ఒక్కసారి కమిట్‌ అయితే..

15 Nov, 2018 03:15 IST|Sakshi

‘ఆల్‌ ఫ్రీ’ హామీలు చెల్లవు

ఇచ్చిన హామీ అమలుకు తగిన  ఆర్థిక వనరులనూ చూపాలి

నెరవేరని హామీలపై ప్రజలు కోర్టుకెళ్లే వీలు

ఇచ్చిన హామీలకు కట్టుబడాల్సిందే..

ఊకదంపుడు హామీలు.. నోటికొచ్చిన వాగ్దానాలు.. చేతి కొచ్చిన రాతలతో ఇష్టానుసారం మేనిఫెస్టోలను రూపొందించేసి ఓట్లు దండుకుందామంటే ఇకపై కుదరదు. తూతూ మంత్రంగా మేనిఫెస్టోలను ప్రకటించేసి.. గెలిచాక హామీల సంగతి చూద్దామనుకున్నా చెల్లదు. ఓటర్లకు వ్యక్తిగత ప్రయోజనం కలిగించే ఉచిత హామీలిచ్చేందుకు నిబంధనలు అంగీకరించవు. ఎన్నికల మేనిఫెస్టోల ప్రకటన విషయంలో రాజకీయ పార్టీలు జాగ్రత్తగా ఉండక తప్పదు. ఎన్నికల మేనిఫెస్టోలను కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల ప్రవర్తన నియమావళి పరిధిలోకి తెచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు అమలులో భాగంగా ఎన్నికల మేనిఫెస్టోల రూపకల్పనలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు అనుసరించాల్సిన విధివిధానాలను ఎన్నికల ప్రవర్తన నియమావళిలో 8వ భాగంగా చేర్చుతూ 2015 ఏప్రిల్‌ 24న ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఎన్నికల మేనిఫెస్టోల విషయంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు పారదర్శకత, జవాబుదారీతనంతో వ్యవహరించక తప్పని పరిస్థితి ఏర్పడింది.

‘కోడ్‌’ కిందకు మేనిఫెస్టో
- ఎన్నికల ప్రవర్తన నియమావళి స్ఫూర్తికి అనుగుణంగా మేనిఫెస్టోలు ఉండాలి. రాజ్యాంగంలో పొందుపరిచిన ఆదర్శాలు, విలువలకు భంగం కలిగించేలా ఉండరాదు.
రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాదేశిక సూత్రాల మేరకు పౌరుల కోసం వివిధ సంక్షేమ పథకాలను రూపొందించే అధికారం ప్రభుత్వాలకు ఉంది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇలాంటి సంక్షేమ పథకాలపై హామీలివ్వడంపై ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే, ఓటర్లను అనుచిత ప్రభావాలకు లోను చేయకూడదు.
పారదర్శకత పరిరక్షణ, అందరికీ (రాజకీయ పార్టీలు, అభ్యర్థులందరికీ) సమ అవకాశాల కల్పన, హామీల విశ్వసనీయత కోసం మేనిఫెస్టోలో ప్రకటించే హామీలు హేతుబద్ధంగా ఉండాలి. హామీల అమలుకు పద్ధతులు, అవసరమైన ఆర్థిక వనరులను సవివరంగా తెలపాలి. అమలుకు సాధ్యమైన హామీలతోనే ఓటర్ల మద్దతు కోరాలి.

