రాయలసీమలో కొనసాగుతున్న వామపక్షాల బంద్‌

28 Dec, 2018 13:13 IST|Sakshi

సాక్షి, అమరావతి: కరువు రైతులను ఆదుకోవాలంటూ వామపక్షాల చేపట్టిన రాయలసీమ బంద్‌ కొనసాగుతుంది. కరువు రైతులకు సంబంధించి సహాయక చర్యలు చేపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా వామపక్షాలు శుక్రవారం రాయలసీమ జిల్లాల బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. బంద్‌లో భాగంగా సీపీఎం, సీపీఐ నేతలు ఉదయం నుంచే రోడ్లపైకి వచ్చి తమ నిరసన తెలుపుతున్నారు. వామపక్షాలు తలపెట్టిన బంద్‌ను భగ్నం చేయడానికి పోలీసులు శత విధాల ప్రయత్నిస్తున్నారు. నిరసన తెలుపుతున్న నాయకులను ఎక్కడికక్కడ అరెస్ట్‌లు చేస్తున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు సౌత్‌ బైపాస్‌లో  రాస్తారోకో నిర్వహిస్తున్న సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు మధు, రామకృష్ణలను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ఈ సందర్భంగా మధు, రామకృష్ణలు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరువు తాండవిస్తుంటే సీఎం చంద్రబాబు నాయుడు రైతులు బాగున్నారని డబ్బాకొట్టుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. చంద్రబాబు విడుదల చేసే శ్వేత పత్రాలన్ని ఓ బోగస్‌ అని వారు అభివర్ణించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే టీడీపీ ప్రభుత్వం శ్వేతపత్రాల పేరిట నాటాకాలు ఆడుతోందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.

బద్వేలు పీఎస్‌ వద్ద బైఠాయించిన మహిళలు..
వైఎస్సార్‌ జిల్లాలో కడప బస్టాండ్‌ వద్ద వామపక్ష నేతలు బస్సులను అడ్డుకున్నారు. కరువు రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. బద్వేల్‌లో బంద్‌ నిర్వహిస్తున్న వామపక్ష నాయకులను పోలీసులు అడ్డుకుని.. వారిని అరెస్ట్‌ చేశారు. అరెస్ట్‌ చేసిన సీపీఎం, సీపీఐ నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తు మహిళలు బద్వేలు పోలీస్‌ స్టేషన్‌ వద్ద నిరసన తెలిపారు.

కరువు నివారణ చర్యలు వెంటనే చేపట్టాలని రైల్వేకోడూరులో సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించగా.. పోలీసులు 12 మందిని అరెస్ట్‌ చేశారు.


అనంతపురంలో ముందస్తు అరెస్ట్‌లు..
అనంతపురం జిల్లాలో వామపక్షాలు చేపట్టిన బంద్‌ కొనసాగుతుంది. బంద్‌ను భగ్నం చేసేందుకు పోలీసులు శత విధాల ప్రయత్నిస్తున్నారు. అనంతపురం, శింగనమల, రాప్తాడులలో పలువురు వామపక్ష నేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్‌ చేశారు. అనంతపురం ఆర్టీసీ డిపో వద్ద వామపక్షాలు ధర్నా చేపట్టడంతో కొద్ది సేపు బస్సులు నిలిచిపోయాయి. పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్‌ చేశారు.

రైతులకు పంట నష్టపరిహారం, రుణమాఫీ తక్షణమై విడుదల చేయాలని కోరుతూ వామపక్ష నేతలు గుత్తి, పామిడి, మడకశిరలలో షాపులు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలను బంద్‌ చేసి రాస్తారోకో నిర‍్వహించారు. ఈ నిరసనల్లో సీపీఎం, సీపీఐ నేతలతో పాటు ఎమ్మార్పీఎస్‌ నాయకులు కూడా పాల్గొన్నారు.

ఆంధ్రా-కర్ణాటకల మధ్య నిలిచిపోయిన రాకపోకలు..
వామపక్షాలు చేపట్టిన బంద్‌ కర్నూలులో ప్రశాంతంగా కొనసాగుతుంది. కర్నూలులో ఆర్టీసీ బస్సులను అడ్డుకున్న ఆందోళనకారులు.. బస్టాండ్‌ వద్ద బైఠాయించారు. ఆదోని, డోన్‌, కోడుమురులలో కూడా వామపక్ష నేతలు రాస్తారోకో నిర్వహించారు. ఆలురులో వామపక్షాలు సంపూర్ణంగా బంద్ చేపట్టాయి. దీంతో ఆంధ్రా-కర్ణాటక మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో పోలీసులు వామపక్ష నేతలను అరెస్ట్‌ చేశారు.

తిరుపతిలో భారీగా పోలీసుల మెహరింపు..
రాయలసీమలో కరువు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ వైఖరికి నిరసగా వామపక్ష నేతలు చిత్తూరు జిల్లా తిరుపతిలో ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు ఆర్టీసీ బస్టాండ్‌, రైల్వే స్టేషన్‌ ఎదుట భారీగా పోలీసులను మోహరించారు. శ్రీకాళహస్తిలో ఆందోళన చేస్తున్న పలువురు నేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు.
 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా