ఖరారు కాని ‘దేశం’ జాబితా

14 Mar, 2020 08:33 IST|Sakshi

అభ్యర్థుల ఎంపికపై మల్లగుల్లాలు 

ఒక్కో వార్డుకు ముగ్గురు, నలుగురు నామినేషన్లు 

పార్టీ కార్యాలయాలే కొనుగోలు కేంద్రాలు 

కోటి ఖర్చు చేయగలిగే వారికే టికెట్‌ 

ఆర్థిక బలం ఉన్న వారికే బీ ఫారాలు! 

మేయర్‌ అభ్యర్థిత్వంపై సిగపట్లు 

రూ.15 కోట్లు చూపించిన వారికే ‘గ్రేటర్‌’కు అవకాశం 

వెనక్కి తగ్గిన పల్లా, గురుమూర్తి రెడ్డి 

రేసులో పీలాశ్రీను, గండి బాబ్జి 

గండి పేరు ప్రతిపాదనపై బండారు గరం గరం? 

ప్రలోభాలు లేకుండా స్థానిక ఎన్నికలు నిర్వహించాలన్నది రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం. ప్రజలు పూర్తి స్వేచ్ఛతో ఓటు వేసేలా రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టానికి ప్రతిపక్ష టీడీపీ తూట్లు పొడవడానికి సిద్ధమవుతోంది. గ్రేటర్‌ ఎన్నికల్లో కోట్లు కుమ్మరించేందుకు సమాయత్తమవుతోంది.అందు కోసం అభ్యర్థులను ఖరారు చేయకుండా.. ఆర్థిక బలం ఉన్న వారికే సీటు ఖరారు చేయడానికి బేరసారాలు సాగిస్తున్నారు. వార్డుల్లో డబ్బులు వెదజల్లేందుకు ప్రణాళికలు రచిస్తోంది.

విశాఖపట్నం: మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై టీడీపీ అధినాయకత్వం మల్లగుల్లాలుపడుతోంది. ప్రజా బలాన్ని పక్కనపెట్టి ఆర్థిక బలం ఉన్న వారికే టికెట్లు కేటాయించాలని నిర్ణయించింది. వాస్తవానికి శుక్రవారం మధ్యాహ్నంతో నామినేషన్ల దాఖలుకు గడువు ముగిసినప్పటికీ.. టీడీపీ  తమ అభ్యర్థులను ఖారారు చేయలేని పరిస్థితి నెలకొంది. పార్టీ తరఫున బీ ఫారం కావాలంటే రూ.కోటికిపైగా ఖర్చు చేయాల్సి ఉంటుందని కరాఖండిగా చెబుతోంది. దీంతో టీడీపీ ఆశావహులు తెల్లముఖం వేయాల్సి వస్తోంది. ఎమ్మెల్యేల కార్యాలయాలే అభ్యర్థుల కొనుగోలు కేంద్రాలుగా మారిపోయిన వైనం పార్టీ శ్రేణుల్లో చర్చనీయంశంగా మారింది.

దేశంలో గందరగోళం 
నామినేషన్ల దాఖలుకు గడువు ముగిసినప్పటికీ.. టీడీపీ అధిష్టానం అభ్యర్థులను ఖరారు చేయకపోవడంతో పారీ్టలో గందరగోళం నెలకొంది. ఇప్పటికే అధికార వైఎస్సార్‌సీపీ తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. వైసీపీ బీ ఫారాలతో చాలా మంది అభ్యర్థులు నామినేషన్లు సైతం దాఖలు చేయడం ప్రతిపక్ష పార్టీ ఆశావహులకు ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికీ టీడీపీ అధినాయకత్వం తమ కార్పొరేటర్‌ అభ్యర్థులను ఖరారు చేయకపోవడంపై పార్టీ శ్రేణుల్లో నిరుత్సాహం అలుముకుంది. ఒకవైపు వైసీపీ అభ్యర్థులు అప్పుడే ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతుంటే.. తేదేపా ఆశావహులు పార్టీ బీ ఫారాల కోసం ఎమ్మెల్యేల కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే నామినేషన్ల దాఖలుకు శుక్రవారం మధ్యాహ్నంతో గడువు ముగియడంతో తేదేపా ఆశావహులందరితో నామినేషన్లు వేయించడంతో అభ్యర్థులు మరింత గందరగోళానికి గురవుతున్నారు.  

