‘సైకిల్‌’ కోసం న్యాయ పోరాటం!

21 Nov, 2018 00:50 IST|Sakshi

హైకోర్టుకు వెళ్లాలని యోచిస్తున్న ఎస్పీ

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల్లో తమకు సైకిల్‌ గుర్తునే కేటాయించాలని కోరుతున్న సమాజ్‌వాదీ పార్టీ ఈ విషయంలో న్యాయపోరాటానికి సన్నద్ధమవుతోంది. ఈ మేరకు హైకోర్టులో కేసు వేయనున్నట్లు తెలిసింది. తెలంగాణలో గత ఎన్నికల్లో టీడీపీ 15 అసెంబ్లీ, ఒక ఎంపీ స్థానంలో విజయం సాధిం చినందున.. ఆ గుర్తును కేటాయించలేమని ఎన్నికల సంఘం ఇప్పటికే స్పష్టం చేసింది. బుధవారం ఎస్పీకి ఓ తాత్కాలిక గుర్తును ఖరారు చేయనుంది.

అయితే, జాతీయ పార్టీ అయిన తమకే సైకిల్‌ గుర్తును ఇవ్వాలని ఎస్పీ వాదిస్తోంది. టీడీపీ పోటీచేసే 13 నియోజకవర్గాలను మినహాయించి మిగిలిన 106 స్థానాల్లో తమకు ఆ గుర్తును ఇవ్వాలని డిమాండ్‌ చేస్తోంది. టీడీపీ పోటీ చేసే 13 చోట్ల తాత్కాలిక గుర్తుతో పోటీచేసేందుకు తమకు అభ్యంతరం లేదని తెలిపింది. ఇందుకు ఈసీ అంగీకరించకపోవడంతో పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ సింహాద్రి న్యాయపోరాటా నికే మొగ్గుచూపుతున్నారు. వీలైనంత త్వరగా కేసు వేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

ప్రచారానికి అఖిలేశ్‌..
ఎస్పీ తరఫున ప్రచారం చేయడానికి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ సీఎం అఖిలేశ్‌యాదవ్‌ త్వరలోనే రాష్ట్రానికి రానున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్, వరంగల్, జనగామ, కరీంనగర్‌తోపాటు ఉత్తర భారతీయులు అధికంగా ఉండే ఆదిలాబాద్, నిజామాబాద్‌లలోనూ అఖిలేశ్‌ సభలు ఉండేలా ప్లాన్‌ చేస్తున్నామని ఆ పార్టీ జనగామ అభ్యర్థి ప్రొఫెసర్‌ తాటికొండ వెంకటరాజయ్య వెల్లడించారు.

మరిన్ని వార్తలు