పవన్‌.. చెంగువీరా

17 Jan, 2020 09:56 IST|Sakshi

నడ్డా లడ్డూ తాజా అయిందా?

కమ్యూనిస్టుల ఎద్దేవా  

సాక్షి, అమరావతి: రాష్ట్రానికి అన్నివిధాలా ద్రోహం చేసిన బీజేపీతో చేతులు కలుపుతావా? అంటూ ఉభయ కమ్యూనిస్టు పార్టీలు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై మండిపడ్డాయి. రాజకీయాల్లో ఎత్తులు పొత్తులు ఉంటాయే తప్ప బాకీలు ఉండవని గురువారం వేర్వేరు ప్రకటనల్లో ఆ పార్టీల నేతలు ఎద్దేవా చేశారు. ‘‘విప్లవ వీరుడు చేగువేరా బొమ్మ పెట్టుకుని చిలకపలుకులు పలికిన పవన్‌ ఇప్పుడు ‘చెంగువీరుడు’ అయ్యాడు. ఢిల్లీలో బీజేపీ నాయకుడు నడ్డాను కలిశాక పవన్‌కు పాచిపోయిన లడ్డూలు బందరు లడ్లు అయ్యాయి’’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. ‘‘కమ్యూనిస్టులకు బాకీ పడ్డానా? అంటున్నాడు పవన్‌.. రాజకీయాల్లో అప్పులుంటాయా?’’ అని ప్రశ్నించారు.

దమ్మున్నవాడే బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడగలరని, ఆ దమ్ము మాకుందని, నీకు లేకనే బీజేపీతో కలుస్తున్నావా? అని ఆయన విమర్శించారు. రాష్ట్ర విభజనకు కారణమై, ప్రత్యేక హోదాను నిరాకరించి రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న బీజేపీతో ఎలా చేతులు కలుపుతావని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ఆక్షేపించారు. రాష్ట్రానికి ‘పాచిపోయిన లడ్లు’ ఇచ్చారంటూ బీజేపీని విమర్శించిన పవన్‌కు ఇప్పుడవే తాజాగా కనిపించడం విడ్డూరమన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసమే ఈ నిర్ణయమనడం జనాన్ని మోసం చేయడమేనని, ఆత్మవంచన కూడా అని అన్నారు. పవన్‌ బీజేపీతో కలవడమంటే నిస్సందేహంగా అవకాశవాదమేనన్నారు. రాష్ట్రానికి బీజేపీ చేసిన ద్రోహానికి ప్రజలు గత ఎన్నికల్లో ఆ పార్టీని పూర్తిగా తిరస్కరించారని, రాబోయే రోజుల్లోనూ మీకూ(పవన్‌), బీజేపీకీ అదే గతి తప్పదని అన్నారు. కాగా, జాతీయ పౌర పట్టిక(ఎన్‌ఆర్‌సీ) అమలును నిరాకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా మిగతా రాష్ట్రాల మాదిరిగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మధు వేరొక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు