ఏనాటి నుంచో ఈనాటి ‘ఈ బంధం’

16 Nov, 2018 18:03 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారత దేశంలో రాజకీయాలకు, మతానికి మధ్యనున్న తెర క్రమంగా తొలగిపోతోంది. ఇక మనది లౌకిక రాజ్యాంగం అనడానికి వీల్లేకుండా అర్థం మారిపోతోంది. పొరుగునున్న భూటాన్‌ దేశం మత రాజకీయ వ్యవస్థకు స్వస్తి చెప్పి ప్రజాస్వామ్య వ్యవస్థ వైపు అడుగులు వేస్తే అందుకు పూర్తి విరుద్ధంగా భారత్‌ లౌకికవాద ప్రజాస్వామ్య వ్యవస్థకు స్వస్తి చెప్పి మత వ్యవస్థ వైపు అడుగులు వేస్తోంది. భారత తొలి ప్రధాన మంత్రి జవహర్‌ లాల్‌ నెహ్రూ రాజకీయాలకు మతానికి మధ్య ఆమడ దూరం ఉండాలని భావించి అలా ఉంచేందుకు ప్రయత్నించారు.

రాజకీయ నాయకులు స్వాములను, సాధువులను సందర్శించుకొని వారి ఆశీర్వాదం తీసుకోవడంతో మొదలైన రెండింటి మధ్య బంధం, స్వాములనే ఎన్నికల్లో నిలబెట్టి, వారి ఆదేశాలను ఆచరించే స్థాయికి పెనవేసుకుపోయింది. పీఠాలు, పీఠాధిపతుల వద్దకే కాకుండా రాజకీయ నాయకులు కర్ణాటకలోని మఠాలు, పంజాబ్, హర్యానాలోని డేరాలను కూడా సందర్శిస్తుంటే వారే ఏ రాజకీయ పార్టీకి ఓటేయాలో ప్రజలకు సూచించే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు భారతీయ జనతాపార్టీ అయినా, కాంగ్రెస్‌ పార్టీ అయినా మత రాజకీయాలను ఆచరించక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడికెళ్లినా దేవాలయాలను సందర్శిస్తుంటే కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ శివాలయాలు తిరుగుతూ క్షీరాభిషేకాలు చేస్తున్నారు.

పీవీ నరసింహారావు ప్రభుత్వంలో రాజ్యాంగేతర శక్తిగా కేంద్రంలో చంద్రస్వామి నిర్వహించిన పాత్రను మనం మరచిపోలేం. యోగా గురువు రామ్‌దేవ్, ‘ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌’ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్‌లు బీజేపీకి మద్దతుగా 2014 సార్వత్రిక ఎన్నికల్లో నిర్వహించిన పాత్ర తెల్సిందే. ఆ ఎన్నికల సందర్భంగా వారు సూచించిన అభ్యర్థులకు కూడా బీజేపీ టిక్కెట్లు ఇచ్చింది. బీజేపీ తూర్పు ఢిల్లీ పార్లమెంట్‌ సభ్యుడు మహేశ్‌ గిరి ఇంతకుముందు ‘ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌’ ఫౌండేషన్‌ ఇంటర్నేషనల్‌ డైరెక్టర్‌గా వ్యవహరించారు.

ఎన్నికల రాజకీయాల కోసం మతాలను ఉపయోగించుకోవడం ఇటు భారతీయ జనతా పార్టీకి, అటు శిరోమణి అకాలీ దళ్‌కు కొత్త కాదు. బీజేపీ హిందూ మత పార్టీ అని, అలాంటప్పుడు హిందూత్వ ఎజెండాను దాచుకోవాల్సిన అవసరం లేదని ఇటీవల ఓ ప్రైవేటు కార్యక్రమంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా వ్యాఖ్యానించారు. బీజేపీ తరఫున పోటీ చేసి విజయం సాధించిన గోరక్‌నాథ్‌ మఠం పీఠాధిపతి ఆదిత్యనాథ్‌ యోగి, అటు పీఠాధిపతిగా, ఇటు యూపీ ముఖ్యమంత్రిగా రెండు పదవులు నిర్వహిస్తున్నారు. అందుకేనేమో పాపం! ప్రజల సమస్యలను పట్టించుకోవడానికి సమయం దొరకడం లేదు. ఉమాభారతి నుంచి మొదలు పెడితే సాధ్వీ నిరంజన్‌ జ్యోతి, స్వామి ఆదిత్యనాథ్‌ వరకు, సాక్షి మహరాజ్‌ నుంచి సత్పల్‌ మహరాజ్‌ వరకు బీజేపీలో స్వాములు జాబితా చాంతాడులా పెరిగిపోతోంది.