ఆర్థిక బలాలపై ఆరా 
ఆయా పార్టీల అభ్యర్థులకు బీ ఫారాలు సమర్పించడానికి ఈ నెల 16 మధ్యాహ్నం 3 గంటల వరకు సమయం ఉంది. దీంతో నామినేషన్లు వేసిన వారిని టీడీపీ ఎమ్మెల్యేల కార్యాలయాలకు పిలిపించి అభ్యర్థుల ఆర్థిక బలంపై ఆరా తీస్తున్నారు. 

కోటి ఉంటేనే బీఫారం! 
నామినేషన్లు వేసిన అభ్యర్థులను టీడీపీ ఎమ్మెల్యేలు తమ కార్యాలయాలను పిలిపించి వారి బలాన్ని అంచనా వేసే పనిలో నిమగ్నమయ్యారు. వార్డులో అభ్యర్థుల ప్రజా బలం కంటే ఆర్థికంగా బలమైన వారికే బీ ఫారాలు ఇవ్వడానికి కసరత్తు చేస్తున్నారని ఆ పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ గ్రేటర్‌ ఎన్నికల్లో వైసీపీని గట్టిగా ఢీకొట్టాలంటే.. భారీగా ఖర్చు చేయాలని తెలుగుదేశం అధిష్టానం భావిస్తోంది. ఒక్కో వార్డుకు రూ.కోటికి పైగా ఖర్చు చేయాల్సిన అవసరం ఉందన్న అంచనాకు వచ్చినట్లు సమాచారం. దీంతో రూ.కోటికి పైగా వెచ్చించడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థుల వడబోతకు టీడీపీ ఎమ్మెల్యేల కార్యాలయాలే వేదికగా మారాయన్న వార్తలు గుప్పుమంటున్నాయి. 

శుక్రవారం రాత్రి వరకు ఆశావహులతో నాయకులు ఎన్నికల ఖర్చు అంశంపై చర్చ జరిపినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. నామినేషన్లు వేసిన వారిని ఒక్కొక్కరిని పిలిచి ఎన్నికల్లో ఎంత ఖర్చు చేయగలరని స్వయంగా ఎమ్మెల్యేలే అడుగుతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అత్యధికంగా ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్న వారి పేర్లతో జాబితాను సిద్ధం చేస్తున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. ఇప్పటికే కొంత మంది పేర్లను ఖరారు చేసినప్పటికీ.. శని, ఆదివారాల్లో  తుది జాబితా వెల్లడించాలని అధినాయకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

మేయర్‌ రేసులో పీలా, గండి? 
టీడీపీ నుంచి మేయర్‌ అభ్యరి్థగా పీలా శ్రీనివాస్, గండి బాబ్జిలు రేసులో ఉన్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి మేయర్‌ స్థానానికి ముందు నలుగురు అభ్యర్థుల పేర్లు వినిపించాయి. మాజీ ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాస్, తిప్పలగురుమూర్తి రెడ్డి, గండి బాబ్జి, అనకాపల్లి మాజీ శాసనసభ్యుడు పీలా గోవింద్‌ సోదరుడు పీలా శ్రీనివాస్‌ పేర్లను టీడీపీ అధిష్టానం పరిశీలించింది. అయితే ఎమ్మెల్యేలు, సీనియర్‌ నాయకులు ఈ విషయంపై గురువారం నిర్వహించిన సమావేశంలో మేయర్‌ అభ్యర్థి రూ.25 కోట్లు వరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని అంచనాకు వచ్చినట్లు సమాచారం.

అయితే అంతమొత్తంలో తాము ఖర్చు చేయలేమని నలుగురు వెనకడుగు వేయడంతో కనీసం రూ.15 కోట్లు అయినా సర్ధుబాటు చేసుకోవాల్సి ఉంటుందని చర్చకు వచ్చినట్టు తెలిసింది. దానికి కూడా పల్లా శ్రీనివాస్, తిప్పల గురుమూర్తి రెడ్డి అంగీకరించలేదు. దీంతో పీలా శ్రీనివాస్‌పై అధినాయకులు మొగ్గు చూపించారు. అయితే అనూహ్యంగా మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జి శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేశారు. దీంతో పీలా శ్రీనివాస్, గండి బాబ్జిల మధ్య పోటీ నెలకొన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. గండి బాబ్జి పేరును ప్రతిపాదించడం పట్ల పెందుర్తి మాజీ శాసనసభ్యుడు బండారు సత్యనారాయణమూర్తి ఇతర నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తమ అభిప్రాయం తెలుసుకోకుండా ఏకపక్షంగా గండి బాబ్జి పేరును పరిశీలిస్తుండడం పట్ల ఆయన కొంత అసహనంతో ఉన్నట్లు పారీ్టలో చర్చజరుగుతోంది.    

మరిన్ని వార్తలు