ఉగాదిలోగానే స్థానిక ఎన్నికలు

1 Mar, 2020 04:47 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న మంత్రి బొత్స, పక్కన మంత్రి పేర్ని నాని, ఎంపీ బాలశౌరి తదితరులు

59.75 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకే కట్టుబడి ఉన్నాం

కోర్టు తీర్పును అనుసరించి ముందుకెళ్తాం

బీసీలకు అన్యాయం చేసేందుకు టీడీపీ కుట్రలు

మంత్రి బొత్స సత్యనారాయణ

సాక్షి, మచిలీపట్నం: రాష్ట్రంలోని మున్సిపాల్టీలు, నగరపాలక సంస్థలు, పంచాయతీ, ఇతర స్థానిక సంస్థల ఎన్నికలను ఉగాదిలోగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేసారు. శనివారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. పెరిగిన జనాభాకు అనుగుణంగా బీసీలతో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అన్యాయం చేయకూడదన్న తలంపుతోనే 59.75 శాతం రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించామన్నారు. రిజర్వేషన్లు అమలు కాకుండా మోకాలడ్డేందుకు కొంతమంది టీడీపీ నేతలు కోర్టుకెళ్లారని గుర్తు చేశారు. రిజర్వేషన్ల అమలుపై ప్రభుత్వాన్ని హైకోర్టు వివరణ కోరిందని, 59.75 శాతం రిజర్వేషన్లతో ఎందుకు ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించామో వివరిస్తూ కోర్టులో ప్రభుత్వం తరపున అఫిడవిట్‌ దాఖలు చేశామన్నారు.

రిజర్వేషన్ల అమలుపై హైకోర్టు కూడా సానుకూలంగానే స్పందిస్తుందని, సోమవారం వెలువడనున్న తుది తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగానే వస్తుందని ఆశిస్తున్నామన్నారు. కోర్టు తీర్పును అనుసరించి ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఎన్నికలు ఆలస్యమైతే కేంద్రం నుంచి వచ్చే నిధులు నిలిచిపోతాయని గుర్తు చేశారు. రానున్న వేసవిలో నగర, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని మంత్రి చెప్పారు. ఇళ్లస్థలాల కోసం విశాఖతోపాటు పలు జిల్లాల్లో భూ సమీకరణ ద్వారా భూములను సేకరించామన్నారు.

ఆన్‌గోయింగ్‌ స్కీమ్స్‌ కింద టిడ్కో నిర్మిస్తున్న ప్లాట్లను గతంలో అర్హత పొందిన లబ్ధిదారులకే కేటాయిస్తామన్నారు. ఇళ్ల నిర్మాణంలో రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా ఆదా అయిన రూ.400 కోట్లను లబ్ధిదారులకే సమానంగా పంచి వారు చెల్లించాల్సిన వాటా మొత్తాన్ని నిర్ణయిస్తామన్నారు.  ఆయన వెంట సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), ఎంపీ వల్లభనేని బాలశౌరి, పెడన ఎమ్మెల్యే జోగి రమేష్, కలెక్టర్‌ ఏఎండీ ఇంతియాజ్‌ ఉన్నారు.

మరిన్ని వార్తలు