చంద్రబాబుకు ముద్రగడ ఘాటు లేఖ

15 Apr, 2018 13:07 IST|Sakshi
కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం(పాత చిత్రం)

కాకినాడ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడికి కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం మరోసారి ఘాటు లేఖ సంధించారు.  ‘ మీరు మేధావి అని అందరూ భావించారు. కానీ మీ మేధావితనంతో మీకు కావాల్సిన వారికి, మీ కుటుంబానికి కోట్ల రూపాయలు దోచిపెట్టారని అర్ధమైంది. మా జాతికి ఇచ్చిన హమీలను అమలు చేయమని అడిగితే అన్నదమ్ముల్లాంటి మా సోదరులతో తిట్టించి పబ్బం గడుపుకుంటున్నారు. మా జాతిలో కొందరి ఆర్ధిక మూలలను దెబ్బతీశారు. కొందరిపై తప్పుడు కేసులు పెట్టి రౌడీ షీట్లు తెరిపించారు.’  అని లేఖ ద్వారా విమర్శించారు.

‘ కామన్ వెల్త్ ఆటల్లో రెండు సార్లు స్వర్ణం సాధించిన కాపు క్రీడాకారుడు వెంకట రాహుల్‌కు ఎందుకు అభినందనలు చెప్పలేదో లోకానికి చెప్పండి. మీ సంతానం తెలుగు నేర్చుకోవడానికి ప్రజల ఆస్తి కోట్ల రూపాయలు ఖర్చు చేయడం సిగ్గుగా లేదా.  హమీలు అమలు చేయకుండా ప్రజలను మభ్యపెట్టాడానికి మీరు చేస్తున్న గోబెల్స్ ప్రచారం రాష్ర్టానికే కాదు..దేశానికే ప్రమాదం. మీ మోసం కన్నా క్యాన్సర్ వ్యాధే మంచిది. మీ మోసానికి మందులు కూడా ఉండవు. ఇలా మోసం చేసే పార్టీని ప్రజలు భూస్ధాపితం చేస్తే మంచిది.  ఏపీలో రైళ్ళని ఆపితే ప్రత్యేక హోదా ఎందుకు రాదు? ’ అని లేఖలో పేర్కొన్నారు.

విలేకరులతో విడిగా మాట్లాడుతూ.. జనసేన కోశాధికారి రాఘవయ్య ఇటీవల మా ఇంటికి వచ్చినప్పుడు సూచనలు ఇచ్చానే తప్ప పార్టీలో చేరతాననలేదని వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సినిమాలను వీడి పూర్తి గా రాజకీయాల్లో ఉంటేనే రాణిస్తారు అని రాఘవయ్యకు సూచించానని ముద్రగడ తెలిపారు.

మరిన్ని వార్తలు