నాపై సినిమా తీస్తే కోర్టుకెళతా : లక్ష్మీపార్వతి

29 Oct, 2017 16:03 IST|Sakshi

ఎన్టీఆర్‌కు జరిగిన అన్యాయంపై తీస్తే స్వాగతిస్తా..

సాక్షి, విజయవాడ : అనుమతి తీసుకోకుండా తన జీవితంపై సినిమాలు తీస్తే కోర్టును ఆశ్రయిస్తానని ఎన్టీఆర్‌ సతీమణి, వైఎస్సార్‌సీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి హెచ్చరించారు. ప్రచారం కోసం పాకులాడుతోన్న కొందరు తనను అవమానించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారని, ఎట్టిపరిస్థితుల్లోనూ వారిని అడ్డుకుంటానని చెప్పారు. ఆదివారం విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడారు.

‘నన్ను ఇబ్బంది పెట్టినా భరిస్తాను. నాకు పోరాటాలు కొత్తకాదు. కానీ నా భర్త పరువుప్రతిష్టలకు భంగం వాటిల్లితేమాత్రం ఊరుకునే సమస్యేలేదు. అనుమతి తీసుకోకుండా నాపై సినిమా తీస్తే కోర్టును ఆశ్రయిస్తాను. అయితే ఎన్టీఆర్‌కు జరిగిన అన్యాయంపై ఎవరు సినిమాలు తీసినా స్వాగతిస్తాను’ అని లక్ష్మీపార్వతి పేర్కొన్నారు.

తెలుగుతేజం, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు జీవితగాథ ఆధారంగా పలువురు దర్శక నిర్మాతలు సినిమాలు తీయబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. వాటిలో బాలకృష్ణ హీరోగా తేజ దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న సినిమా ఒకటికాగా, రాంగోపాల్‌వర్మ ప్రకటించిన ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ మరొకటి. ఈ మధ్యే దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి తాను ‘లక్ష్మీస్‌ వీరగ్రంథం’ సినిమా తీయబోతున్నట్లు ప్రకటించారు. ఆయా సినిమాల్లో ఎన్టీఆర్‌నుగానీ, తనను గానీ అవమానించాలనే ఉద్దేశంతో తీస్తే ఊరుకోబోనని లక్ష్మీపార్వతి హెచ్చరించారు.

ఎన్టీఆర్‌కు జరిగిన అన్యాయంపై తీస్తే స్వాగతిస్తాను  

మరిన్ని వార్తలు