లోకల్‌ పాట్లు!

17 May, 2018 09:15 IST|Sakshi

ఎన్నికల వేళ నేతల సొంతింటి ‘కల’

మొన్న మెట్టు.. నిన్న కాలవ ఇళ్ల నిర్మాణాలకు భూమిపూజ

రాయదుర్గం అర్బన్‌: సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో స్థానికేతరులైన నేతలు రాయదుర్గం నియోజకవర్గంలో ‘లోకల్‌’ అనిపించుకోవడానికి ఇప్పటి నుంచే పాట్లు పడుతున్నారు. ‘స్థానికత’ గుర్తింపు తెచ్చుకుని ఓటర్లను తమవైపు ఆకర్షించేందుకు తెగ తాపత్రయ పడుతున్నారు. అధికార తెలుగుదేశం పార్టీలో పలువురు నేతలు ఎవరికి వారు ‘సొంతిం టి కల సాకారం’ కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నారు. టీడీపీలో ముగ్గురు నాయకులు ఎన్నికల్లో లబ్ధి పొందేందు కోసం నియోజకవర్గ కేంద్రం రాయదుర్గంలో పాగా వేస్తున్నారు. ఇందులో భాగంగా స్థానికేతరుడైన సిట్టింగ్‌ ఎమ్మెల్యే, మంత్రి కాలవ శ్రీనివాసులు నాలుగేళ్లుగా అద్దె ఇంట్లోనే ఉన్నారు. ఈ మధ్యే నేసేపేటలో సొంతింటి కోసం భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు.

రాయదుర్గం నియోజకవర్గంలోని ఉంతకల్లుకు చెందిన మెట్టు గోవిందరెడ్డి బెంగళూరులో పారిశ్రామికవేత్తగా స్థిరపడ్డారు. 2004 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2010 నుంచి 2015 వరకు ఎమ్మెల్సీగా కొనసాగారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున (2019) పోటీ చేయడానికి సమాయత్తమైన మెట్టు గోవిందరెడ్డికి ఇప్పటి దాకా పట్టణంలో స్వంత ఇల్లు లేదు. బెంగళూరు నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. స్థానికంగా ఉండరనే అపవాదును పోగొట్టుకునేందుకుఇటీవలే రాయదుర్గంలో సొంతింటి నిర్మాణం చేపట్టారు.

హైదరాబాద్‌కు చెందిన గుణపాటి దీపక్‌రెడ్డి 2012 ఉప ఎన్నికల్లో టీడీపీ తరఫున రాయదుర్గం అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కాపు రామచంద్రారెడ్డి చేతిలో ఘోర పరాజయం పొందారు. 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున కాలవ శ్రీనివాసులు గెలుపొందారు. అప్పటిదాకా అద్దె ఇంట్లో ఉండే దీపక్‌రెడ్డి.. కాలవ రాకతో అక్కడి నుంచి ఖాళీ చేశారు. అనంతరం ఎమ్మెల్సీ అయిన దీపక్‌రెడ్డి అనంతపురానికి మకాం మార్చారు.

మంత్రిపై అసంతృప్తి
నాలుగేళ్లుగా పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులో లేకపోయినప్పటికీ, ఆశించిన స్థాయిలో అభివృద్ధి పనులు జరగపోయినప్పటికీ, మరోసారి పోటీ చేయడానికి మంత్రి కాలవ సమాయాత్తం అవుతున్నారు. ఇప్పటి వరకు బీటీ ప్రాజెక్టుకు నీరు ఇస్తామని, ఎడారి నివారణ పనులు చేపడుతామని, మల్లికేతి నుంచి ఉంతకల్లు వరకు 10 టీఎంసీల నీరు నిల్వ చేయడానికి ప్రాజెక్టు చేపడుతామని, రాయదుర్గం పట్టణంలో రూ.2 కోట్లతో డ్రెయిన్‌ పనులు, 20 కోట్ల సీఎం హామీ నిధులతో సీసీరోడ్లు, డ్రెయిన్లు, వివిధ అభివృద్ధి పనులు చేపడుతామని జీఓలు జారీ చేస్తున్నా ఆచరణలో అమలుకు నోచుకోవడంలేదు. ఆశించినస్థాయిలో అభివృద్ధి పనులు జరగకపోవడంతో ప్రజలు మంత్రిపై అసంతృప్తితో రగిలిపోతున్నారు. 

వడదెబ్బతో మాజీ సర్పంచ్‌ మృతి
ముదిగుబ్బ: దేవరగుడ్డపల్లికి చెందిన మాజీ సర్పంచ్‌  బయపరెడ్డి(70) బుధవారం వడదెబ్బతో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు.. ఉదయం 11 గంటల సమయంలో అరటి తోట వద్దకు వెళ్లి మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఇంటికి చేరుకున్నాడు. కొద్దిసేపటికే అస్వస్థతకు గురై మృత్యువాత పడ్డాడు. వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ ఇందుకూరి నారాయణరెడ్డి, సింగిల్‌ విండో మాజీ అధ్యక్షులు ప్రభాకర్‌రెడ్డి, నరసింహారెడ్డి, భాస్కర్, రామిరెడ్డి తదితరులు బయపరెడ్డి మృతికి నివాళులర్పించారు.

యువ రైతు మృత్యువాత
గుత్తి రూరల్‌: ఊటకల్లుకు చెందిన రైతు ఎస్‌.రమణారెడ్డి(28) వడదెబ్బతో మంగళవారం అర్ధరాత్రి మృతి చెందాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రమణారెడ్డి మంగళవారం ఉదయం నుంచి ఎర్రటి ఎండలో గ్రామ శివార్లలోని తన మామిడి తోటలో వ్యవసాయ పనులు చేశాడు. సాయంత్రం ఇంటికి వచ్చి భోజనం చేసి పడుకున్నాడు. రాత్రి తనకు బాగాలేదని కుటుంబసభ్యులకు చెప్పాడు. అర్ధరాత్రి భార్య అనూష లేచి అతడిని లేపింది. ఎంతకీ లేవకపోవడంతో బంధువులు, ఇరుగుపొరుగు వారు వచ్చి పరిశీలించగా అప్పటికే రమణారెడ్డి మృతి చెందాడు.

మరిన్ని వార్తలు