దూకుడు తగ్గించడమా? పెంచడమా?

14 Feb, 2020 03:58 IST|Sakshi

పశ్చిమబెంగాల్‌ ఎన్నికల ప్రచారంపై పునరాలోచనలో బీజేపీ

కోల్‌కతా/న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయంతో.. రానున్న పశ్చిమబెంగాల్‌ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై భారతీయ జనతా పార్టీ పునరాలోచనలో పడింది. గతంలో మాదిరిగానే పౌరసత్వ సవరణ చట్టం అమలు, జాతీయ పౌర పట్టిక(ఎన్నార్సీ)లపై దూకుడుగా వెళ్లాలా? లేక ప్రత్యామ్నాయ వ్యూహాలను తెరపైకి తేవాలా? అనే విషయంలో పార్టీ రాష్ట్ర నేతలు భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 2021లో పశ్చిమబెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

ఆ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ.. అధికార టీఎంసీని ఎదుర్కొనేందుకు అన్ని రకాలుగా సమాయత్తమవుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో సాధించిన ఫలితాలే అసెంబ్లీ ఎన్నికల్లోనూ పునరావృతం కాబోవని తాజా ఢిల్లీ ఎన్నికలు స్పష్టం చేశాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమబెంగాల్‌లో బీజేపీ మంచి ఫలితాలను సాధించింది. మొత్తం 42 స్థానాలకు గానూ 18 సీట్లను గెలుచుకుంది. లోక్‌సభ ఎన్నికలతో పోల్చుకుని.. అసెంబ్లీ ఎన్నికల్లోనూ మెరుగైన ఫలితాలు సాధిస్తామని భావించలేమని పార్టీ రాష్ట్ర నేతలు పేర్కొంటున్నారు.

వారు ఢిల్లీ ఫలితాలను ఉదాహరణగా చూపుతున్నారు. ఢిల్లీలో 2019 లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 7 స్థానాలను గెలుచుకున్న బీజేపీ.. అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి ఊహించని పరాజయాన్ని మూటకట్టుకుంది. ‘ఢిల్లీలో కొన్ని నెలల వ్యవధిలోనే రెండు విభిన్న ఫలితాలు వచ్చాయి. అందువల్ల లోక్‌సభ ఎన్నికల్లో 18 సీట్లు గెలుచుకున్నాం కాబట్టి అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలుస్తామని ధీమాగా ఉండలేం’ అని వారు వివరించారు. ‘రాష్ట్ర ఎన్నికలకు వ్యూహాలను మార్చాల్సి ఉంటుంది.

జాతీయ ఎన్నికల్లో పనిచేసిన అంశాలు రాష్ట్రాల ఎన్నికల్లో పనిచేయకపోవచ్చు.సీఏఏ, ఎన్నార్సీల అమలుపైననే మా ప్రచారం ఉండకూడదు. సుపరిపాలనకు సంబంధించిన ఇతర అంశాలనూ తెరపైకి తేవాలి’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక సీనియర్‌ బీజేపీ నేత అభిప్రాయపడ్డారు. ఈ వాదనకు విరుద్ధంగా మరో వాదనను మరి కొందరు నేతలు వినిపించారు. ‘సీఏఏ, ఎన్నార్సీలకు సంబంధించి వ్యూహాలను మార్చాల్సిన అవసరం లేదు. వాటిపై దూకుడుగా ముందుకు వెళ్లడమే మంచిది.

గతంలో అలా దూకుడుగా వెళ్లిన సందర్భంగా మంచి ఫలితాలు వచ్చిన ఉదాహరణలు ఉన్నాయి. తృణమూల్‌ వంటి పార్టీని ఎదుర్కోవాలంటే.. ఆవేశపూరిత, ఉద్వేగభరిత వ్యూహాలనే అమలు చేయాలి. ఒకవేళ వ్యూహాలను మారిస్తే వెనకడుగు వేసినట్లవుతుంది. ఇది పార్టీ శ్రేణుల్లోకి తప్పుడు సందేశం తీసుకువెళ్తుంది’ అని పశ్చిమబెంగాల్‌ బీజేపీ చీఫ్‌ దిలీప్‌ ఘోష్‌కు సన్నిహితులైన కొందరు సీనియర్‌ నేతలు అభిప్రాయపడ్తున్నారు.

ద్విముఖ పోరు వల్లనే ఓటమి
‘ఢిల్లీ’ పరాజయంపై బీజేపీ సమీక్ష ప్రారంభించింది. గతం కన్నా ఈ సారి ఓటు శాతం పెంచుకున్నప్పటికీ.. ద్విముఖ పోటీ నెలకొనడం వల్లనే ఓటమి పాలయినట్లు పార్టీ వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 స్థానాలకు గానూ ఆప్‌ 62 సీట్లు గెలుచుకుని ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. 2015లో కేవలం 3 సీట్లు గెలుచుకున్న బీజేపీ.. ఈ సారి ఆ సంఖ్యను కాస్త మెరుగుపర్చుకుని 8 స్థానాల్లో విజయం సాధించింది. అయితే, పార్టీ దిగ్గజాలను ప్రచార బరిలో దింపినప్పటికీ ఆశించిన ఫలితం దక్కకపోవడంపై గురువారం పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా సమీక్షా సమావేశం నిర్వహించారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు