ఆ భయంతోనే బాబు దాడులు చేయిస్తున్నారు

7 Jan, 2020 15:51 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఏపీ ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై జరిగిన హత్యాయత్నంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఉద్యమం ముసుగులో టీడీపీ కార్యకర్తలు పిన్నెల్లి కాన్వాయ్‌పై రాళ్లదాడి చేయడాన్ని సర్వత్రా నాయకులు, ప్రజలు ఖండిస్తున్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై దాడిని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను తీవ్రంగా ఖండించారు. రైతుల ముసుగులో తెలుగుదేశం గూండాలే ఈ దాడులకు పాల్పడ్డారని ఆయన అన్నారు. అమరావతి ప్రాంతంలో భూ కుంభకోణాలు ఎక్కడ బయటపడతాయన్న భయంతోనే చంద్రబాబు తన అనుచరులతో దాడులకు పాల్పడుతున్నారని, అమరావతిలో భయానిక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో 13 జిల్లాల్లో సమగ్ర అభివృద్ధి జరగాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌హన్‌రెడ్డి ముందుకువెళ్తుంటే.. ప్రజలు తిరస్కరించిన చంద్రబాబు మాత్రం రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యను సృష్టించడానికి కుట్రలు పన్నుతున్నారని ధ్వజమెత్తారు.

రామకృష్ణారెడ్డి కాన్వాయ్‌పై దాడులకు దిగిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై దాడి హేయమైన చర్య అని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఈ దాడి కచ్చితంగా టీడీపీ గూండాల పనేనని పేర్కొన్నారు. చంద్రబాబునాయుడు నీచరాజకీయాలు చేస్తున్నారని, రైతులను రెచ్చగొట్టేవిధంగా ఆయన మాట్లాడుతున్నారని విమర్శించారు. రైతుల ముసుగులో టీడీపీ గుండాలతో చంద్రబాబు శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని పేర్కొన్నారు. రైతులను తమ ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకొంటుందన్నారు.

పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై దాడిని ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ కారెం శివాజీ తీవ్రంగా ఖండించారు. ఇది పిరికి పందల చర్య అని, ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు