టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే ఎంఐఎంకు వేసినట్టే: లక్ష్మణ్‌

12 Jan, 2020 02:48 IST|Sakshi

అమాయకుల్ని అసదుద్దీన్‌ రెచ్చగొడుతున్నారు

సాక్షి, హైదరాబాద్‌: మున్సిపల్‌ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే ఎంఐఎంకు వేసినట్టేనని, కాంగ్రెస్‌కు వేస్తే టీఆర్‌ఎస్‌కు వేసినట్లే అవుతుందని, ఈ మూడు పార్టీలు ఒక్కటేనని బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ వ్యాఖ్యానించారు. ఎంఐఎం కనుసన్నల్లోనే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నడుస్తోందని, అసద్‌ పార్టీ కోసమే ఇద్దరు పిల్లల నిబంధనను ప్రభుత్వం తొలగించిందని ఆరోపించారు. బీజేపీలో చేరి తొలిసారిగా శనివారం పార్టీ కార్యాలయానికి వచ్చిన సీనియర్‌ రాజకీయవేత్త మోత్కుపల్లి నర్సింహులుకు పార్టీనాయకులు, కార్యకర్తలు సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా లక్ష్మణ్‌ మీడియాతో మాట్లాడారు. మతవిద్వేషాలు ఎంఐఎం రెచ్చగొట్టుతోందని, అసదుద్దీన్‌ ఒవైసీ చదువుకున్న అజ్ఞాని అని అమాయకులను రెచ్చగొట్టి తప్పు దారి పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు.

కుటుంబ అవినీతి పాలన పోవాలంటే బీజేపీ కి ఓటు వేయాలి...కాంగ్రెస్‌ కి ఓటు వేస్తే మోరిలో వేసినట్టేనని అన్నారు. మోత్కుపల్లి చేరిక పార్టీ బలోపేతానికి దోహదం చేస్తోందన్నారు. మరోవైపు లక్ష్మణ్‌ సమక్షంలోనే బీజేపీలో అంతర్గత గొడవలు బయటపడ్డాయి. ఎంపీ ధర్మపురి అరవింద్‌ నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ టికెట్‌ అమ్ముకున్నారని మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ అనుయా యులు పార్టీ కార్యాలయంలోనే నిరసన తెలిపారు.  తెలంగాణ పరువు ప్రతిష్టలు సీఎంకేసీఆర్‌ మంటగలిపారని, ఎన్నికల కోసమే పథకాలు పెడుతున్నారని మోత్కుపల్లి నర్సింహులు విమర్శించారు. మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను తిప్పి కొట్టాల్సిన అవసరం ఉందని, తాను ప్రతీ ఊరు, ఇళ్లు తిరిగి కేసీఆర్‌ బండారం బయటపెడతానని ఆయన పతనమే తన పంతమని నర్సింహులు వ్యాఖ్యానించారు. మరోవైపు జనగామ మాజీ మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ ప్రేమలత రెడ్డి బీజేపీలో చేరారు.

మరిన్ని వార్తలు