ఆ సామాజికవర్గాలకు  టీడీపీ రిక్తహస్తం..

25 Mar, 2019 07:25 IST|Sakshi

సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీ ఎంపీ టిక్కెట్ల కేటాయింపులో రాష్ట్రంలోని పలు కీలక సామాజిక వర్గాలకు రిక్తహస్తం చూపించింది. ఉత్తరాంధ్రలో అత్యధికంగా ఉండే బీసీ కులాలైన కాళింగ, తూర్పు కాపు సామాజిక వర్గాలను అస్సలు పట్టించుకోలేదు. అలాగే రాయలసీమలో అత్యధికంగా ఉండే బీసీ కులాలైన బోయ, కురుబ సామాజిక వర్గాలనూ పరిగణనలోకి తీసుకోలేదు.

ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మాదిగ సామాజిక వర్గానికి కనీసం ఒక్క ఎంపీ స్థానం కూడా కేటాయించకపోవడం గమనార్హం. అదే సమయంలో ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఈ సామాజిక వర్గాలన్నింటికీ టికెట్ల కేటాయింపులో అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఒక్కో ఎంపీ స్థానం చొప్పున కేటాయించడం ద్వారా బీసీ కులాల అభ్యున్నతికి తనకున్న చిత్తశుద్ధిని చాటుకుంది. 
ఉత్తరాంధ్రలో బీసీ సామాజిక వర్గాలైన కాళింగ, తూర్పుకాపు సామాజిక వర్గాలు అత్యంత కీలకమైనవి.

ఈ ప్రాంతంలో జనాభాపరంగా తూర్పుకాపు సామాజికవర్గం మొదటి స్థానంలో ఉంటుంది. ఈ సామాజికవర్గానికి చెందిన వారు సుమారు ఆరు లక్షల మంది వరకు ఉంటారని అంచనా. అలాగే కాళింగ సామాజికవర్గానికి చెందినవారు కూడా ఐదు లక్షలకు పైగా ఉంటారని అంచనా. అటువంటి అత్యంత కీలకమైన ఈ రెండు సామాజికవర్గాలకు ఎంపీ టిక్కెట్ల కేటాయింపులో టీడీపీ రిక్తహస్తం చూపించింది. వీరికి కనీసం ఒక్క సీటు కూడా కేటాయించలేదు.

అదే సమయంలో వైఎస్సార్‌ సీపీ ఈ రెండు సామాజిక వర్గాలకు అధిక ప్రాధాన్యం కల్పించింది. ఈ రెండు కులాలకు ఒక్కో ఎంపీ స్థానాన్ని కేటాయించింది. విజయనగరం లోక్‌సభ స్థానం నుంచి తూర్పుకాపు సామాజిక వర్గానికి చెందిన బెల్లాన చంద్రశేఖర్‌ను తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. అలాగే కాళింగ సామాజిక వర్గానికి చెందిన దువ్వాడ శ్రీనివాస్‌ను శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థిగా ఎంపిక చేసింది. 

సీమలో బోయ, కురుబలకు టీడీపీ నో టికెట్‌
మరోవైపు రాయలసీమలో బీసీ వర్గాలైన బోయ, కురుబ కులాలవారు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. కానీ ఈ రెండు బీసీ వర్గాల గురించి టీడీపీ ఏమాత్రం పట్టించుకోలేదు. ఒక్క ఎంపీ స్థానాన్ని కూడా కేటాయించలేదు. అదే సమయంలో వైఎస్సార్‌సీపీ ఈ రెండు వర్గాలకు పెద్ద పీట వేసింది. ముఖ్యంగా అగ్రవర్ణాల ఆధిపత్యం ఉండే అనంతపురం జిల్లాలోని రెండు లోక్‌సభ స్థానాలను బీసీలకు కేటాయించడం ద్వారా చారిత్రక నిర్ణయం తీసుకుంది. అనంతపురం ఎంపీ స్థానం నుంచి బోయ సామాజికవర్గానికి చెందిన తలారి రంగయ్యను బరిలోకి దింపింది. హిందూపురం లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా కురుబ సామాజికవర్గానికి చెందిన గోరంట్ల మాధవ్‌ను ఎంపిక చేసింది.

మాదిగ సామాజికవర్గం ఊసెత్తని ‘దేశం’
ఎంపీ అభ్యర్థుల ఎంపికలో మాదిగ సామాజిక వర్గాన్ని అధికార తెలుగుదేశం పార్టీ పూర్తిగా మరచిపోయింది. కనీసం ఒక్క లోక్‌సభ స్థానంలోనూ మాదిగ సామాజికవర్గం నేత పేరును పరిశీలించలేదు. అదే సమయంలో వైఎస్సార్‌సీపీ మాత్రం ఎంపీ అభ్యర్థుల ఎంపికలో మాదిగ సామాజికవర్గానికి సముచిత స్థానం కల్పించింది. బాపట్ల లోక్‌సభ స్థానం నుంచి తమ పార్టీ అభ్యర్థిగా మాదిగ సామాజికవర్గానికి చెందిన నందిగం సురేష్‌ను ఎంపిక చేసింది.

బ్రాహ్మణులకు టీడీపీ మొండిచేయి.. వైఎస్సార్‌సీపీ సముచిత ప్రాధాన్యం
తెలుగుదేశం పార్టీకి మొదట్నుంచీ బ్రాహ్మణ వ్యతిరేక పార్టీగా ముద్ర ఉంది. చంద్రబాబు సీఎం అయ్యాక ఆ సామాజికవర్గానికి టిక్కెట్ల కేటాయింపులో ఎప్పుడూ అన్యాయమే జరుగుతూ వచ్చింది. ప్రస్తుత ఎన్నికల్లోనూ టీడీపీ అదే రీతిలో వ్యవహరించింది. బ్రాహ్మణులకు పూర్తిగా మొండిచేయి చూపింది. ఆ సామాజికవర్గానికి చెందిన వారికి కనీసం ఒక్క అసెంబ్లీ స్థానం కూడా కేటాయించలేదు. అదే సమయంలో వైఎస్సార్‌ సీపీ ఈ ఎన్నికల్లో బ్రాహ్మణులకు సముచిత గౌరవం కల్పించింది.

ఆ సామాజికవర్గానికి నాలుగు ఎమ్మెల్యే టిక్కెట్లు కేటాయించడమే ఇందుకు నిదర్శనం. గుంటూరు జిల్లా బాపట్ల నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే కోన రఘుపతికి మరోసారి అవకాశం కల్పించారు. విజయవాడ సెంట్రల్‌ స్థానం నుంచి మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్‌ పార్టీ అభ్యర్థులుగా ఖరారు చేశారు. ఇక విశాఖ తూర్పు నియోజకవర్గం అభ్యర్థిగా ప్రకటించిన అక్కరమాని విజయనిర్మల కూడా బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందినవారు.

అమె గతంలో భీమిలి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా చేశారు. ఆమె భర్త వెంకటరావు యాదవ సామాజికవర్గానికి చెందిన నేత. ఆ నియోజకవర్గంలో యాదవ, బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన ఓటర్లు అత్యధికంగా ఉన్నారు. దాంతో ఆమెను అభ్యర్థిగా ప్రకటించడం ద్వారా ఆ రెండు వర్గాలకు ప్రాధాన్యం కల్పించారు. 

– వడ్దాది శ్రీనివాస్‌, సాక్షి, అమరావతి 

మరిన్ని వార్తలు