లోకల్‌ వర్సెస్‌ నాన్‌ లోకల్‌ 

24 Mar, 2019 08:33 IST|Sakshi
గల్లా జయదేవ్‌, వేణుగోపాలరెడ్డి 

రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందిన ప్రాంతం గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గం. ఇప్పుడు రాష్ట్ర పరిపాలనకు కూడా కేంద్ర బిందువు. ఈ నియోజకవర్గం ఎంతో మంది మహానేతలకు రాజకీయ భవిష్యత్తును ఇచ్చింది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గుంటూరు పార్లమెంట్‌ స్థానంలో లోకల్‌ వర్సెస్‌ నాన్‌ లోకల్‌ వార్‌ నడుస్తోంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గుంటూరు మిర్చి యార్డు, విద్యా సంస్థలు, యూనివర్సిటీలు ఈ నియోజకవర్గం పరిధిలో ఉన్నాయి. వాణిజ్య పంటలైన మిర్చి, పత్తి, పసుపులతో పాటు వరి, జొన్న, మొక్క జొన్న పంటలు రైతులు ఎక్కువగా పండిస్తుంటారు. గుంటూరు తూర్పు, పశ్చిమ, ప్రత్తిపాడు(ఎస్సీ), తాడికొండ(ఎస్సీ), పొన్నూరు, మంగళగిరి, తెనాలి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. కమ్మ, కాపు, ముస్లిం ఓటర్లు ఇక్కడ పోటా పోటీగా ఉంటారు. వారి తర్వాత రెడ్డి, ఎస్సీ, బీసీ ఓటర్లు నిలుస్తారు.  


రాజకీయ చరిత్ర ఇలా..  
గుంటూరు పార్లమెంట్‌ రాజకీయ ఉద్దండులకు నెలవైన నియోజకవర్గం. కొత్త రఘురామయ్య, ఎన్‌జీ రంగా వంటి మహానేతలు ఇక్కడి నుంచే రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1952లో మొదటిసారి  ఎన్నికల్లో ఇండిపెండెంట్‌ అభ్యర్థి ఎస్‌.వి.ఎల్‌. నరసింహం విజయం సాధించారు. 16 సార్లు ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్‌(ఐ) ఏడుసార్లు, కాంగ్రెస్‌ ఐదుసార్లు, టీడీపీ మూడుసార్లు, ఇండిపెండెంట్‌ ఒకసారి విజయం సాధించాయి. 1984 టీడీపీ ప్రభంజనంలోనూ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. కొత్త రఘురామయ్యను ఐదుసార్లు, ఎన్‌జీ రంగా, రాయపాటి సాంబశివరావులను మూడుసార్లు ఈ నియోజకవర్గ ప్రజలు ఆదరించారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గల్లా జయదేవ్, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బాలశౌరిపై విజయం సాధించారు. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో గుంటూరు పార్లమెంట్‌ స్థానానికి టీడీపీ సిట్టింగ్‌ ఎంపీ గల్లా జయదేవ్, వైఎస్సార్‌సీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి పోటీలో ఉన్నారు.  


ఐదేళ్లకోసారి గల్లా దర్శనం 
2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలుపొందిన గల్లా జయదేవ్‌పై స్థానికేతరుడు అనే ముద్ర బలంగా పడింది. ఈయనపై  ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి కృషి చేస్తారని నమ్మి ఓటేసిన ప్రజలను గల్లా మోసం చేశారనే విమర్శలున్నాయి. ఎన్నికల నేపథ్యంలో ఇటీవల ఆ పార్టీ కార్యకర్తలు, డివిజన్‌ స్థాయి నేతలతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గల్లా మాట్లాడుతూ ‘‘ఐదు సంవత్సరాల తర్వాత మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది.’’ అన్నారని ఆ పార్టీ నాయకులే చర్చించుకుంటున్నారు. గల్లా గెస్ట్‌ ఎంపీ అనడానికి ఈ ఒక్క ఉదాహరణే నిదర్శనం.  


దూసుకుపోతున్న మోదుగుల... 
నరసరావుపేట ఎంపీగా ఉన్న సమయంలో రాష్ట్ర విభజన, జిల్లా సమస్యలపై పార్లమెంట్‌లో గళం విప్పిన మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి అందరికీ సుపరిచితులే. ‘తాడికొండ నియోజకవర్గం నా సొంత ఊరు, పొన్నూరు నియోజకవర్గం నా అత్త గారి ఊరు, గుంటూరులో పుట్టి పెరిగిన నేను పక్కా లోకల్‌. రాజకీయాలకు వలస వచ్చి గుంటూరు ప్రజలను వాడుకుంటున్న గల్లాను గుల్ల చేస్తానంటూ మోదుగుల దూకుడు పెంచుతున్నారు. ఇదే సందర్భంలో సొంత పార్టీలో అసమ్మతి సెగలు, జిల్లా సమస్యల పరిష్కారంలో టీడీపీ ఘోరంగా విఫలం అవడం మోదుగులకు సానుకూలంగా మారింది.  


 అభివృద్ధి ఆనవాళ్లే లేవు.. 
ఐదేళ్ల టీడీపీ పాలనలో గుంటూరు పార్లమెంట్‌ పరిధిలో అభివృద్ధి ఏమీ జరగలేదు. గత ప్రభుత్వ హయాంలో గుంటూరుకు 24 గంటలు తాగు నీరు అందించేందుకు కేంద్ర నిధులతో ప్రారంభించిన సమగ్ర మంచి నీటి పథకం, 2014లో ప్రారంభించిన అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, రోడ్ల విస్తరణ పనులు ఎక్కడ వేసినవి అక్కడే అన్నట్లున్నాయి. ఎంపీ దత్తత తీసుకున్న గ్రామాల్లో సైతం అభివృద్ధి ఆనవాళ్లు లేకపోవడం గమనార్హం. 
 
అభివృద్ధిలో వైఎస్‌ ముద్ర పదిలం...  
∙గుంటూరు వాసుల దాహార్తి తీర్చేలా 24 ఎంఎల్‌డీ నీటి శుద్ధి కర్మాగారాలను రక్షిత నీటి పథకంలో భాగంగా నిర్మించారు. 
∙ఆరోగ్యశ్రీ –2ను గుంటూరులోనే ప్రారంభించారు. 
∙అడవితక్కెళ్ళపాడులో రాజీవ్‌ గృహకల్ప తొలి విడతలో ఇళ్లు నిర్మించి ఇచ్చారు.
∙తెనాలికి రూ.100 కోట్ల వ్యయంతో రక్షిత మంచినీటి పథకానికి శంకుస్థాపన చేశారు.
∙మంగళగిరిలో అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
∙సీమాంధ్రలో ఎక్కడా లేని విధంగా సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ నిర్మాణానికి  ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 
∙పొన్నూరులో మున్సిపాలిటీ భవన నిర్మాణానికి రూ.కోటి మంజూరు చేశారు.
∙తాడేపల్లిని మున్సిపాలిటీ చేసేందుకు, రూ.40 కోట్లతో మంచి నీటి పథకం నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు.  


మొత్తం ఓటరు      15,67,557 
పురుష ఓటర్లు      7,68,216 
మహిళలు            7,99,196 
జనాభా                21,64,356
పురుషులు          10,82,385 
మహిళలు            10,81,948 

 

మరిన్ని వార్తలు