‘ఆరేళ్లుగా వారి ఆవేదన అరణ్య రోదనగా మిగిలింది’

4 Mar, 2020 14:25 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ నిర్వాకంతో వయసుతో సంబంధం లేకుండా రోడ్లపైకి వచ్చి ఆందోళన చేయాల్సిన దుస్థితి తలెత్తిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌  విమర్శించారు. టీఆర్‌ఎస్‌ పార్టీలో కట్టప్పలు ఎంతమంది ఉన్నారో చూసుకోవాలని.. వారు తలుచుకుంటే ప్రభుత్వం కుప్పకూలిపోతుందని పిలుపునిచ్చారు. బుధవారం లక్ష్మణ్‌ మీడియా ముందు మాట్లాడుతూ.. కేసీఆర్‌ బాహుబలి అయితే.. కేసీఆర్‌కు మించిన బ్రహ్మస్త్రం మోదీని ప్రయోగిస్తామని.. తెలంగాణ ప్రభుత్వ పునాదులు కదిలిస్తామని సవాల్‌ విసిరారు. ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు కేటీఆర్‌ భజనతోనే సరిపోతుందని ఎద్దేవా చేశారు. ఉద్యమంలో రాళ్లదాడులు చేసిన వారు ఇప్పుడు కేబినెట్‌లో ఉన్నారని, హాకి స్టిక్కులు పట్టుకుని పరిగెత్తించే ప్రయత్నం చేసిన వారు కూడా ప్రభుత్వంలో చేరిపోయారని దుయ్యబట్టారు. (ముస్లింలకు స్వేచ్ఛ భారత్‌లోనే..)

తెలంగాణ కోసం ప్రాణ త్యాగాలు చేసినా.. ప్రభుత్వం సానుకూలంగా స్పందించలేదని లక్ష్మణ్‌ మండిపడ్డారు. కేసీఆర్‌, హరీష్‌రావును తరిమేస్తుంటే ఉద్యోగులు అడ్డుపడ్డారని, ఆరేళ్లుగా ఉద్యోగులు ఆవేదన అరణ్య రోదనగానే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు.కల్వకుంట్ల కుటుంబం బంగారు కుటుంబంగా ఎదుగుతుందని లక్ష్మణ్‌ విమర్శించారు. ప్రభుత్వాన్ని విమర్శించినా, ప్రశ్నించినా సస్పెండ్‌లు చేయడం.. ఏసీబీ దాడులు చేయించి  జైళ్లకు పంపడం కామన్‌గా మారిందన్నారు. ఆర్టీసీ కార్మికులకు మద్దతిస్తే ఉద్యోగ సంఘాల నేతలను, ఉద్యోగులను బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఆర్టీసీ సమ్మెలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల బాధ్యత ప్రభుత్వానిదేనని, అవి ప్రభుత్వ హత్యలేనని ఆరోపించారు. (ఎంఐఎంను ఎందుకు కట్టడి చేయట్లేదు?)

ఇంటర్‌ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడిందని, రాష్ట్రపతి నివేదిక కోరిన తర్వాత చేసిన తప్పులను దిద్దులకునే ప్రయత్నం చేసిందని అన్నారు. ఉద్యోగులకు పీఆర్సీ సాధించే వరకు బీజేపీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. గొర్రె కసాయి వాడిని నమ్మినట్టు ఉద్యోగులు ముఖ్యమంత్రిని నమ్ముతున్నారని విమర్శించారు. ఇప్పటి వరకు డీఎస్సీ వేయలేదని, పరీక్షలు రాసిన వారికి నియామక పత్రాలు ఇవ్వలేదని మండిపడ్డారు. పక్క రాష్ట్రంలో 21 శాతం ఐఆర్‌ ఇచ్చిందని, ఉద్యోగ నిమామకాలకు నోటిఫికేషన్‌ ఇచ్చిందని ప్రస్తవించారు. తెలంగాణలో మాత్రం ఒక్క నోటిషికేషన్‌ ఇవ్వలేదని, నేటికి ఉస్మానియా యూనివర్సిటీలో ఆత్మహత్యలు జరుగుతున్నాయని గుర్తు చేశారు. వందల కోట్ల తో సచివాలయం.. అసెంబ్లీ నిర్మాణం చేపట్టేందుకు చూస్తున్న కేసీఆర్‌.. రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను ఎందుకు పరిష్కరించలేక పోతున్నారని ప్రశ్నించారు.గడీల పాలన బద్దలు కొట్టి గరిబీ పాలన తెస్తామని లక్ష్మణ్‌ తెలిపారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు