కేరళలో దూసుకుపోతున్న ‘ఎల్‌డీఎఫ్‌’

13 Mar, 2019 18:22 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం నాడు ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన వెంటనే సీపీఎం నాయకత్వంలోని కేరళ పాలక పక్షం లెఫ్ట్‌ అండ్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ (ఎల్‌డీఎఫ్‌) ‘మీ అంతర్గత కలహాలు ముగిశాయా, ఇదిగో మా టీం రెడీ!’ అన్న నినాదంతో సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టేసింది. అంతకు ఒక్క రోజు ముందు అంటే, శనివారం నాడే కేరళలోని 20 లోక్‌సభ స్థానాలకు ఎల్‌డీఎఫ్‌ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.

అభ్యర్థుల ఎంపిక విషయంలో కాంగ్రెస్‌ నాయకత్వంలోని యునైటెడ్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్, బీజేపీ నాయకత్వంలోని నేషనల్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌లు ఇప్పటికీ మల్లగుల్లాలు పడుతున్నాయి. గత ఎన్నికల్లో సాధించిన సీట్లకన్నా ఈ సారి ఎక్కువ సీట్లను సాధిస్తామన్న ధీమాతో ఎల్‌డీఎఫ్‌ కనిపిస్తోంది. 2014 నాటి ఎన్నికల్లో ఎల్‌డీఎఫ్‌కు ఎనిమిది సీట్లు రాగా, యూడీఎఫ్‌కు మిగతా సీట్లు లభించాయి. ఎన్డీయేకు మాత్రం ఒక్క సీటు కూడా రాలేదు. ఈసారి సీపీఎం 16 సీట్లకు పోటీ చేస్తుండగా, సీపీఐ నాలుగు సీట్లకు పోటీ చేస్తోంది. మిత్రపక్షాలైన జనతాదళ్‌ (సెక్యులర్‌), లోక్‌తాంత్రిక్‌ జనతాదళ్‌ ఒక్క సీటుకు కూడా పోటీ చేయడం లేదు. కేరళలోని అన్ని లోక్‌సభ సీట్లకు ఏప్రిల్‌ 23వ తేదీన ఒకేసారి ఎన్నికలు జరుగుతున్నాయి.

ఎప్పటిలాగే 2014లోనూ ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్‌ మధ్యనే రసవత్తర పోటీ నడిచింది. బీజీపీ ఫ్రంట్‌ ఒక్క సీటును కూడా గెలుచుకోలేదు. అయితే ఒక్క తిరువనంతపురంలో ఆ పార్టీ అభ్యర్థి విజయానికి చేరువలోకి వచ్చి ఓడిపోయారు. నాటి ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి శశి థరూర్‌ చేతుల్లో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌ 15,470 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ సీటును తిరిగి కైవసం చేసుకునే బాధ్యతను మాజీ రాష్ట్ర మంత్రి, సీపీఐ అభ్యర్థి సీ. దివాకరన్‌కు అప్పగించారు. ఇక బీజేపీ ఫ్రంట్‌ ఒకే ఒక ఎజెండా ‘శబరిమల’ అంశంపై ప్రచారం కొనసాగిస్తోంది. శబరిమల ఆలయంలోని అన్న వయస్కుల ఆడవాళ్లను అనుమతించాలంటూ సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేసేందుకు ప్రయత్నించగా దానికి వ్యతిరేకంగా శివసేన, ఇతర హిందూత్వ సంస్థలు ఆందోళన చేస్తూ వచ్చాయి. ఆ ఆందోళన తనకు ఎన్నికల్లో ఉపకరిస్తుందని బీజేపీ ఆశిస్తోంది. ఈసారి రాష్ట్రానికి సంబంధించి ఏది పెద్ద ఎన్నికల సమస్య అవుతుందని ఆసియా నెట్‌ టీవీ ఛానల్‌ ఇటీవల ఓ సర్వే నిర్వహించగా వారిలో 64 శాతం మంది పెరుగుతున్న చమురు ధరలు, ఆ తర్వాత పెద్ద నోట్ల రద్దు ప్రధాన సమస్యలుగా పేర్కొన్నారు.

చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల ప్రతిపాదనకు కమ్యూనిస్టు పార్టీలు తీవ్రంగా మద్దతు ఇస్తున్నప్పటికీ కేవలం రెండు సీట్లనే ఈసారి మహిళలకు కేటాయించారు. వారిలో కన్నూర్‌ సిట్టింగ్‌ ఎంపీ పీకే శ్రీమతి కూడా ఉన్నారు. తాము కేవలం నాలుగు సీట్లకే పోటీ చేస్తున్నందున తాము మహిళలకు స్థానం కల్పించలేక పోయామని సీపీఐ ప్రధాన కార్యదర్శి ఎస్‌. సుధాకర్‌ రెడ్డి విచారం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు