ఆర్టీసీని నాకివ్వండి.. లాభాల్లో నడిపిస్తా!

17 Oct, 2019 15:47 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ‘ఆర్టీసీని నడపడం మీకు చేతకాకుంటే నాకివ్వండి. వేల కోట్ల లాభాల్లో నడిపిస్తాను’ అని ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ ప్రభుత్వానికి సవాల్‌ చేశారు. ప్రభుత్వం తన సవాల్‌ను స్వీకరించాలని డిమాండ్‌ చేశారు. గురువారం ఇందిరాపార్క్‌ వద్ద వామపక్షాలు చేపట్టిన సామూహిక దీక్షను ఆయన ప్రారంభించి సమ్మెకు తన మద్దతును తెలిపారు. అనంతరం ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ మాట్లాడతూ.. తమిళనాడు తరహాలో డీజిల్‌ ధరలను ప్రభుత్వం భరిస్తే ఆర్టీసీకి నష్టాలు రావని వెల్లడించారు. ప్రభుత్వం ఆర్టీసీకి నయాపైసా ఇవ్వకపోయినా పర్వాలేదు. కానీ ఆదాయం తీసుకోకుండా ఉంటే చాలన్నారు. ఆర్టీసీ ఏటా డీజిల్‌పై 1300 కోట్లు ఖర్చు చేస్తే 300 కోట్లు పన్నుల రూపంలో ప్రభుత్వానికి చెల్లిస్తుందని పేర్కొన్నారు. నష్టాలొచ్చినా ఆర్టీసీపై పన్నులు వసూలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని విమర్శించారు. ప్రైవేటు బస్సులను అరికడితే ఆర్టీసీ లాభాల బాటలో నడుస్తుందని సూచించారు. ప్రభుత్వం అబద్దపు ప్రచారాలను మానుకోవాలని నాగేశ్వర్‌ కోరారు.

అంతకు ముందు సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. సమ్మె విషయంలో ప్రస్తుతం సీఎం వర్సెస్‌ తెలంగాణ సమాజం అనే విధంగా మారిందన్నారు. తెలంగాణ సమాజం బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు కూడా సమ్మె న్యాయమైందే అంటున్నారని వ్యాఖ్యానించారు. సీఎం మొండి వైఖరి వల్ల చీకటి రోజులు వస్తున్నాయని ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని అభిప్రాయపడ్డారు. సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్‌ తనకు ఎదురులేదని విర్రవీగుతున్నాడని విమర్శించారు. ఐదుగురు కార్మికులు మరణించిన తర్వాత కూడా మానవత్వం లేదా? అని ప్రశ్నించారు. కార్మికులపై కక్ష కట్టిన కేసీఆర్‌ సమ్మెను నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ జేఏసీ నేతలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు