‘నీ కొడుకు లోకేష్‌కి ఇంగ్లీషే రాదు’

22 Nov, 2019 17:14 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి : పాదయాత్రలో హామీ ఇచ్చినట్టుగా నిరక్షరాస్యతను రూపుమాపేందుకు, పేద ప్రజలను లక్షలాది రూపాయల దోపిడీ నుంచి కాపాడేందుకే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇంగ్లీష్‌ మీడియాన్ని ప్రవేశపెడుతున్నారని తెలుగు అకాడమి చైర్మన్‌ నందమూరి లక్ష్మీపార్వతి వ్యాఖ్యానించారు. శుక్రవారం తాడేపల్లిలో విలేకరులతో మాట్లాడిన ఆమె ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం అమలుకు వ్యతిరేకంగా మాట్లాడేవారిపై విరుచుకుపడ్డారు. తెలుగు గురించి మాట్లాడే వాళ్లు తమ పిల్లలను ఎందుకు ఇంగ్లీష్‌ మీడియంలో చదివిస్తున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు తన కుమారుడిని, మనవడిని ఇంగ్లీష్‌ మీడియంలో చదివించలేదా? ఏబీఎన్‌ రాధాకృష్ణ తన కుమారుడిని తెలుగు మీడియంలో చదివించారా? అంటూ తీవ్రంగా మండిపడ్డారు.

ఇంకా ‘తెలుగు అంటూ గొంతు చించుకుంటున్న చంద్రబాబు తెలుగు అభివృద్ధికి చేసిందేమిటి? తెలుగు జాతి గౌరవాన్ని కాపాడిన ఎన్టీఆర్‌కు భారతరత్న అవార్డు కోసం ఎందుకు కృషి చేయలేదు? తెలుగుకు ప్రాచీన హోదా కోసం ఎందుకు ప్రయత్నం చేయలేదు? ఎన్టీఆర్‌ మానసపుత్రిక తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఎందుకు రాష్ట్రానికి తేలేకపోయారు? ఉమ్మడి రాష్ట్రంలోనూ, ఇప్పటి ఆంధ్రప్రదేశ్‌లోనూ నారాయణ, చైతన్య స్కూళ్ల కోసం ఆరువేల పాఠశాలలను చంద్రబాబు మూయించారు. అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర అవతరణ దినోత్సవం కూడా జరపలేదు. కనీసం పొట్టి శ్రీరాములుకు నివాళులు అర్పించలేదు. భాషాప్రయుక్త రాష్ట్రాన్ని విడగొట్టమని పొలిట్‌బ్యూరోలో తీర్మానం చేసిన చంద్రబాబుకు తెలుగు గురించి మాట్లాడే అర్హత లేదు. వచ్చే జన్మంటూ ఉంటే తాను, వెంకయ్యనాయుడు అమెరికాలో పుడతామని చెప్పలేదా?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.

దీన్ని బట్టి తెలుగంటే చంద్రబాబుకు ఎంత ఇష్టం ఉందో తెలుసుకోవచ్చని లక్ష్మీపార్వతి విమర్శించారు. మరోవైపు తెలుగు రాని లోకేష్‌ని ఇంగ్లీష్‌ మీడియంలో చదివించినా ఆ భాష కూడా సరిగా రాదని ఎద్దేవా చేశారు. ఇదికాక, ఇంగ్లీష్‌ మీడియంలో పట్టులేక అనేక మంది ఉద్యోగావకాశాలు కోల్పోతున్నారని, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హిందీ, ఇంగ్లీష్‌ నేర్చుకోవడం వల్లే ఉన్నత స్థానానికి ఎదిగారని ఆమె వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు