నోటికొచ్చినట్టు..తిట్టు!

1 Apr, 2019 07:11 IST|Sakshi

ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీల పరస్పర దూషణలు సహజమే. ప్రస్తుతం అవి కాస్తా శ్రుతి మించుతున్నాయి. సైద్ధాంతిక విమర్శలు, ఆరోపణల స్థానంలో వ్యక్తిగత ఆరోపణలు, వ్యక్తిత్వ హననాలు చోటు చేసుకుంటున్నాయి. చోటా నేతలంటే పోనీ అనుకోవచ్చు..సీనియర్‌ నేతలు, గౌరవ హోదాలో ఉన్న వారూ ఇలాంటి వాచాలత్వాన్ని ప్రదర్శిస్తున్నారు.  రెండ్రోజుల క్రితం ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన మోదీ ప్రారంభంలోనే విపక్ష కూటమిని సారా కూటమి (సరబ్‌) అంటూ ధ్వజమెత్తారు. యూపీలో ఎస్పీ, ఆర్జేడీ, బీఎస్పీ ఒక్కటై.. బీజేపీపై దండెత్తుతున్నాయి. ఆ పార్టీల పేరులోని మొదటి అక్షరాలను తీసుకుని మోదీ దానికి ‘సరబ్‌ ’(సారా) అని పేరు పెట్టారు. ఆరోగ్యంగా ఉండాలంటే సారాకు దూరంగా ఉండాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రధాని హోదాలో ఉన్న మోదీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనుచితమంటూ వెంటనే కాంగ్రెస్‌ విరుచుకుపడింది.

ఈ సార్వత్రిక ఎన్నికల ప్రచారం మొదలైన దగ్గర్నుంచీ వివిధ పార్టీల నేతలు ఇలాంటి  అనుచిత వ్యాఖ్యలు, వర్ణనలతో తమ వాచాలత్వాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు. మోదీ తరచుగా కాంగ్రెస్‌లో వారసత్వ రాజకీయాలను విమర్శించడంపై ఆ పార్టీ నేత తారిఖ్‌ అన్వర్‌ స్పందిస్తూ ‘మోదీకి వారసులెవరూ లేరు. కాబట్టే ఆయనలా మాట్లాడుతున్నారం’టూ విమర్శ చేశారు. మజ్లిస్‌ పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ మోదీపై అనుచిత వ్యాఖ్య చేశారు.‘పుల్వామా దాడి జరిగినప్పుడు ప్రధాని గొడ్డు మాంసంతో చేసిన బిర్యానీ తిని పడుకున్నారు’ అంటూ విమర్శించారు. ఒవైసీ సోదరుడు అక్బరుద్దీన్‌.. మోదీకి చౌకీదార్‌ టోపీ, విజిల్‌ ఇవ్వచూపారు. నేషనల్‌ కాన్ఫరెన్స్‌కు చెందిన జావేద్‌ రాణా మరో అడుగు ముందుకేసి మోదీని హంతకుడు, టెర్రరిస్టుతో పోల్చారు. ఉత్తరప్రదేశ్‌ సీఎం ఆదిత్యనాథ్‌ షహరణ్‌పూర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి ఇమ్రాన్‌ మసూద్‌ను జైషే మహ్మద్‌ అధినేత అజహర్‌ మసూద్‌ అల్లుడిగా అభివర్ణించారు. ప్రియాంక రాజకీయ ప్రవేశంపై కేంద్ర మంత్రి మహేశ్‌శర్మ స్పందిస్తూ ‘పప్పూ (రాహుల్‌ గాంధీ) చాలా కాలం కిందటే చేరారు. ఇప్పుడు పప్పూకీ పప్పీ (ప్రియాంక) కూడా తోడయ్యారు’ అని వ్యాఖ్యానించారు.

ఉత్తరప్రదేశ్‌ బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగయితే రాహుల్‌ను రావణుడితో, ప్రియాంకను శూర్పనఖతో పోల్చారు. హరియాణాకు చెందిన డ్యాన్సర్‌ సప్నా చౌదరి కాంగ్రెస్‌లో చేరడంపై ఆయన స్పందిస్తూ సోనియాను కూడా డ్యాన్సర్‌గా అభివర్ణించారు. ‘రాహుల్‌ తల్లి కూడా ఇటలీలో అదే వృత్తిలో ఉండేవారు. రాహుల్‌ తండ్రి ఆమెను పెళ్లి చేసుకున్నారు. రాహుల్‌ కూడా ఆ కుటుంబ సంద్రాయాన్ని పాటించాలి.. సప్నను పెళ్లి చేసుకోవాలి’ అని సురేంద్రసింగ్‌ అన్నారు. ఈయన మాయావతిని కూడా వదిలి పెట్టలేదు.. ‘60 ఏళ్ల వయసులోనూ మాయావతి ఫేసియల్‌ చేయించుకుంటారు. తలకు రంగు వేసుకుంటారు’ అని వ్యాఖ్యానించారు. యూపీకి చెందిన మరో మంత్రి శ్రీకాంత్‌శర్మ ట్విట్టర్‌లో రాహుల్‌  గాంధీని ‘పిరికివాడు. నపుంసకుడి’గా అభివర్ణించారు. 

మరిన్ని వార్తలు