పరిటాల వర్గీయుల బెదిరింపులు.. పట్టించుకోని పోలీసులు

2 Apr, 2019 14:24 IST|Sakshi

సాక్షి, అనంతపురం : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాప్తాడు అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి భద్రతపై అనుమానాలు నెలకొన్నాయి. అత్యంత సమస్యాత్మక ప్రాంతమైన ఈ నియోజకవర్గంలో పోలీసులు వైస్సార్‌సీపీ అభ్యర్థికి భద్రత కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డిని చంపుతామని మంత్రి పరిటాల సునీత వర్గీయులు బహిరంగంగానే ప్రకటిస్తున్నా.. పోలీసులు నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్నారు. తోపదుర్తి గ్రామం నుంచే రాకపోకలు సాగిస్తున్న ప్రకాష్‌ రెడ్డి ఆయన సోదరులు.. మదిగుబ్బ- బి.యాలేరు మధ్య చేపట్టిన కల్వర్టు నిర్మాణాలపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ దారిలో పోలీసు గస్తీ ఏర్పాటు చేయించాలని, వారం కిందటే జిల్లా కలెక్టర్‌, ఎస్పీలను వైఎస్సార్‌సీపీ నేతలు కలిసి విజ్ఞప్తి చేశారు. అయినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో పోలీసుల తీరుపై రాప్తాడు వైఎస్సార్‌సీపీ నేత వెన్నపూస రవీంద్రారెడ్డి మండిపడ్డారు. 

మంగళవారం ఆయన రాజశేఖర్‌ యాదవ్‌, కురుబ నాగిరెడ్డిలతో కలిసి మీడియాతో మాట్లాడారు. మంత్రి పరిటాల సునీత హింసా రాజకీయాలకు పాల్పడుతున్నారని, కొడుకు శ్రీరామ్‌ను గట్టెక్కించేందుకు దేనికైనా తెగిస్తున్నారని తెలిపారు. తోపుదుర్తి బ్రదర్స్‌కు ప్రాణహాని ఉందని, అనుమానస్పద ప్రాంతాలపై ఫిర్యాదు చేసిన ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నించారు. మంత్రి పరిటాలకు కొందరు అధికారులు, పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. భద్రతా వైఫల్యంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు.

మరిన్ని వార్తలు