ఏపీలో స్థానిక ఎన్నికలు వాయిదా

15 Mar, 2020 10:33 IST|Sakshi

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వాయిదా పడింది.  కరోనా వైరస్‌ను కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించిన నేపథ్యంలో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నిర్ణయం తీసుకుంది. ఏపీలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌ కుమార్‌ ప్రకటించారు. కాగా, ఇప్పటివరకూ జరిగిన ఎన్నిక ప్రక్రియ యధావిథిగా ఉంటుందని, కేవలం జరగాల్సిన ఎన్నికలు మాత్రమే వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. అత్యున్నత స్థాయి సమీక్ష తర్వాతే వాయిదా నిర్ణయం తీసుకున్నామన్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీలుగా ఏకగ్రీవంగా ఎన్నికైన వారు కొనసాగుతారని స్పష్టం చేశారు. ఏకగీవ్రంగా ఎన్నికైన వారు ఎన్నికల్లో గెలిచిన వారితో కలిసి బాధ్యతలు స్వీకరిస్తారన్నారు. ఎన్నికల నియామవళి యధావిధిగా కొనసాగుతుందన్నారు.

నిలిపివేత మాత్రమే.. రద్దు కాదు
ఈ ఎన్నిక ప్రక్రియ నిలిపివేత మాత్రమేనని, రద్దు కాదనే విషయాన్ని రమేష్‌ కుమార్‌ స్పష్టం చేశారు. ఆరువారాల అనంతరం ఎన్నికలు జరుగుతాయన్నారు. వాయిదా ప్రక్రియ ముగిసిన తర్వాత సమీక్ష నిర్వహించి పంచాయితీల షెడ్యూల్ ప్రకటిస్తామన్నారు. నామినేషన్ వేసిన వారిని భయభ్రాంతులకి గురిచేయకూడదన్నారు. అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫిర్యాదుల కోసం ప్రత్యేక సెల్ ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే గ్రామవాలంటీర్ల నుంచి అనేక ఫిర్యాదు వస్తున్నాయని,  ఉద్యోగుల వ్యక్తిగత, ఆరోగ్య భద్రత కూడా ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. కర్ణాటక, తెలంగాణలో ఇప్పటికే అన్ని స్కూళ్లు, మాల్స్ మూసేసిందని, తాము కూడా అత్యవసర సమీక్ష నిర్వహించిన తర్వాతే వాయిదా నిర్ణయం తీసుకున్నామన్నారు.

అత్యవరస పరిస్థితుల్లో కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఉండే హక్కులు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఉంటాయన్నారు. పంచాయితీ ఎన్నికలకు ఇవాళ షెడ్యూల్ విడుదల చేయాల్సి ఉందని, ఎన్నికలకు కరోనా వైరస్ ఎఫెక్ట్ ఉంటుందని పలు పార్టీలు, సామాజిక సంఘాలు చెప్పడంతోనే వాయిదా నిర్ణయం తీసుకున్నామన్నారు. కరోనా ఎఫెక్ట్ పై పూర్తిస్ధాయిలో విచారణ చేశామని, కరోనా వైరస్‌ను నోటిఫై డిజాస్టర్ గా ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారని గుర్తు చేశారు. బ్యాలెట్ పేపర్ వాడడం వల్ల ఓటుకి ఎక్కువ సమయం పడుతుందని, చాలా సేపు క్యూలో నిలబడాల్సి ఉంటుందన్నారు. బ్యాలెట్‌ పేపర్‌ వల్ల కరోనా వైరస్‌ సోకే ప్రమాదం ఉందని, విధిలేని పరిస్దితుల్లో ఎన్నికల ప్రక్రియను ఆరువారాలు నిలిపివేస్తున్నామన్నారు. (ఏకగ్రీవాల హోరు.. వైఎస్సార్‌సీపీ జోరు)

మరిన్ని వార్తలు