పేదల ఊసే లేదు, రాష్ట్రాలకు సాయం లేదు

14 Apr, 2020 12:41 IST|Sakshi
ఫైల్ ఫోటో

నా ప్రియమైన దేశమా శోకించు- చిదంబరం

సాక్షి, న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతినుద్దేశించి మంగళవారం చేసిన ప్రసంగం, లాక్‌డౌన్‌ పొడిగింపు పరిణామాలపై మాజీ ఆర్థికమంత్రి, కాంగ్రస్ సీనియర్ నేత పీ చిదంబరం స్పందించారు.   ప్రధాని ప్రసంగం ముగిసిన వెంటనే ఆయన ట్విటర్ ద్వారా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కరోనా వైరస్  విస్తరిస్తున్నక్రమంలో తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకున్న లాక్‌డౌన్‌ పొడిగింపు నిర్ణయాన్ని స్వాగతించిన చిదంబరం, పేదలు, వలస, రోజువారీ కార్మికుల జీవనోపాధి, మనుగడపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. లాక్‌డౌన్‌ను ప్రకటించేముందు  ప్రధాని మోదీ పేదల జీవనంపై కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు.ఈ సంక్షోభ సమయంలో పేదలకు కనీస నగదు సాయాన్ని ప్రభుత్వం ప్రకటించాలని, అదే మొదటి ప్రాధాన్యతగా వుండాల్సి వుందని చిదంబరం అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో ఒక్కరూపాయి కూడా కేటాయించకపోవడం ఆయన మండి పడ్డారు. డబ్బు, ఆహారం ఉన్నా ప్రభుత్వం పేదలకు కేటాయించడంలో సుముఖత చూపలేదు. దీంతో వారి జీవితాలు, మనుగడ లాంటి అంశాలు ప్రభుత్వ ప్రాధాన్యాల్లో లేవని స్పష్టంగా తెలుస్తోందన్నారు. దీంతో పేదలు 21+19 రోజులు ఆకలితో అలమటిస్తూ లాక్‌డౌన్‌ పరిస్థితుల్లోకి నెట్టబడ్డారు. నా ప్రియమైన దేశమా శోకించు అని ట్వీట్ చేశారు. అంతేకాదు ప్రధాని నాల్గవసారి జాతికిచ్చిన  సందేశంలో కొత్తగా ఏమీలేదని  మాజీ ఆర్థికమంత్రి విమర్శించారు.  

లాక్‌డౌన్‌ సంక్షోభం నుంచి పేదలు ఎలా బయటపడతారనే దాని గురించి ప్రధాని ఏమీ చెప్పలేదు. అలాగే వివిధ  రాష్ట్రాల ముఖ్యమంత్రులు డిమాండ్ చేసిన ఆర్థిక సాయంపై ఎలాంటి స్పందన లేదు. మార్చి 25న ప్రకటించిన ప్యాకేజీకి ఒక్క రూపాయి కూడా అదనంగా జోడించలేదని  చిదంబరం ఆగ్రహం వ్యక్తం చేశారు. లాక్‌డౌన్‌ పర్యవసానంగా దేశవ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవన చర్యలేవీ మోదీ ప్రస్తావించలేదని నిరాశ వ్యక్తం చేశారు. రాష్ట్రాలు రుణాలు తీసుకుంటే, ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవనం కోసం, కేంద్రం అప్పు తీసుకొని రాష్ట్రాలకు రుణాలు ఇవ్వాలని చిదంబరం సలహా ఇచ్చారు. ఈ విషయంలో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ సహా, జీన్ డ్రేజ్, ప్రభాత్ పట్నాయక్, అభిజిత్ బెనర్జీ లాంటి ఆర్థిక నిపుణుల సలహాలేవీ ప్రధాని చెవికి  చేరకపోవడం శోచనీయమన్నారు. (కరోనా : తల్లినుంచి నవజాత శిశువుకు వచ్చే ప్రమాదం)

కాగా కరోనావైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ మే 3 వరకు పొడిగించినట్టు ప్రధాని మోదీ ప్రకటించారు. పౌరులు సహకరించి క్రమశిక్షణను కొనసాగిస్తేనే కోవిడ్-19  వ్యతిరేక పోరాటం విజయవంతమవుతుందని  ఆయన  పేర్కొన్న సంగతి తెలిసిందే. (కరోనా వ్యాక్సిన్ : రెండో దశ క్లినికల్ ట్రయల్స్)

మరిన్ని వార్తలు