అసలు మూలం ఇదీ..
రాజకీయ పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోను తప్పనిసరిగా అమలు చేసేలా ఆదేశించాలని ఎస్‌.సుబ్రహ్మణ్యం బాలాజీ అనే వ్యక్తి వేసిన కేసులో 2013 జూలై 5న సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపి ఎన్నికల మేనిఫెస్టోలో ఉండాల్సిన కంటెంట్‌పై విధివిధానాలు రూపొందించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. అందుకు కొన్ని మార్గదర్శకాలను సూచించింది.
ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 123 ప్రకారం మేనిఫెస్టోల్లో ఇచ్చే హామీలను అవినీతిమయ విధానాలతో రూపకల్పన చేసేందుకు వీల్లేదు. ఏ విధమైన ఉచిత హామీలైనా ప్రజలందరినీ ప్రభావితం చేస్తాయనడంలో అనుమానం లేదు. స్వేచ్ఛాయుతంగా, పారదర్శకంగా జరగాల్సిన ఎన్నికలు ఇలాంటి హామీలతో కుదుపునకు గురవుతాయి. 
సాధారణంగా ఎన్నికల తేదీ ప్రకటనకు ముందే రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలను ప్రకటిస్తాయి. ఎన్నికల తేదీ ప్రకటనకు ముందటి చర్యలను నియంత్రించే అధికారం ఎన్నికల సంఘానికి ఏ మాత్రం లేదు. అయితే, ఎన్నికల మేనిఫెస్టోలు నేరుగా ఎన్నికలకు సంబంధించిన అంశమైనందున ఈ విషయంలో మినహాయింపు పొందవచ్చు.

ధ్రువీకరణ తప్పనిసరి
ఇప్పటి వరకు రాజకీయ పార్టీలు ప్రజలు, పత్రికలకు మాత్రమే ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించేవి. ఇకపై ఎన్నికల సంఘానికీ సమర్పించాల్సిందే. మేనిఫెస్టోను ప్రకటించిన 3 రోజుల్లోగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి పార్టీలు, అభ్యర్థులు ఆంగ్ల/హిందీ భాషల్లో 3 జతల కాపీలను సమర్పించాలి. ఎన్నికల ప్రవర్తన నియమావళిలోని 8వ భాగంలో పేర్కొన్న విధివిధానాలకు అనుగుణంగానే మేనిఫెస్టోలో హామీలు, కార్యక్రమాలు, విధానాలను పొందుపర్చినట్లు ధ్రువీకరణ పత్రం సైతం మేనిఫెస్టోలతో పాటు సీఈఓకు సమర్పించాలి. ఈ మేనిఫెస్టోలను ఎన్నికల సంఘం భద్రపరుస్తుంది. 

‘హామీ’లపై కోర్టుకు వెళ్లవచ్చు.. 
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పార్టీలు అధికారంలోకి వచ్చాక అమలు చేయకపోతే ప్రజలు కోర్టులను ఆశ్రయించవచ్చని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) రజత్‌కుమార్‌ ఇప్పటికే స్పష్టం చేశారు. పార్టీలు సమర్పించే మేనిఫెస్టోలను ఎన్నికల సంఘం పరిశీలించడం ఆచరణలో సాధ్యం కాదని, ఒకవేళ పరిశీలన జరిపి మార్పులు సూచిస్తే పార్టీలు కోర్టులకు వెళ్లి సవాలు చేసే అవకాశముందని, దీంతో షెడ్యూల్‌ ప్రకారం ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగదని ఆయన అంటున్నారు. మరోవైపు మేనిఫెస్టోలను ఎన్నికల సంఘం పరిశీలించాల్సిందేనని స్వచ్ఛంద సంస్థలు, పౌర సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. 
..::మహమ్మద్‌ ఫసియొద్దీన్‌

