దుర్మార్గపు సర్కారును సాగనంపుదాం

6 Apr, 2019 09:31 IST|Sakshi

సాక్షి, నెల్లూరు : ‘రాష్ట్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీల కుట్రలు, కుతంత్రాల్ని సమర్ధవంతంగా ఎదుర్కొని తొమ్మిదేళ్లుగా ప్రజలతో మమేకమై వారి కష్టసుఖాల్లో పాలు పంచుకున్నారు ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. ప్రజలు ఆయనకు ఒక్క అవకాశం ఇచ్చి చూడాలి. వైఎస్‌ జగన్‌ పరిపాలన కూడా ఒక్కసారి చూద్దాం. ప్రజాస్వామ్యంలో తప్పనిసరిగా మార్పు అవసరం’ అని నెల్లూరు మాజీ ఎంపీ, వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ‘సాక్షి’తో ఆయన తన అభిప్రాయాలు పంచుకున్నారు. 

ఆయనవి అన్నీ అబద్ధాలే..
నలభై ఏళ్ల అనుభవం ఉందని చంద్రబాబు చెప్పుకుంటున్నారు. ఆయన అనుభవం ఎవరికి అక్కరకొచ్చింది. ఆయన దుర్మార్గమైన పాలనలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. తన స్వార్థం కోసం ఎన్ని అబద్ధాలు చెప్పేందుకైనా చంద్రబాబు సిద్ధం. ఎన్ని యూటర్న్‌లు అయినా తీసుకుంటారు. ప్రత్యేక హోదా విషయంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తొలి నుంచి ఒకే మాటపై నిలబడ్డారు.

హోదా వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని ఐదేళ్లగా పోరాటం చేస్తుంటే.. హోదాకు మద్దతిస్తే జైలుకు పంపిస్తానని చంద్రబాబు భయపెట్టారు. ఎన్నికలకు ఏడాది ఉందనగానే యూటర్న్‌ తీసుకుని ఆయనే హోదాపై పోరాటం చేస్తున్నట్లు ప్రజలను నమ్మించేందుకు దొంగ దీక్షలు చేశారు. అవన్నీ బెడిసికొట్టాయి. చంద్రబాబు విన్యాసాల్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు.  

బాబు పాలనపై ప్రజల్లో ఏవగింపు
జగన్‌మోహన్‌రెడ్డికి ఒక్క అవకాశం ఇవ్వమంటే చంద్రబాబు దానికి ఎన్ని వక్ర భాష్యాలు అల్లారో.. ఒక్క అవకాశం ఇచ్చి పులినోట్లో తలపెడతామా? ఒక్క అవకాశం ఇచ్చి కొండ నుంచి దూకుతామా? అంటూ చాలా దుర్మార్గంగా మాట్లాడుతున్నాడు. పిల్ల నిచ్చిన మామ నుంచి సీఎం కుర్చీని లాక్కుని గతంలో తొమ్మిదేళ్లు సీఎంగా పనిచేశాడు. రాష్ట్ర విభజనాంతరం కూడా ఐదేళ్లు సీఎంగా పనిచేసిన బాబుకు తన పాలన ఎంత అస్తవ్యస్తంగా సాగిందో, ఎన్ని లోటుపాట్లు ఉన్నాయో తెలుసు. ఇంత దుర్మార్గ పరిపాలన చేస్తున్న చంద్రబాబును ప్రజలు ఏవగించుకుంటున్నారు.  

పదవుల మీద వ్యామోహం లేదు 
నాకు పదవుల మీద వ్యామోహం లేదు. రెండుసార్లు పార్టీ ఆదేశిస్తే పదవులు త్యాగం చేశాను. నేను పోటీ చేయనని గతంలో వైఎస్‌ జగన్‌కే చెప్పాను. ఆయన 
పోటీ చేయమని చెప్పినా.. ఆరోగ్య సమస్యల వల్ల నేను చేయనన్నాను. నా కోరిక మేరకే సీటు మరొకరికి కేటాయించారు తప్ప.. నన్ను కాదని మాత్రం ఇవ్వలేదు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజలు ఒక్కసారి అవకాశం ఇచ్చి ఆశీర్వదిస్తే చాలు. అంతకంటే నాకు ఏ పదవులు ముఖ్యం కాదు.  

పరిపాలనలో మార్పు అవసరం
చంద్రబాబుకు వయసు పైబడింది. ఆయనకు విరామం ఇస్తే మంచిది. ప్రజాస్వామ్యంలో మార్పు తప్పనిసరి. ఒక్కసారి వైఎస్‌ జగన్‌కు అవకాశమిచ్చి ఆయన పరిపాలన చూద్దాం. మార్పు కోరకపోతే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది. జగన్‌మోహన్‌రెడ్డి కూడా ప్రజల కష్టసుఖాలు తెలుసుకుని మంచి పాలన అందిస్తాడని నాకు నమ్మకం ఉంది.

ఈ ఐదేళ్లు చంద్రబాబు పరిపాలన దుర్మార్గంగా సాగింది. ఇంత దుష్టపాలనను ప్రజలు క్షమించరు. ఈ రోజు ఎన్నికలకు ఇంత ఖర్చవుతుందంటే అది చంద్రబాబు చలువే. ప్రజాస్వామ్యాన్ని అపవిత్రం చేశాడు. చైతన్యవంతులైన ప్రజలు ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. చంద్రబాబు దుర్మార్గ పరిపాలనకు చరమగీతం పాడాలి. 

2004లోను వైఎస్‌పై దుర్మార్గ ప్రచారం చేశారు 
దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సీఎం కాకముందు ఆయన అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని నాశనం చేస్తాడంటూ చంద్రబాబు ఇదే విధంగా దుర్మార్గ ప్రచారం చేశారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎంతటి చక్కటి పరిపాలన అందించారు. చాలా గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా ఆకాశమంత ఎత్తుకు ఎదిగారు. ఎన్నికల సమయంలో రెండు హామీలు ఇచ్చిన ఆయన అధికారంలోకి రాగానే ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారు.

రాష్ట్రంలో పేదలకు 47 లక్షల ఇళ్లు నిర్మించారు. ప్రతి నెల ఒకటో తేదీనే పింఛన్లు ఇచ్చి ఆదుకున్నారు. ప్రతి పేదోడికి ఆరోగ్య భద్రత కల్పించారు. ఆరోగ్యశ్రీ పథకం వల్ల ఎంత మంది పేదలకు మేలు జరిగిందో అందరికీ తెలుసు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పేద విద్యార్థులకు వరంలా మారింది. ఎంతో మంది పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివారంటే అది వైఎస్‌ చలవే కదా. 

మరిన్ని వార్తలు