టీడీపీలో కల్లోలం 

11 Mar, 2020 05:30 IST|Sakshi

‘స్థానిక’ ఎన్నికల వేళ చేతులెత్తేస్తున్న సీనియర్‌ నాయకులు

జేసీ, గంటా, నారాయణ వంటి ముఖ్యుల వైరాగ్యం 

చాలా మంది కీలక నేతల్లో స్తబ్దత 

ముఖ్య నేతల వరుస రాజీనామాలు.. 

అదే బాటలో క్యాడర్‌  

ప్రత్యామ్నాయాల కోసం బాబు తంటాలు 

సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి అగ్ని పరీక్షలా మారాయి. పోటీకి విముఖత చూపుతూ ముఖ్య నాయకులు నైరాశ్యంలో మునిగిపోగా, కీలక నాయకులు వరుసగా రాజీనామాలు చేస్తుండటం ఆ పార్టీకి ఏమాత్రం మింగుడు పడటం లేదు. స్థానిక బరిలో నిలిచేందుకు చాలా చోట్ల అభ్యర్థులు దొరక్క ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఈ పరిణామాలు పార్టీ శ్రేణుల్ని మరింత కుంగదీస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు ఇష్టానుసారం వ్యవహరించిన అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన జేసీ బ్రదర్స్‌ ప్రతిపక్ష పాత్ర పోషించలేక చేతులెత్తేయడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. స్థానిక ఎన్నికల్లో తాము పోటీ చేయలేమని ప్రకటించి తన బేలతనాన్ని చాటుకున్న జేసీ దివాకర్‌రెడ్డి.. మొత్తంగా స్థానిక ఎన్నికలను బహిష్కరించాలని చంద్రబాబును కోరడం పట్ల ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. జేసీ దివాకర్‌రెడ్డి చేతులెత్తేయడంతో ఆయన కుమారుడు పవన్‌కుమార్‌రెడ్డితో చంద్రబాబు మాట్లాడారు. స్థానిక ఎన్నికల్లో కాడి పడేయకుండా పరువు కాపాడాలని పవన్‌ను కోరినట్లు టీడీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.  

ఎలాగోలా నామినేషన్లు వేయండి 
- సీనియర్‌ నేతలు కాడి వదిలేస్తుండటంతో చంద్రబాబు నియోజకవర్గ ఇన్‌చార్జిలు, మండలాల నాయకులతో టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా, నేరుగా మాట్లాడుతున్నారు.  
ఎలాగైనా పోటీ చేయాలని, అభ్యర్థులు దొరక్కపోతే చురుగ్గా ఉన్న యువకులను గుర్తించి నామినేషన్లు వేయించాలని బతిమిలాడుతున్నట్లు ఆ పార్టీకి చెందిన ఓ సీనియర్‌ నేత చెప్పారు.  
అవసరమైన చోట్ల జనసేన, సీపీఐ పార్టీలకు చెందిన వారితో మాట్లాడుకుని వారిని పోటీకి నిలబెట్టి మద్దతు ఇవ్వాలని, పోటీ లేకుండా ఏకగ్రీవాలకు ఒప్పుకోవద్దని పదేపదే కోరుతున్నట్లు తెలిసింది. 
ముఖ్య నాయకులు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు చేతులెత్తేసిన ప్రాంతాల్లో ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసేందుకు ప్రతిపక్ష నేత చంద్రబాబు తంటాలు పడుతున్నారు. 

కీలక నేతలు కినుక 
- విశాఖపట్నంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పార్టీతో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. కేవలం తన నియోజకవర్గానికి మాత్రమే రిమితమై నామమాత్రంగా పని చేస్తున్నట్లు టీడీపీ వర్గాలు వాపోతున్నాయి. 
అధికారంలో ఉన్నప్పుడు నెల్లూరు జిల్లాలో చక్రం తిప్పిన మాజీ మంత్రి పి.నారాయణ ప్రస్తుతం అసలు బయటకు రావడం లేదు. ఈ ఎన్నికలను ఆయన పట్టించుకోకుండా దూరంగా ఉన్నారు.  
టీడీపీ హయాంలో హవా నడిపిన ముఖ్య నాయకులు, మాజీ మంత్రులు ఆది నారాయణరెడ్డి, మాగంటి బాబు, శిద్ధా రాఘవరావు, పత్తిపాటి పుల్లారావు వంటి పలువురు నేతలు స్థానిక ఎన్నికలను సీరియస్‌గా తీసుకోవడంలేదని ఆ పార్టీలో చర్చ జరుగుతోంది.  
అనేక నియోజకవర్గాల్లో ఇన్‌చార్జిలు కూడా చేతులెత్తేయడంతో ద్వితీయ శ్రేణి నాయకత్వం, కింది స్థాయి క్యాడర్‌ తీవ్ర నిరుత్సాహానికి లోనవ్వడం స్పష్టంగా కనిపిస్తోంది. 
జిల్లా నాయకులు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు ఎన్నికలను పట్టించుకోకపోవడంతో ఆయా ప్రాంతాల స్థానిక నాయకులు నేరుగా టీడీపీ రాష్ట్ర నాయకులు, కార్యాలయాలకు ఫోన్లు చేసి తమ పరిస్థితి ఏమిటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

వరుస రాజీనామాలతో అయోమయం  
- మరోవైపు ముఖ్య నాయకులు వరుసగా రాజీనామాలు చేస్తుండడం టీడీపీకి మరింత ఇబ్బందికరంగా మారిందని ఆ పార్టీ శ్రేణులు వాపోతున్నాయి.  
- వైఎస్సార్‌ జిల్లా పులివెందులకు చెందిన సతీష్‌రెడ్డి రాజీనామా చేయడం ఆ జిల్లాలో టీడీపీకి ఎదురు దెబ్బగా భావిస్తున్నారు.
- ఎన్నో సంవత్సరాల నుంచి పులివెందులలో పార్టీ కోసం పని చేసిన నాయకుడు ఒక్కసారిగా పార్టీని వీడడంతో ఆ పార్టీ క్యాడర్‌ తీవ్ర నిరుత్సాహంలో మునిగిపోయింది. 
నందమూరి బాలకృష్ణకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, మాజీ ఎమ్మెల్యే రెహమాన్‌ వైఎస్సార్‌సీపీలో చేరడంతో ఆయా ప్రాంతాల్లో టీడీపీ ఉనికి కోల్పోవడం ఖాయం అని ఆ పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు.   
- మరికొందరు ముఖ్య నాయకులు సైతం టీడీపీని వీడతారనే అనుమానాలు బాబు అండ్‌ కో ను కలవరపెడుతున్నాయి.

>
మరిన్ని వార్తలు