నిప్పులాంటి వారి ఉప్పు ముప్పు!
పట్టు వదలని ఓటరు రాజకీయ బేతాళుణ్ణి భుజాన వేసుకొని పోలింగ్‌ బూతు వైపు నడవటం మొదలుపెట్టాడు. ఓటరుకు అలసట కలగకుండా ఉండేందుకు ఎప్పటిలాగే  కథ చెప్పడం మొదలుపెట్టాడు రాజకీయ బేతాళుడు. 
అనగనగనగా ఓ ఊళ్లోకి నలుగురు బాటసారులు వచ్చారు. ఓ చెట్టుకింద చేరాక తామంతా తినేయడం.. సారీ తినడం కోసమే అక్కడికి చేరినట్టు తెలుసుకున్నారు. 
తమ దగ్గరున్న వనరులతో నలుగురూ వేర్వేరుగా వంట చేసుకుంటే ఎవ్వరికీ ఏమీ రాదు. అదే గనక సరుకులన్నీ ఒకేచోట చేర్చి నలుగురం కలిసి వండుకుంటే నాలుగైదు రకాల ఐటమ్స్‌తో అందరం మృష్టాన్నభోజనం చేయవచ్చనుకున్నారు. 
అప్పుడు మొదలైంది గొడవ. ఎవరు ఏ ఐటమ్‌ కోసం ముడి సరుకులు తేవాలా అని రగడ.. కాసేపు వాదోపవాదాలు కొససాగాయి. చివరికెలాగో ఒప్పందం కుదిరింది. 
అయితే తన వాటాగా ఉప్పు తెస్తానన్నాడు ఒకాయన. రుచి కోసం ఉప్పు చాలా ప్రధానమన్నాడు. ఉప్పులేని పప్పు చప్పన అనీ, ఉప్పు లేని కూర.. పప్పు లేని పెండ్లి అనీ సామెతలు పలికాడు. ‘పదునుగ మంచి కూర నలపాకము చేసిననైన అందు ఉప్పు లేక రుచిపుట్టగ నేర్చునటయ్య’ అంటూ శతకపద్యాలు చెప్పాడు. 

ఉప్పుతో పొత్తుకలపడం అనే సామెత ఉండనే ఉంది కదా. అక్కడికీ వాళ్లలో ఒకడికి డౌటొచ్చి... ‘మేమంటే బియ్యం, పప్పు, చింతపండు, కూరగాయలు ఇలా రకరకాలు తెచ్చాం. రుచులకు రారాజు ఉప్పు అనే సామెత కూడా తెలుసు. రాజును తెస్తున్నానంటూ నువ్వు నీ వాటాగా చాలా తక్కువ ఇస్తున్నావనిపిస్తోంది’’ అంటూ అనుమానపడ్డాడు. 
అప్పుడాయన ‘‘మీరేమీ అపోహ పడవద్దు. నేను నిప్పులాంటివాణ్ణి. మీరు బియ్యం, పప్పూ, కూరగాయలూ, చింతపండూ ఇలాంటివన్నీ తలా ఒక కిలో తెచ్చినట్టే... నేనూ ఉప్పు ఒక కిలో తెస్తా. నిజానికి రుచికి చిటికెడే చాలు. కానీ మీకెందులోనూ తీసిపోకుండా ఉండేందుకే కిలో తెచ్చిస్తా. ఇప్పుడిక ఇందులో మోసమేముంది?’’ అంటూ సమాధానమిచ్చాడు. ఇక్కడిదాకా కథ చెప్పిన బేతాళుడు ‘‘ఓ ఓటరూ.. చూశావు కదా. ఈ ఉప్పు మహాశయుడి యుక్తి గురించి నీకేమర్థమైందో చెప్పు. తెలిసీ చెప్పకపోతే ఓటర్ల జాబితాలో నీ పేరు గల్లంతవుతుంది’’ అన్నాడు బేతాళుడు. 
‘‘ఉప్పు వల్ల సదరు వంటకు రుచి వస్తుందో రాదోగానీ.. మిగతావాళ్లందరికీ హైబీపీ రావడం ఖాయం. ఆ బీపీతో తమకు ఆశ్రయం ఇచ్చిన చెట్టులాంటి సొంత పార్టీ ఆఫీసులను ధ్వంసం చేసేంతగా చిర్రెత్తిపోవడమూ ఖాయం. చాలాచోట్ల అది తెలుస్తూనే ఉంది కదా’’ అని సమాధానమివ్వడంతో రాజకీయ బేతాళుడు మళ్లీ అందకుండా తుర్రుమన్నాడు.   

మరిన్ని వార్తలు