‘డిప్యూటీ’పై సిగపట్లు

22 May, 2018 02:41 IST|Sakshi
శివకుమార్‌, పరమేశ్వర్‌

మూడు ప్రధాన సామాజికవర్గాల నేతల కన్ను

ఇరుపార్టీల్లోనూ మంత్రి పదవులపై పోటాపోటీ  

సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో కొలువుదీరనున్న కాంగ్రెస్‌– జేడీఎస్‌ సంకీర్ణ సర్కారులో డిప్యూటీ సీఎం పదవికోసం కాంగ్రెస్‌లో తీవ్రమైన పోటీ నెలకొంది. పలువురు సీనియర్‌ నేతలు దీనికోసం తమకు తోచిన మార్గాల్లో లాబీయింగ్‌ చేసుకుంటున్నారు. జేడీఎస్‌తో పొత్తును ప్రకటించిన మరుక్షణం నుంచే డిప్యూటీ సీఎం సహా కీలక మంత్రిత్వ శాఖలపై ప్రయత్నాలు మొదలయ్యాయి. ఆంతరంగిక సమావేశాల్లోనూ పలువురు నేతలు మంత్రిత్వ శాఖలపై పట్టుబడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఉపముఖ్యమంత్రి పదవిపై సోనియా గాంధీ, రాహుల్‌లతో కుమారస్వామి చర్చించినట్లు సమాచారం. అయితే.. రెండు ఉప ముఖ్యమంత్రుల పదవులను ఏర్పాటుచేసి ఒకటి లింగాయత్‌లకు, మరొకటి దళితులకు ఇవ్వాలని చర్చ జరుగుతోంది.

పోటీలో డీకే, శివశంకరప్ప, పరమేశ్వర్‌  
ఎమ్మెల్యేల క్యాంపు రాజకీయాలను నడిపిస్తున్న కాంగ్రెస్‌ మాజీ మంత్రి డీకే శివకుమార్‌ కూడా డిప్యూటీ సీఎం పదవిని ఆశిస్తున్నారు. కేపీసీసీ అధ్యక్ష పదవి శివకుమార్‌కు ఇవ్వాలని కాంగ్రెస్‌ పార్టీ భావిస్తుండగా.. డిప్యూటీ సీఎంకే ఆయన పట్టుబడుతున్నట్లు సమాచారం. తమ సామాజిక వర్గం అధ్యక్షుడు శ్యామనూరు శివశంకరప్పకు ఉపముఖ్యమంత్రి పదవి అప్పగించాలని లింగాయత్‌లు కోరుతున్నారు. ఇక దళితుల కోటాలో కేపీసీసీ చీఫ్‌ పరమేశ్వర్‌ ఆ పదవిని ఇష్టపడుతున్నారు. మంత్రుల విషయంలోనూ తీవ్రమైన పోటీ నెలకొంది. ఇప్పటికే పలువురు లాబీయింగ్‌లు ప్రారంభించారు. మరో మూడ్రోజుల్లో బలపరీక్ష ఉన్న నేపథ్యంలో శాఖల కేటాయింపు అంశం పీటముడిగా మారినట్లు కనిపిస్తోంది. అయితే ఇప్పటివరకు మంత్రివర్గ కూర్పుపై చర్చించలేదని ఇరుపార్టీలు బహిరంగంగా చెబుతున్నప్పటికీ లోలోపల ఎమ్మెల్యేల ఒత్తిడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు సమాచారం.  

మరిన్ని వార్తలు