగా సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఇద్దరు చంద్రులతో సహా దేశంలోని చిన్నాచితకా ప్రాంతీయ పార్టీ ల నాయకు లంతా ఎవరికి వారు ప్రజాభీష్టం చూరగొనకుండానే తానే ప్రధాని కావాలని అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

బీజేపీ, కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని, తానే చక్రం తిప్పుతానని చెప్పిన తెలంగాణ చంద్రుడు.. ప్రస్తుతం బీజేపీని వ్యతిరేకించే పార్టీలతో కలుస్తామని చెబుతున్నాడని ధ్వజమెత్తారు. ఎన్నికల ఫలితాల అనంతరం ప్రధాని గురించి ఆలోచిద్దామని కాంగ్రెస్‌ నేతలు ముందే ఓటమిని అంగీకరించారని లక్ష్మణ్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో తాము ఉన్న సీట్లతో పాటు అదనంగా మరిన్ని సీట్లు గెలుచుకుంటామని, ఏడెనిమిది స్థానాల్లో కాంగ్రెస్‌ మూడో స్థానంలోకి వెళ్తుందని జోస్యం చెప్పారు. ఫలితాల అనంతరం రాష్ట్రంలో రాజకీయ çశూన్యత ఏర్పడుతుందని, టీఆర్‌ఎస్‌ వ్యతిరేకులంతా బీజేపీ వైపు వస్తారని అన్నారు. ఎన్ని ఫిరాయింపులు చేసినా టీఆర్‌ఎస్‌ మనుగడ సాధించలేదని, ప్రజల్లో తీవ్ర అసంతృప్తి గూడుకట్టుకుందని, ప్రభుత్వం మధ్యలోనే కూలిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు.

మరిన్ని వార్తలు