తీన్మార్‌ విక్టరీ

10 Apr, 2019 11:21 IST|Sakshi

ఏకకాలంలో మూడుచోట్ల గెలుపు

వరంగల్‌ లోక్‌సభ స్థానానికి తొలి ఎంపీ

లెజెండ్‌ – పెండ్యాల రాఘవరావు

ఎన్నికల్లో ఒకచోట గెలవడమే గగనమవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఒకేసారి ఏకంగా మూడుచోట్ల గెలిచి దేశ చరిత్రలోనే రికార్డు సృష్టించారు పెండ్యాల రాఘవరావు. ఉమ్మడి వరంగల్‌ జిల్లా రాజకీయరంగంలో ఆయనది చెరగని ముద్ర. ప్రస్తుత తరానికి ఆయన గురించి తెలియకపోవచ్చు. జైలు నుంచే  నామినేషన్‌ వేసి ఒక లోక్‌సభ, రెండు అసెంబ్లీ స్థానాలకు ఏకకాలంలో పోటీ చేసి ఎలాంటి ప్రచారం లేకుండానే అన్ని స్థానాల్లోనూ విజయం సాధించిన అసామాన్యుడు. ఇది దేశంలోనే అరుదైన రికార్డు. దీనిని ఇప్పటి వరకు ఎవరూ బ్రేక్‌ చేయలేదు. పెండ్యాల రాఘవరావు ఒక సామాజికవేత్తగా జీవితాన్ని ప్రారంభించి రాజకీయ నేతగా ఎదిగిన క్రమం.. ప్రస్తుత రాజకీయ నాయకులకు ఓ పాఠం. వరంగల్‌ లోక్‌సభ నియోజకవర్గం తొలి ఎంపీ ఆయన.

మూడుచోట్ల గెలుపు
రాఘవరావు 1952లో వరంగల్‌ లోక్‌సభ  స్థానం నుంచి, హన్మకొండ, వర్ధన్నపేట శాసనసభ స్థానాల నుంచి పీడీఎఫ్‌ అభ్యర్థిగా పోటీ చేశారు. అనూహ్యంగా ఆయన ఈ మూడు స్థానాల్లోనూ విజయం సాధించారు. వరంగల్‌ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్ధి ప్రజాకవి కాళోజీ నారాయణపై పోటీచేసి 3,613 ఓట్ల మెజార్టీతో గెలిచారు. అదే సమయంలో హన్మకొండ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్ధి బీకే రెడ్డిపై 6,628 ఓట్ల మెజార్టీతో, వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి సి.రావుపై 2,803 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఈ మూడింటిలో వరంగల్‌ లోక్‌సభ స్థానంలో కొనసాగడానికి ఇష్టపడ్డారాయన. శాసనసభ సభ్యత్వాలకు రాజీనామా చేశారు.

స్వాతంత్య్ర పోరాటాలతో ప్రభావితం
పెండ్యాల రాఘవరావుది ప్రస్తుత జనగామ జిల్లా చిన్నపెండ్యాల గ్రామం. 1917లో జన్మించారు. తల్లిదండ్రులు పెండ్యాల రామచంద్రారావు, రామానుజమ్మ. ఆయన హన్మకొండలో చదువుకున్నారు. 1930లో స్వాతంత్య్ర పోరాటాలు ఆయనను ప్రభావితం చేశాయి. హన్మకొండ నుండి చిన్న పెండ్యాలకు తిరిగి వెళ్లిన తర్వాత రాఘవరావు సంఘ సంస్కర్తగా మారారు. 1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చినా ఇక్కడ నిజాం రాష్ట్రానికి మాత్రం రాలేదు. ఆ మధ్య కాలంలో రాఘవరావు రాజకీయంగా ఎంతో ఎదిగారు. మొదట్లో ఆర్య సమాజం, ఆంధ్రమహాసభ కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొన్నారు. హరిజనులతో సహపంక్తి భోజనాలు చేశారు. ఆంధ్రమహాసభలో చీలిక రావడంతో కమ్యూనిస్టులతో చేరి సాయుధ పోరాటం వైపు మొగ్గు చూపారు.

జైలు నుంచే పోటీ
నిజాంకు వ్యతిరేకంగా సైనిక చర్యతో హైదరాబాద్‌ స్టేట్‌కి కూడా స్వాతంత్య్రం వచ్చింది. లక్ష్యం నెరవేరింది కాబట్టి సాయుధ పోరాటాన్ని విరమించాలనేది ఆయన వాదన. కొనసాగించాలన్న వారి వాదనను వ్యతిరేకించారు కూడా. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని వాదించారు పెండ్యాల. దీంతో భారత కమ్యూనిస్టు పార్టీ.. రావి నారాయణరెడ్డి, రాఘవరావు సభ్యత్వాలను రద్దు చేసింది. సైనిక చర్య సందర్భంగా రాఘవరావు మల్కాపురం ప్రాంతంలో పోలీసులకు దొరికి జైలు పాలయ్యారు. ఆయన జైల్లో ఉండగానే (1952) ఎన్నికలు వచ్చాయి. దీంతో జైలు నుంచే ఎన్నికల్లో పోటీ చేశారాయన. కమ్యూనిస్టు పార్టీ తమ సభ్యత్వాన్ని రద్దు చేయడంతో నారాయణరెడ్డి, రాఘవరావు పీపుల్స్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ (పీడీఎఫ్‌) పక్షాన ఎన్నికల్లో పోటీచేసి గెలిచారు. ఆ తర్వాత 1957 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్ధి ఎస్‌ఏ ఖాన్‌ చేతిలో ఓడిపోయారు.

హక్కులపై ప్రసంగం
పెండ్యాల రాఘవరావు పార్లమెంట్‌లో పలు అంశాలపై అనర్గళంగా ప్రసంగించారు. సంస్థానాలను విలీనం చేసినప్పుడు జమీందార్లు, జాగీర్దార్లకు లక్షల్లో పారితోషికాలు ఇచ్చే ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించారు. స్త్రీల హక్కులపై గళమెత్తారు. కల్లుగీత చట్టాన్ని తేవడంలో కీలకపాత్ర పోషించారు.– గజవెల్లి షణ్ముఖరాజు, స్టాఫ్‌ రిపోర్టర్‌– వరంగల్‌ రూరల్‌

మరిన్ని వార్తలు