మొన్న మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ఐదుగురు హిందూ గురువులను పిలిపించి  ఏకంగా మంత్రి హోదాను కల్పించారు. నర్మదా నది ప్రాంతంలో జల వనరులను, అడవులను రక్షించాల్సిన ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం వారితోని ఓ కమిటీని వేశారు. నర్మదా నది వెంట అక్రమ మైనింగ్‌ను అరికట్టకపోతే తాను రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తానని హెచ్చరించిన నామ్‌దేవ్‌ దాస్‌ త్యాగి అలియాస్‌ కంప్యూటర్‌ బాబుకు నలుగురితోపాటు మంత్రి పదవి ఇవ్వడం గమనార్హం. నవంబర్‌ 28వ తేదీన మధ్యప్రదేశ్‌ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో బాబాలను మంచి చేసుకోవడం మంచిదని మన శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ భావించారు.

ఢిల్లీలో నవంబర్‌ 4,5 తేదీల్లో అఖిల భారతీయ సంత్‌ సమితి ఏర్పాటు చేసిన సమ్మేళనానికి 124 తెగలకు చెందిన మూడువేల మంది సాధువులు హాజరై అయోధ్యలో రామాలయాన్ని నిర్మించాలని తీర్మానించడంతోపాటు ఎన్నికల్లో బీజేపీకి ఓటేయాలని పిలుపునిచ్చారు. 2019, మే నెలలో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో 2019, జనవరి–మార్చి మధ్యన జరుగనున్న మహా కుంభమేళాకు ఎంత డబ్బయినా ఖర్చుపెట్టి అత్యంత ఆర్భాటంగా నిర్వహించాలని పాలకపక్షం బీజేపీ నిర్ణయించినట్లు తెల్సింది.

భూటాన్‌లో ఒకప్పుడు ప్రభుత్వానికి దిశానిర్దేశం చేసే స్థాయిలో బౌద్ధ మతం ఉండేది, ప్రభుత్వ వ్యవహారాల్లో కూడా బౌద్ధ గురువులు జోక్యం చేసుకునేవారు. 2008లో భూటాన్‌లో తొలిసారిగా ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరిగాయి. నాటి నుంచి అక్కడ మత గురువులు ఎన్నికల్లో పోటీ చేయడమే కాదు, ఎన్నికల వ్యవహారాల్లోనే జోక్యం చేసుకోవడం లేదు. వారికి ఓటు వేసే హక్కు కూడా లేదు. రాజకీయాలకు మతం అతీతంగా ఉండాలనే దృష్టితో మత గురువులు రాజకీయాలకు గుడ్‌బై చెప్పారు. ఆ దేశానికి భిన్నంగా మన మత గురువులు రాజకీయాల్లోకి వస్తున్నారు. మున్ముందు పార్లమెంట్‌లో వీరి సంఖ్య పెరిగితే ‘జై శ్రీరామ్‌’ నినాదాలతో పార్లమెంట్‌ హాలు మారుమోగి పోవచ్చు. ఇక అక్కడ ప్రార్థనలు, పూజలు కూడా మొదలు వెడితే ప్రజలు కూడా ఎంచక్కా భక్తి ఛానళ్లను కట్టేసి పార్లమెంట్‌ ఛానల్‌ను చూస్తూ పారవశ్యంతో తరించవచ్చు.

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు